Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్, నిందితుడు ఎవరో తెలిస్తే షాక్ !
భారత క్రికెట్ టీం ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానంటూ బెదిరింపు ఇమెయిల్స్ పంపిన నిందితుడ్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ఇంజినీరింగ్ విద్యార్థి అని తెలిపారు.

Threat Mails To Gautam Gambhir | ఢిల్లీ: భారత సీనియర్ క్రికెట్ జట్టు ప్రధాన కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానని బెదిరించిన నిందితుడ్ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్ పంపిన కేసులో ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థిని శనివారం అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఓ ఢిల్లీ పోలీస్ అధికారి తెలిపారు. ఆ విద్యార్థికి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని భావిస్తున్నారు. ఉన్నాయి.
గుజరాత్‌కు చెందిన జిగ్నేష్‌సింగ్ పర్మార్ అనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 22న కాశ్మీర్‌లోని పహల్గాంలో ద రెసిస్టెంట్ ఫ్రంట్ టెర్రరిస్టులు 26 మందిని కాల్చి చంపారు. అదే రోజు అనుమానాస్పద జీమెయిల్ ఖాతా నుండి గంభీర్‌కు బెదిరింపు మెయిల్స్ పంపాడు పర్మార్.
ఇంజనీరింగ్ విద్యార్థిని అరెస్ట్ చేశాం..
డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) ఎం హర్ష వర్ధన్ ఈ విషయంపై ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ జిగ్నేష్ సింగ్ పర్మార్ ఓ ఇంజనీరింగ్ విద్యార్థి. అతడి మానసిక పరిస్థితి బాగోలేదు. అతడు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని విద్యార్థి కుటుంబం తెలిపింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది" అని పేర్కొన్నారు. గౌతమ్ గంభీర్‌కు సంబంధించిన ఇమెయిల్ ఐడీలో బెదిరింపు మెయిల్ వచ్చిందని పోలీసులు మొదట వెల్లడించారు.
ఐ కిల్ యు అని బెదిరింపులు
బెదిరింపు మెయిల్స్ స్క్రీన్‌షాట్లతో కూడిన ఇమెయిల్ ఫిర్యాదును రాజిందర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో దాఖలు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, "ఐ కిల్ యు" అని రాసిన రెండు బెదిరింపు మెయిల్స్ మాజీ క్రికెటర్ గంభీర్‌కు వచ్చాయి. వాటిని "ఐసిస్ కాశ్మీర్" అనే పేరుతో పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించాడు. "గౌతమ్ గంభీర్ ఇప్పటికే ఢిల్లీ పోలీసుల భద్రతలో ఉన్నారు. ఆయనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశాం" అని డీసీపీ ప్రకటనలో పేర్కొన్నారు.
కాగా, టీమిండియా ప్రధాన కోచ్ గంభీర్‌కు ఇదే మొదటి బెదిరింపు కాదు. 2022లో ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు ఆ సమయంలో పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. తాజాగా పహల్గాంలో ఉగ్రదాడి తరువాత గంభీర్‌కు మరోసారి బెదిరింపులు రావడంతో ఢిల్లీ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేశారు. అతడు 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి జిగ్నేష్ సింగ్ పర్వార్ అని, అతడికి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయని కుటుంబం చెబుతోందని పోలీసులు తెలిపారు.





















