PV Sunil Kumar: సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు, ఉత్తర్వులు జారీ
Andhra Pradesh News | ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

former CID chief PV Sunil Kumar | అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‌పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లారని ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. అనుమతులు లేకుండా USA, UAE, స్వీడన్ లో పర్యటించారు. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ విదేశీ పర్యటనలపై విచారణ మొదలైంది. సస్పెన్షన్ టైమ్ లో హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేసింది.
ఐపీఎస్ అధికారి, ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేశారని ఆయనపై ఫిర్యాదులున్నాయి. అప్పటి నరసాపురం ఎంపీ, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును పోలీస్ కస్టడీలో వేధింపులకు గురి చేసిన కేసులోనూ సునీల్ కుమార్ పై అభియోగాలున్నాయి. 2020 నుంచి 2024 వరకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సునీల్ కుమార్ పలుమార్లు విదేశాలకు వెళ్లారని, ఇది ఆలిండియా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా నేతృత్వంలో ఈ విషయంపై విచారణ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ క్రమంలో సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కుమార్‌ను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు సైతం జారీ అయ్యాయి.
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు
సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని వైఎస్సార్ సీపీ ఆరోపిస్తోంది. ఉద్ధేశపూర్వకంగానే కొందరు అధికారులు, వైసీపీ నేతలు, మాజీ మంత్రులపై చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తుందని ఆరోపించారు.
వైఎస్ జగన్ సీఎంగా వైసీపీ హయాంలో కీలకంగా పని చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్. ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత జూలైలో సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. అలా చేయడం ఆలిండియా సర్వీసు నిబంధనలకు విరుద్దమని పేర్కొంటూ ఏపీ ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. సునీల్ కుమార్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. వివరణ ఇవ్వాలని గతంలోనే ఆయనకు నోటీసులు జారీ చేసింది.
పుట్టినరోజు నాడే రఘురామ అరెస్ట్..
వైసీపీ హయాంలో పీవీ సునీల్ కుమార్ ఎక్కువ కాలం సీఐడీ డీజీగా సేవలు అందించారు. కానీ ఆ సమయంలో ఆయన చర్యలు విమర్శలకు దారితీశాయి. అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజును పుట్టినరోజు నాడే అరెస్టు చేశారు. రాజద్రోహం కింద సుమోటోగా కేసులు పెట్టి రఘురామను అరెస్ట్ చేసి గుంటూరు సీఐడీ ఆఫీసుకు తరలించారు. అక్కడ తనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారని రఘురామ ఆరోపించారు. కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ జరుగుతోంది. ఇటీవల నిందితులను రఘురామ గుర్తుపట్టారు. తన గుండెపై కూర్చుని దాడి చేసిన వ్యక్తిని గుర్తించానని ఆయన తెలిపారు.






















