Pahalgam Terrorist Attack: పాక్ ఆర్మీతో కలిసి పోరాడతాం, భారత్‌లోకి చొచ్చుకొస్తాం! ప్రాణాలు అర్పించేందుకు రెడీ: జేయూఈఐ నేత వార్నింగ్
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది. అయితే జమీయత్ ఉలేమా-ఇస్లాం పాక్ సైన్యంతో కలిసి పోరాటం చేస్తుందని భారత్ ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ హెచ్చరించారు.

Pahalgam Terrorist Attack: ఓవైపు భారత్ చర్యలతో తలొగ్గి పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పహల్గాం ఉగ్రదాడిపై విచారణకు సహకరిస్తాం అన్నారు. ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదాన్ని సహించేది లేదని, దాని వల్ల పాక్ ఎంతగానో నష్టపోయిందన్నారు. అలా అంటూనే పాక్ తన కవ్వింపు చర్యలు, కుయుక్తులు ఆపడం లేదు. పాకిస్థాన్ జమీయతులేమా-ఇస్లాం నేత మౌలానా రషీద్ మహ్మద్ సూమ్రో భారత్‌ను హెచ్చరిస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇదివరకే పాక్ డిప్యూటీ ప్రధాని అయితే పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన వారిని ఏకంగా పాకిస్తాన్ స్వాతంత్య్ర సమరయోధులుగా అభివర్ణించడం భారత్ కు మరింత చికాకు కలిగిస్తోంది. ప్రధాని షరీఫ్ మాత్రం భారత్ చర్యలతో వెనక్కి తగ్గుతున్నారు.
రషీద్ మహ్మద్ సూమ్రో భారత్‌కు బెదిరింపులు
పాకిస్థాన్ జమీయత్ ఉలేమా-ఇస్లాం నేత మౌలానా రాషిద్ మహ్మద్ సూమ్రో భారత్‌ను హెచ్చరించాడు. పాకిస్థాన్ ఒంటరిగా లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ అర్థం చేసుకోవాలి. అవసరమైతే పాకిస్థాన్ సైన్యంతో కలిసి తాము పోరాడతామని, పాకిస్థాన్ కోసం తమ ప్రాణాలను అర్పించేందుకు సిద్ధమని స్పష్టం చేశాడు. తమ సరిహద్దులను మాత్రమే కాకుండా, భారతదేశంలోకి చొచ్చుకుపోయి దారులుల్ ఉలూమ్ దేవ్‌బంద్‌లో టీ తాగుతాం, బ్రేక్ ఫాస్ట్ కూడా చేస్తామని అన్నాడు. వాస్తవానికి జమీయత్ ఉలేమా-ఇస్లాం అనేది ఓ రాజకీయ పార్టీ. దీనిని 1945లో స్థాపించారు. 1988లో ఇది రెండు వర్గాలుగా విడిపోయింది. జమీయత్ ఉలేమా-ఇస్లాం, జమీయత్ ఉలేమా-ఇస్లాం ఎఫ్ (ఫజల్ ఉర్ రెహమాన్) అనే రెండు విభాగాలుగా మారింది.
పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఏమన్నారు..
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ భారత్ చర్యలతో దిగొచ్చారు. శుక్రవారం వరకు చేసిన ప్రకటనలపై కాస్త వెనక్కి తగ్గారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం బైసరన్ లోయలో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రదాడి ఘటనపై ఏదైనా 'నిష్పక్షపాతమైన, పారదర్శకమైన' విచారణకు తాము సిద్ధంగా ఉన్నామని శనివారం ఆయన అన్నారు. పాకిస్థాన్ అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఖండిస్తోందని, తమ దేశం సైతం ఉగ్రవాద బాధిత ప్రాంతం అని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
డాన్.కామ్ నివేదించన వివరాల ప్రకారం.. కాకుల్‌లోని పాకిస్థాన్ మిలిటరీ అకాడమీలోని పాసింగ్-అవుట్ పెరేడ్ జరిగింది. ఇందులో పాల్గొన్న షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడితో మాకు ఎలాంటి సంబంధం లేదు. భారత్ పాకిస్థాన్‌పై నిరాధారమైన, అబద్ధమైన ఆరోపణలు చేస్తోంది. ఒక బాధ్యతాయుతమైన దేశంగా పాకిస్తాన్ తన పాత్రను పోషించాలనుకుంటోంది. పహల్గాం ఉగ్రదాడిపై భారత్ నిష్పక్షపాతమైన, పారదర్శకమైన విచారణ చేపడితే అందుకు మేం సహకరిస్తాం" అని అన్నారు.
ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రదాడి
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22న లష్కరే తోయిబా ఉగ్రవాద అనుబంధ గ్రూప్ జరిపిన ఉగ్రదాడితో భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తత పెరిగింది. ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్థాన్‌ను దెబ్బకొట్టేలా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జల ఒప్పందంపై నిషేధం, పాకిస్తాన్ పౌరులకు అన్ని రకాల వీసాలు రద్దు చేసింది. పాకిస్థాన్ హైకమిషన్‌లోని ఉద్యోగుల సంఖ్యను తగ్గించడంతో పాటు ఏప్రిల్ 27 లోగా పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని, అత్యవసర మెడికల్ వీసాలపై వచ్చిన వారు సైతం ఏప్రిల్ 29లోగా భారత్ నుంచి వెళ్లిపోవాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.






















