Chandrababu: కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP CM: కష్టపడేవారికి అండగా ఉండటం తమ బాధ్యత అని చంద్రబాబు అన్నారు. శ్రీకాకుళం, విశాఖ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

Chandrababu Naidu :కష్టపడి పనిచేసే స్వభావం ఉన్నవారికి అండగా నిలవడం ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యమని చంద్రబాబు అన్నారు. వేట నిషేధ సమయంలో ఆదాయం లేక మత్స్యకారులు పడే ఇబ్బందులను తాను ప్రత్యక్షంగా చూశానని, వారి కష్టాలను దృష్టిలో ఉంచుకొనే ఈ సాయాన్ని రెట్టింపు చేయాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని బుడగట్లపాలెంలో మత్స్యకారుల సేవలో పథకాన్ని ప్రారంభించారు.
ఎన్నికలలో ఇచ్చిన హామీకి అనుగుణంగా మత్స్యకారులకు వేట విరామ కాలంలో అందించే ఆర్థిక సాయాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా అన్నారు. గతంలో రూ.10 వేలుగా ఉన్న ఈ సహాయాన్ని రూ. 20 వేలకు పెంచారు. ఈ పథకం కింద నేడు 1,29,178 మంది మత్స్యకారులకు ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున మొత్తం రూ. 258.35 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. మత్స్యకారులతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా వారికి అన్ని విధాలా మేలు చేసే కార్యక్రమాలు చేపడతామని భరోసా ఇచ్చారు.
కష్టజీవులతో గడిపిన సమయం, రాష్ట్ర ప్రజల కోసం మరింత కష్టపడి పనిచేయాలనే తన సంకల్పాన్ని మరింత దృఢపరిచిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. టీడీపీకి వెనుకబడిన వర్గాలే వెన్నెముక అని అన్నారు. స్థానికుల సమస్యలు, పేదల కష్టాలు చూశానని.. కొందరు జాలర్ల ఆదాయం కూడా కాజేస్తున్నారని తెలిపారు. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులున్నా మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ప్రభుత్వం బాధ్యతగా ఉండాలని.. ప్రజల ఆదాయం పెంచాలన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను ప్రభుత్వం మెరుగుపరిచాలన్నారు. గతంలో నేతలు వస్తే చెట్టు నరికేయడం.. పరదాలు కట్టడం జరిగేవని విమర్శించారు.
గత పాలకుల్లా బటన్ నొక్కి ప్రచారం చేసుకోవడం తనకూ వచ్చని కానీ చేయాల్సింది అది కాదన్నారు. ఫిష్ ఆంధ్ర పేరుతో రూ. 300 కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ఒక్క మత్స్యకారుని కుటుంబమైనా బాగుపడిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు నెలనెలా పింఛన్లు అందిస్తున్నాము. మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లిస్తున్నాము. వేటకు వెళ్లే బోట్లకు లీటర్ డీజిల్‌పై రూ.9 సబ్సిడీ ఇస్తున్నామన్నారు.
ఎన్నికలలో ఇచ్చిన హామీకి అనుగుణంగా #MatsyakarulaSevalo పథకాన్ని నేడు ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉంది. గతంలో రూ.10 వేలుగా ఉన్న వేట విరామ సాయాన్ని రూ.20 వేలకు పెంచి ఇచ్చాం. 1,29,178 మందికి రూ. 20 వేలు చొప్పున రూ. 258.35 కోట్లను నేడు అందించాం. వేట నిషేధ సమయంలో ఆదాయం లేక మత్స్య… pic.twitter.com/5hOrmtpqVj
— N Chandrababu Naidu (@ncbn) April 26, 2025
ఈ కార్యక్రమం తర్వాత విశాఖలో ఆంధ్రా యూనివర్శిటీ సెంటినరీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరి కన్నా డాక్టర్లు ఎక్కువ కష్టపడతారని టెక్నాలజీ , మెడికల్ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు రావాల్సి ఉందన్నారు. విశాఖకు గూగుల్ వస్తోందని చంద్రబాబు తెలిపారు. గూగుల్ రాకతో విశాఖ డేటా సెంటర్ రాత మారుతుందని స్పష్టంచేశారు.





















