Viral Video: దేశ రక్షణకు ఎల్లప్పుడూ సిద్ధమే, మేం ఫియర్‌లెస్, అన్‌స్టాపబుల్ - Indian Army వీడియో చూశారా
Pahalgam Terror Attack | దేశ ప్రజల రక్షణకు, దేశాన్ని కాపాడేందుకు తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని, ఫియర్ లెస్, అన్‌స్టాపబుల్ అని ఇండియన్ ఆర్మీ పోస్ట్ చేసిన వీడియో ట్రెండ్ అవుతోంది.

Kashmir Terrorist Attack | న్యూఢిల్లీ: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి భారత్, పాక్ మధ్య దౌత్య సంబంధాలను దూరం చేస్తోంది. జమ్మూకాశ్మీర్ లో పాక్ ఉగ్రవాదుల దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. దాయాది పాకిస్తాన్ కు గట్టిగా గుణపాఠం చెప్పే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. మరోవైపు ఆర్మీ ఉగ్రవాదుల కోసం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టింది. అనుమానిత ఉగ్రవాదుల ఇండ్లను కూల్చివేసి తమ ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. దౌత్యపరమైన, వాణిజ్య పరమైన నిర్ణయాలు తీసుకుంటూ పాక్ ను భారత ప్రభుత్వం దెబ్బకొట్టింది.
పాకిస్తాన్ ఉగ్రవాదులు, మిలిటెంట్లతో పోరుకు తాము ఎప్పుడూ సిద్ధమేనని భారత ఆర్మీ తమ ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. భారత ఆర్మీ అంటే అన్‌స్టాపబుల్ అని, ఎలాంటి కఠిన పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ ఇండియన్ ఆర్మీ ఓ వీడియో పోస్ట్ చేసింది. దేశ ప్రజలను కాపాడేందుకు తామెప్పుడూ ఓ అడుగు ముందే ఉంటామని.. ఎలాంటి కఠిన సవాళ్లు వచ్చినా అధిగమించేందుకు ఎల్లప్పుడూ సిద్ధమేనని వీడియో ద్వారా ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ కు సంకేతాలు పంపింది. ఫియర్‌లెస్ ఇండియన్ ఆర్మీ అంటూ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
సరిలేరు మాకెవ్వరూ..
ఆకాశమైనా, భూమి అయినా, నీళ్లలో అయినా వెనకడుకు వేసే ప్రసక్తే లేదని.. దేశం కోసం జరిగే పోరులో తాము తగ్గేదే లేదని భారత ఆర్మీ పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులతో పాటు ఉగ్రసంస్థల మూలాలు లేకుండా చేసేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయి. జమ్మూకాశ్మీర్ లో భారత ఆర్మీ ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ ముమ్మరం చేసింది. ఇదివరకే లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ అల్తాఫ్ లల్లీని భద్రతా బలగాలు మట్టుపెట్టాయి.
పాక్ జాతీయుల అన్ని రకాల వీసాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రద్దు చేయడంతో ఈ నెల 27 లోగా వారు భారత్ విడిచి వెళ్లాలి. మెడికల్ వీసా మీద వచ్చిన వారు ఏప్రిల్ 29లోగా భారత్ విడిచి పాకిస్తాన్ తిరిగి వెళ్లాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం కేంద్ర మంత్రి అమిత్ షా ఆదేశాలు జారీ చేశారు. మరో రెండు, మూడు రోజుల్లో పాక్ జాతీయులు భారతదేశాన్ని వీడతారు. ఆ తరువాత కేంద్రం ఎలాంటి చర్యలు చేపడుతుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.






















