Gorantla Butchaih Chowdary: టీడీపీలో సీనియర్, ఎన్టీఆర్‌కు భక్తుడిని.. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
Andhra Pradesh News | తాను ఎన్టీఆర్ కు భక్తుడినని, టీడీపీలో సీనియర్ నేతను కావడంతో మంత్రి పదవి ఆశించానని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

Gorantla Butchaih Chowdary | అమరావతి: తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నేత, గత ఎన్నికల్లో మొదటగా విజయం సాధించిన అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై స్పందించారు. టీడీపీలో తానే సీనియర్ నేత కావడంతో ఈసారి మంత్రి పదవి ఆశించాను.. కానీ తనకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక సమీకరణాల కారణంగా తనకు మంత్రి పదవి రాలేదన్నారు. పార్టీ తనకు ఏ పదవి ఇచ్చినా దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తానని, మంత్రిగా అవకాశం ఇవ్వలేదని తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు.
టీడీపీలో చేరడానికి తన తమ్ముడే కారణమని, రాజేంద్రప్రసాద్ మొదట పార్టీలో చేరారు. ఆపై ఎన్టీఆర్ పిలిచి తనను పార్టీలోకి ఆహ్వానించడంతో తెలుగుదేశంలో చేరినట్లు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. మొదట తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల టీడీపీ కన్వీనర్ గా ఉన్న తాను అంచెలంచెలుగా ఎదిగినట్లు చెప్పారు. కమ్యూనిస్ట్ భావజాలంతో ఉండే తాను ఎన్టీఆర్ కు భక్తుడినని, ఆయన కోసం చివరి దాకా టీడీపీలోనే ఉండాలని అనుకుంటున్నానని స్పష్టం చేశారు. టీడీపీ పేరు తెలియని రోజుల్లో ప్రజల్లోకి వెళ్లి, ఎన్టీఆర్ గురించి, పార్టీ సిద్ధాంతాలు ప్రచారం చేసి ఏడాదిలోనే అధికారంలోకి వచ్చామని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రామారావు వెంట నడిచిన తాను ఆయన మరణం తరువాత కొంత దూరంగా ఉండగా.. చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీలో యాక్టివ్‌గా ఉన్నానని చెప్పుకొచ్చారు.
దుర్మార్గుల్లారా, రౌడీల్లారా అంటాను..
ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని అవమానించారు.. ఇప్పుడు వారు అనుభవిస్తున్నారంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి వారిని గట్టిగా మందలించేవాడినని, వారితో ఉన్న చనువుతో దుర్మార్గుల్లారా, రౌడీల్లారా అంటూ కేకలు వేసేవాడినని తెలిపారు. కానీ ఆరోజు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో హద్దులు మీరారు. కనుక తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు. వల్లభనేని వంశీ పార్టీ మారాలనుకున్నారు, ఉమాతో వివాదాలు వచ్చాయి. వంశీ చేసిన భూకుంభకోణాలు, అక్రమాలతో స్థానిక టీడీపీ నేతలు తిరగబడ్డారు. ఈ క్రమంలో వల్లభనేని వంశీ హద్దుమీరి ప్రవర్తించారని వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, జోగి రమేశ్, పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యల వెనుక సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారని గోరంట్ల అభిప్రాయపడ్డారు. మాజీ సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు, అప్పటి మంత్రులతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాలను బూతులు తిట్టించారని ఆరోపించారు. కులానికి చెందిన వాడితో ఆ కులం వాడిని తిట్టించి కుట్ర చేశారని మండిపడ్డారు. వైసీపీ నేతలు చేసిన అన్ని తప్పులకు జగన్, సజ్జలనే కారణమని, వారి పాత్రనే కీలకమని సీనియర్ నేత గోరంట్ల ఆరోపించారు.
వేర్వేరు కేసులలో వల్లభనేని వంశీ, పోసాని అరెస్టయ్యారు. కిడ్నాప్, కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఆరోపణలు చేశారని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఏపీకి తరలించారు. పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. పోసానిని సైతం హైదరాబాద్ లో అరెస్ట్ చేసి అన్నమయ్య జిల్లాకు తరలించారు. రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా పోసాని ఉన్నారు. సజ్జల చెప్పినట్లు చేశానని పోసాని చెబుతున్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

