PV Sunil Kumar : పీవీ సునీల్‌పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ - మరోసారి నోటీసులు జారీ - నెక్ట్స్ చర్యలే !
IPS officer PV Sunil: సస్పెన్షన్ లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ పై ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ నమోదు చేశారు. ప్రభుత్వానికి తెలియకుండా విదేశాలకు వెళ్లినట్లుగా అభియోగాలు నమోదు చేశారు.

IPS PV Sunil Kumar: సస్పెండైన సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై ఆర్టికల్స్ ఆఫ్ ఛార్జ్ ను నమోదు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎస్ అధికారిగా సర్వీసు నిబంధనల ఉల్లంఘనతో పాటు ఆయనపై నమోదైన వివిధ అభియోగాల మేరకు ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ నమోదు చేశారు. అప్పటి సీఐడీ చీఫ్ గా 2019 అక్టోబరు 24 నుంచి 2023 జనవరి 23 తేదీ వరకూ సీఐడీ చీఫ్ గా , 2023 మార్చి 10 నుంచి 2024 జూన్ 20 తేదీ వరకూ అగ్నిమాపక శాఖ డీజీగా సర్వీసు నిబంధనలు ఉల్లంఘించినట్టు చార్జెస్ నమోదు చేశారు.
ప్రభుత్వానికి తెలీకుండా సునీల్ కుమార్ పలు మార్లు విదేశీ పర్యటనలు చేసినట్టు ఆర్టికల్స్ ఆఫ్ చార్జ్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది. 2024 మార్చి 1 తేదీన జార్జియా వెళ్లేందుకు అనుమతి తీసుకుని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లారు. 2023 సెప్టెంబరు 2 తేదీన ప్రభుత్వానికి తెలీకుండానే స్వీడన్ పర్యటనకు వెళ్లారు. వెయిటింగ్ లో ఉన్న సమయంలోనూ 2023 ఫిబ్రవరి 1 నుంచి 28 తేదీ వరకూ ప్రభుత్వానికి తెలీకుండా అమెరికా వెళ్లోచ్చారు. సీఐడీ చీఫ్ గా ఉన్న సమయంలో 2022 డిసెంబరు 14 తేదీన జార్జియా వెళ్తానని తెలిపి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్లారు.
2021 అక్టోబరు 2 నుంచి 8 తేదీ వరకూ ప్రభుత్వానికి తెలీకుండా యూఏఈలో పర్యటించినట్టు పీవీ సునీల్ కుమార్ పై ఐదో ఆర్టికల్ ఆఫ్ ఛార్జ్ నమోదు అయింది. 2019 డిసెంబరు 21లో అమెరికా వెళ్లేందుకు అనుమతి తీసుకుని యూకె వెళ్లారు. ప్రభుత్వం నమోదు చేసిన ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ లో ప్రతీ దానికి విడివిడిగా సమాధానం చెప్పాల్సిందిగా సునీల్ కుమార్ ను ప్రభుత్వం ఆదేశించింది. ప్రతీ అభియోగంపైనా రాతపూర్వక సమాధానం 30 రోజుల్లోగా ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ అభియోగాల విచారణలో రాజకీయ ఒత్తిళ్లు తెచ్చేందుకు ప్రయత్నిస్తే అఖిలభారత సర్వీసు నిబంధనల ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించింది.
వైఎస్ జగన్ సీఎంగా వైసీపీ హయాంలో కీలకంగా పని చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత జూలైలో సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అలా చేయడం ఆలిండియా సర్వీసు నిబంధనలకు విరుద్దమని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. సునీల్ కుమార్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వివరణ ఇవ్వాలని గతంలోనే ఆయనకు నోటీసులు జారీ చేసింది.
వైసీపీ హయాంలో సీఐడీ చీఫ్ గా పని చేసిన ఆయన టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజును పుట్టిన రోజునాడు అరెస్టు చేసి ఫిజికల్ గా టార్చర్ చేశారన్న ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఓ మత సంస్థను పెట్టి మత ప్రచారం చేస్తున్న ఫిర్యాదులు కూడా కేంద్రానికి వెళ్లాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని గతంలో కేంద్రం నుంచి ప్రభుత్వానికి సూచనలు కూడా వచ్చాయి.





















