Sobhan Babu Statue In Village | చిన నందిగామ లో శోభన్ బాబుకు చిన్న విగ్రహం పెట్టుకోలేమా.? | ABP Desam
అందాల నటుడు శోభన్ బాబు పుట్టిన చిన్న నందిగామ ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. ఆయన సొంత ఇల్లు ఇప్పటికీ అదే ఊర్లో ఉంది. పుట్టిన ఊరు మీద మమకారంతో శేషాలయ, సూర్యాలయ పేరుతో రెండు బిల్డింగులు కట్టించడంతోపాటు ఊరి పంచాయతీ కార్యాలయానికి స్థలాన్ని సైతం దానం చేశారు శోభన్ బాబు. ఎప్పుడు చిన్న నందిగామ వచ్చినా ఊళ్లోని స్నేహితులను కలుస్తూ సరదాగా గడిపేవారట ఆయన. నట భూషణుడు చేసిన గుప్తదనాలు చాలా ఉన్నాయని ఊరివాళ్ళు చెప్తున్నారు. ఇంత పేరు తెచ్చిన శోభన్ బాబు కి..అంత పెద్ద సూపర్ స్టార్ కి సొంత ఊళ్ళో కనీసం ఒక్క విగ్రహమైనా లేదు. కుటుంబీకులు సొంత స్థలం ఇవ్వడానికి రెడీ గానే ఉన్నారు. కానీ ఆయన విగ్రహం అక్కడ పెట్టాలన్న ఆలోచన ఆ ఊరి పెద్దలకు గాని, స్థానిక రాజకీయ నాయకులకు గాని లేకపోవడం విచారకరం అంటున్నారు గ్రామస్తులు. చాలాకాలం గా దానికోసం ప్రయత్నిస్తున్నామనీ కానీ ఫలితం లేదని చెబుతున్నారు. ఎన్టీఆర్,శోభన్ బాబు ఇద్దరి విగ్రహాలు కలిపి పెట్టాలనేది వారి డిమాండ్.






















