Pahalgam Terror Attack: వారికి జైలుశిక్ష, జరిమానా - పాక్ జాతీయులకు భారత్ మరో బిగ్ షాక్
నిర్దేశించిన గడువులోగా భారతదేశం నుంచి తిరిగి వెళ్లిపోని పాకిస్తాన్ పౌరులు జరిమానాతో పాటు జైలుశిక్ష ఎదుర్కొంటారని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.

Kashmir Terror Attack | న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడితో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గతంలో ఏ సమస్యా ఉన్నా పాక్ జాతీయులు భారత్‌ను ఆశ్రయించేవారు. కానీ ఇటీవల కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో దాయాది దేశం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మరోవైపు భారత్ నిర్ణయాలతో పాక్ ప్రభుత్వం దిగొచ్చి, విచారణకు సహకరిస్తామని చెప్పింది. భారతదేశంలో ఉంటున్న పాకిస్తాన్ పౌరులకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది.
వారికి జరిమానా, జైలుశిక్ష
తాము నిర్దేశించిన గడువులోగా భారతదేశం విడిచి వెళ్లని పాకిస్తాన్ పౌరులు జైలుశిక్షతో పాటు జరిమానా చెల్లించాల్సి వస్తుందని కేంద్రం హెచ్చరించింది. ఎవరైనా పాక్ జాతీయుడు గడువు ముగిసినా భారతదేశంలో ఉన్నట్లు గుర్తిస్తే వారికి మూడు సంవత్సరాల జైలుశిక్ష, లేదా రూ. 3 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఈ రెండు అమలు చేస్తామని పాక్ జాతీయుల్ని హెచ్చరించారు.
సాధారణ వీసా మీద భారత్ లో ఉంటున్న పాక్ జాతీయులు ఏప్రిల్ 27 లోగా దేశాన్ని విడిచి వెళ్లిపోవాలి. ప్రత్యేక వీసా, మెడికల్ వీసాలపై భారత్ వచ్చిన వారు ఏప్రిల్ 29 తేదీలోగా దేశం విడిచి తిరిగి పాకిస్తాన్ వెళ్లిపోవాలని కేంద్ర హోంశాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించి భారత్‌లో ఉండేవారికి జైలుశిక్ష, జరిమానా విధిస్తామని ఆదేశాలు జారీ చేసింది.
సరిహద్దుల వద్ద పాక్‌కు క్యూ కట్టిన ప్రజలు
భారత్ నుంచి గత నాలుగైదు రోజులుగా పాక్ జాతీయులు తమ దేశానికి తిరిగి వెళ్లిపోతున్నారు. ఎంతో బాధతో భారత్ ను వీడుతున్న ప్రజలు.. ఉగ్రదాడులు ఎవరు చేసినా తప్పే అంటున్నారు. కొందరు ఉగ్రవాదుల వల్ల రెండు దేశాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. బంధువులను వీడాలంటే కష్టంగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. భారత ప్రభుత్వం పాక్ పౌరులకు అన్ని రకాల వీసాలు రద్దు చేసింది. దాంతోపాటు పాక్ పౌరులు భారత్ వీడేందుకు డెడ్ లైన్ పెట్టింది. సాధారణ వీసా (సార్క్ వీసాలు) మీద వచ్చిన వారు ఏప్రిల్ 27లోగా, మెడికల్ వీసా, ఇతర ఎమర్జెన్సీ వీసాల మీద భారత్ లో ఉంటున్న వారు ఈ 29 లోగా దేశాన్ని వీడాలని కేంద్ర హోం శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి పాక్ జాతీయుల్ని గుర్తించి, వారి దేశానికి తిరిగి పంపించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆదివారం నాటికి బయలుదేరాల్సిన పాకిస్తాన్ జాతీయులు వీసా వర్గాల జాబితాలో వీసా ఆన్ అరైవల్, జర్నలిస్ట్, ట్రాన్సిట్, బిజినెస్, ఫిల్మ్, కాన్ఫరెన్స్, ట్రెక్కింగ్, స్టూడెంట్, విజిట్, గ్రూప్ టూరిస్ట్, టూరిస్ట్ వీసాలు ఉన్నాయి.
ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని పాక్ ఖండించకపోగా, భారతే దానికి కారణమని.. కేంద్రంపై ఉన్న వ్యతిరేకత ఉగ్రదాడి రూపంలో బయట పడిందని పిచ్చి కూతలు కూయడంతో భారత్ కఠిన చర్యలు చేపట్టింది.






















