Chandrababu Urea: యూరియా వాడకం తగ్గిస్తే ప్రోత్సాహక నగదు - రైతులకు చంద్రబాబు బంపర్ ఆఫర్
AP CM: యూరియా వాడకం తగ్గించిన రైతులకు ప్రోత్సాహకం ఇవ్వాలని ఏపీ సీఎం నిర్ణయించారు. వచ్చే ఏడాది నుంచి అమలు చేయనున్నారు.

AP CM decides to give incentives to farmers who reduce urea usage: ఆంధ్రప్రదేశ్ రైతులకు ఏపీ సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. యూరియా వాడకాన్ని తగ్గిస్తే ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. యూరియా వాడకం వల్ల పంట ఉత్పత్తుల్లో రసాయనాలు పెరిగిపోయి మన పంటలకు విదేశాల్లో డిమాండ్ తగ్గిపోతోందని చంద్రబాబు కలెక్టర్ల సమావేశంలో వ్యాఖ్యానించారు. కొన్ని సందర్భాల్లో చైనా నుచి మిర్చి వెనక్కి వచ్చింది. అలాగే యూరప్ దేశాల్లో మన వ్యవసాయ ఉత్పత్తులుక ధరలు తగ్గిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో రసాయనాలు తగ్గించేలా పంటలు పండించాల్సి ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడుతున్నారు. అందుకే యూరియా వాడకాన్ని తగ్గించేలా రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలనుకుంటున్నారు. ఒక్క కట్ట యూరియా వాడకం తగ్గిస్తే రైతులుకు రూ. ఎనిమిది వందలు ఇచ్చే ఆలోచన లో ఉన్నారు.
అవసరమైనంత యూరియానే వాడకం మంచిది.. !
యూరియా వాడకంపై రైతులకు చైతన్యం కల్పించాలని, అవసరమైనంత మాత్రమే యూరియాను వినియోగించాలని సూచించారు. అధిక యూరియా వాడకం దిగుబడిని పెంచుతుందనే భావన సరికాదని స్పష్టం చేశారు. యూరియాకు బదులుగా మైక్రో న్యూట్రియంట్స్‌ను సప్లిమెంట్స్‌గా వాడాలని, వచ్చే ఏడాది నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. పంజాబ్‌లో యూరియా అతివాడకం వల్ల సంభవించిన పరిణామాలను కేస్ స్టడీగా చూసి నేర్చుకోవాలని సూచించారు. రైతులకు సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడంతోపాటు, ఆరోగ్య, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు.
ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి ఫలితాలు
ఇప్పటికే ప్రకృతి వ్యవసాయానికి పెద్ద ఎత్తున ప్రచారం లభిస్తోంది. సేంద్రియ వ్యవసాయం చేపట్టే రైతులకు ఆర్థిక సహాయం, సాంకేతిక మద్దతు, మార్కెట్ లింకేజీలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. యూరియా వాడకాన్ని తగ్గించి, సుస్థిర పద్ధతులను అవలంబించే రైతులకు నేరుగా నగదు బదిలీ పథకం వచ్చే ఏడాది నుంచి అమలు కానుంది.
యూరియా కొరతతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రైతుల ఇక్కట్లు !
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత ఎక్కువగా ఉంది . తెలంగాణలో రైతులు ఘర్షణలకు దిగుతున్నారు. ఏపీలో పరిస్థితి అంత తీవ్రంగా లేకపోయినా రైతులు అవసరానికి మించి కొనుగోలు చేస్తున్నారు. యూరియా వల్ల ఎక్కువ దిగుబడి వస్తుందని అనుకుంటున్నారు. దానికి ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేనప్పటికీ.. రైతులు యూరియాను ఎక్కువగా వాడుతున్నారు. దీని వల్ల దిగుబడి వచ్చినా పంటలో రసాయన అవశేషాలు ఎక్కువగా ఉండటం సమస్యగా మారింది. ఎగుమతులు తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితిని నివారించడానికి యూరియా వాడకాన్ని తగ్గించే వారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించారు.





















