FPI Exits: ఫారిన్ ఇన్వెస్టర్లు పోతే పోనీ అన్నాయ్, మార్కెట్‌లో మన లెక్కలు మనకున్నాయ్!
FPIల అమ్మకాలకు ఇండియన్ మార్కెట్లలోని పరిస్థితులు ప్రతిబింబం కాదు.
Share Market Updates: గత కొన్ని త్రైమాసికాల్లో ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) విపరీతమైన అమ్మకాల ఒత్తిడి పెట్టినా, భారతీయ మార్కెట్లు గతంలో ఎన్నడూలేనంత గట్టిగా తట్టుకున్నాయి. సాధారణంగా, FPIలు వెళ్లిపోతే సంపద కరిగిపోతుంది, కానీ ఇండియన్ ఈక్విటీస్‌లో అలాంటి మెల్ట్‌డౌన్ కనిపించలేదు.
దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ఒత్తిడిని అధిగమించే ఆదాయం కోసం, ప్రజలు సాంప్రదాయ పెట్టుబడి మార్గాలను (ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ వంటివి) ఎంచుకుంటారు. కానీ, స్టాక్ మార్కెట్ల అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కారణంగా
ఈక్విటీస్‌లోకి పెట్టుబడులు పెంచుతున్నారు.
ఇండియా గ్రోత్ స్టోరీని చూసి పెట్టుబడులు పెట్టాలి
ప్రపంచ భౌగోళిక రాజకీయ సమస్యలతో ఎక్కువ సంబంధం ఉన్న FPI అమ్మకాల గురించి ఆలోచించి, ఆందోళన చెందడం కంటే.. భారతదేశ వృద్ధి పథంపై దీర్ఘకాలిక పెట్టుబడిదార్లు దృష్టి పెట్టాలన్నది మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయం. ఫారిన్ ఇన్వెస్టర్ల మూమెంట్‌ను చూసి కాదు, ఇండియా గ్రోత్ స్టోరీని చూసి పెట్టుబడులు పెట్టాలన్నది వాళ్ల సూచన.
"FPIలు, వాళ్ల స్వదేశీ మార్కెట్లలోని ఆర్థిక పరిస్థితుల ఆధారంగా, సొంత నిబంధనలకు అనుగుణంగా ట్రేడ్ చేస్తారు. కాబట్టి, FPIల అమ్మకాలకు ఇండియన్ మార్కెట్లలోని పరిస్థితులు ప్రతిబింబం కాదు. వచ్చే పదేళ్లలో, ఇండియా గ్రోత్ స్టోరీ అత్భుతంగా ఉంటుంది" అని ఎడెల్‌వీస్ మ్యూచువల్ ఫండ్ MD & CEO రాధిక గుప్తా చెబుతున్నారు. కరోనా తర్వాతి ర్యాలీ సమయంలో రిటైల్ పెట్టుబడిదార్లు రాబడిని ఆర్జించగా, FPIలు ఆలస్యంగా ర్యాలీలోకి అడుగు పెట్టిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.
FPIల అమ్మకాలను రిస్క్‌గా పరిగణించకూడదు, షేర్లను తక్కువ ధరల దగ్గర కొనుగోలు అవకాశంగా చూడాలన్నది GEPL క్యాపిటల్‌లోని మ్యూచువల్ ఫండ్స్ హెడ్ రూపేష్ బన్సాలీ చెప్పిన మాట. ఎందుకంటే, రిటైల్ ఇన్వెస్టర్లు FPIల నుంచి లోకల్ అసెట్స్‌ను కొంటారు తప్ప, వాళ్ల అప్పులను కాదని చెబుతున్నారు. "2008 - 2014 మధ్య, FPIలు మార్కెట్ గరిష్ట స్థాయుల్లో ఈక్విటీలను అమ్మారు, తక్కువ స్థాయుల్లో తిరిగి ప్రవేశించారు. అయితే, గత మూడు సంవత్సరాల్లో, ఇండియన్ మార్కెట్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు కూడా షేర్లలో షాపింగ్ చేశారు" అని చెప్పారు. FPIల కొనుగోళ్ల తర్వాత, బీట్-డౌన్ రంగాల్లోని స్టాక్స్ బాగా లాభపడుతున్నాయి.
ఈ ఇద్దరు ఎక్స్‌పర్ట్స్ చెప్పిన ప్రకారం... FPIలు ఇండియన్ మార్కెట్ నుంచి వెళ్లినా, మళ్లీ కచ్చితంగా తిరిగొస్తారు. కాబట్టి, వాళ్లను గురించి ఆలోచించడం అనవసరం.
రికార్డ్ స్థాయిలో DIIల కొనుగోళ్లు
ప్రత్యక్ష పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్‌లోకి సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) పథకాలు, నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) వంటి వివిధ మార్గాల ద్వారా రిటైల్ డబ్బు ఇండియన్ స్టాక్ మార్కెట్‌లోకి భారీగా వస్తోంది. గత రెండేళ్లలో, నెలవారీ ప్రాతిపదికన, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIలు) రికార్డు స్థాయిలో రూ. 3.4 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టారు. మరోవైపు, అదే కాలంలో FPIలు రూ. 93,642 కోట్లను వెనక్కి తీసుకున్నారు.
అంతేకాదు, మ్యూచువల్ ఫండ్స్‌లోకి నెలవారీ SIP ఇన్‌ఫ్లో ఈ ఏడాది ఆగస్టులో రికార్డు స్థాయిలో రూ. 15,814 కోట్లకు చేరుకుంది. NPS ఈక్విటీ AUM రెండేళ్ల క్రితం నాటి రూ. 67,467 కోట్లతో పోలిస్తే, ఈ ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి రూ. 1.8 లక్షల కోట్లు దాటింది. గత రెండేళ్లలో, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETFs) ద్వారా పాసివ్ ఇన్వెస్ట్‌మెంట్లు రూ.1.4 లక్షల కోట్లకు చేరాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: అతి త్వరలో మార్కెట్‌లోకి షేర్ల సునామీ, గేట్లు ఎత్తేందుకు సిద్ధంగా ఉన్న ఇన్వెస్టర్లు
Join Us on Telegram: https://t.me/abpdesamofficial