The Raja Saab Movie Review - 'ది రాజా సాబ్' రివ్యూ: నటనలో ప్రభాస్ హుషారు, ఆ లుక్కు సూపరు... మరి ఫాంటసీ హారర్ కామెడీ హిట్టేనా?
The Raja Saab Review Telugu: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ హారర్ కామెడీ 'ది రాజా సాబ్'. గురువారం రాత్రి పెయిడ్ ప్రీమియర్ షోలతో విడుదలైంది. సినిమా ఎలా ఉందంటే?
మారుతి
ప్రభాస్, జరీనా వాహెబ్, సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, సముద్రఖని తదితరులు
Prabhas Raja Saab Movie Review In Telugu: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 'ది రాజా సాబ్'. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లు. సంజయ్ దత్ విలన్. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. హారర్ కామెడీ 'ప్రేమ కథా చిత్రమ్'తో పదేళ్ల క్రితం విజయం అందుకున్న దర్శకుడు మారుతి. మరి, ఈ ఫాంటసీ హారర్ కామెడీ ఎలా తీశారు?
కథ (Prabhas Raja Saab Story): రాజు (ప్రభాస్)కు నానమ్మ గంగమ్మ (జరీనా వాహెబ్) తప్ప ఇంకెవరూ లేరు. గంగవ్వకు అల్జీమర్స్ ఉన్నప్పటికీ... ఎన్నో సంవత్సరాల క్రితం దూరమైన భర్త కనకరాజు (సంజయ్ దత్)ను మర్చిపోదు. ఎప్పటికి అయినా తిరిగొస్తాడని ఎదురు చూస్తుంటుంది. అటువంటి సమయంలో హైదరాబాద్‌లో కనకరాజు ఉన్నాడని తెలిసి తాతయ్యను వెతకడానికి బయలు దేరతాడు రాజు.
హైదరాబాద్ వచ్చిన రాజు, నర్సాపూర్ ఫారెస్టులోని కోటలోకి ఎలా చేరాడు? రాజుతో పాటు కోటలో ప్రవేశించిన వాళ్ళను బయటకు వెళ్ళనివ్వకుండా కనకరాజు ఎన్ని తిప్పలు పెట్టాడు? అసలు ఆయనకు కావల్సినది ఏమిటి? అనిత (రిద్ధి కుమార్), భైరవి (మాళవికా మోహనన్), బ్లేస్సీ (నిధి అగర్వాల్)... ముగ్గురిలో రాజు ప్రేమించినది ఎవర్ని?
దేవనగరి సంస్థాన వారసురాలు గంగా దేవి (అమ్ము అభిరామి)కి, రాజుకు సంబంధం ఏమిటి? చివరకు కోట నుంచి రాజు అలియాస్ రాజా సాబ్ బయట పడ్డాడా? లేదా? అనేది సినిమా.
విశ్లేషణ (The Raja Saab Review Telugu): ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ హారర్ కామెడీ / ఫాంటసీ డ్రామాకు 'యస్' చెప్పడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అందులోనూ మారుతికి అవకాశం ఇవ్వడం కూడా! అయితే 'ప్రేమ కథా చిత్రమ్' వంటి హారర్ కామెడీ తీసి విజయం సాధించడంతో పాటు 'భలే భలే మగాడివోయ్', 'మహానుభావుడు', 'ప్రతిరోజూ పండగే' వంటి హిట్ సినిమాలు తీసిన అనుభవం ఉండటంతో 'ది రాజా సాబ్' మీద అంచనాలు ఏర్పడ్డాయి. మరి, ఆ అంచనాలకు తగ్గట్టు సినిమా ఉందా? లేదా? అనేది చూస్తే...
మారుతి బలం కామెడీ. 'ది రాజా సాబ్'లోనూ అది కనిపించింది. కోట నుంచి బయట పడటం కోసం చేసే ప్రయత్నాల్లో 'ప్రభాస్' శ్రీనుకు ఎదురైన ప్రమాదం నుంచి మంచి వినోదం రాబట్టారు. నవ్వించారు. అదొక్కటే కాదు... హీరో ప్రభాస్ చేత వెటకారపు డైలాగులు చెప్పించడంలోనూ తన మార్క్ చూపించారు. అన్నిటికీ మించి ప్రభాస్‌ను స్టైలిష్, ఎనర్జిటిక్‌గా చూపించారు. అయితే... అభిమానులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందే సినిమా ఇవ్వడంలోనూ మాత్రం సక్సెస్ కాలేదు.
మారుతి కథలో పాన్ ఇండియా అప్పీల్ మాత్రమే కాదు... బ్లాక్ బస్టర్‌కు కావాల్సిన మాంచి కాన్సెప్ట్ ఉంది. 'బాహుబలి'కి ముందు, తర్వాత... లార్జర్ దేన్ లైఫ్ కథలతో రూపొందిన సినిమాల్లో రాజ్యాలు, సంస్థానాలు వంటివి చూశాం. అయితే... ఆ సెటప్ తీసుకొచ్చి ఫాంటసీ హారర్ డ్రామాకు యాడ్ చేయడం బావుంది. అత్యాశకు తాంత్రిక శక్తితో పాటు హిప్నాటిజం తోడు కావడం అనే కాన్సెప్ట్ కొత్తగా ఉంది. అయితే... స్క్రీన్ ప్లే, కమర్షియల్ అప్పీల్ కోసం ప్రయత్నించిన సన్నివేశాల వల్ల కాన్సెప్ట్ చిన్నబోయింది. మారుతికి బలమైన కామెడీని పాన్ ఇండియా కమర్షియల్ అప్పీల్ కిందకు నెట్టింది.
'ది రాజా సాబ్' ఆసక్తికరంగా మొదలైంది. ఎనర్జిటిక్ రోల్, ఆ పాత్రలో ప్రభాస్ నటనతో పాటు లుక్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి. అయితే... ఆసక్తి నెమ్మదిగా తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. 'రోలర్ కోస్టర్ రైడ్'గా మారుతుంది. ఆసక్తిగా మొదలైన సినిమాకు నిధి అగర్వాల్, మాళవికా మోహనన్‌లతో లవ్ ట్రాక్స్ బ్రేక్స్ వేశాయి. స్టార్టింగ్ తర్వాత మళ్ళీ ఇంటర్వెల్ సెకండాఫ్ మీద ఆసక్తి కలిగిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా లవ్ సీన్స్ నిడివి పెంచాయి. ఒకట్రెండు తప్ప హీరోయిన్లతో సీన్స్ ఎంటర్టైన్ చేయలేదు. కమెడియన్లతో సన్నివేశాలు నవ్వించాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ ఆసక్తి పెరుగుతూ క్లైమాక్స్ 'హై' ఇస్తుంది.
'ది రాజా సాబ్'కు తమన్ అందించిన బాణీల్లో 'సహన సహన' బావుంది. ఆ సాంగ్ పిక్చరైజేషన్ కూడా! 'పాన్ ఇండియా నంబర్ వన్ బ్యాచిలర్ నేనేలే...', 'నాచే నాచే' సాంగ్స్ జస్ట్ ఓకే. నేపథ్య సంగీతం పరంగా కొన్ని సన్నివేశాల్లో తమన్ తన మార్క్ చూపించారు. అయితే... సౌండ్ మిక్సింగ్ సరిగా చేయలేదు. దాని వల్ల పాటల్లో లిరిక్స్, కొన్ని చోట్ల డైలాగులు ప్రేక్షకులకు అర్థం అవ్వడం కష్టం. కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ బావుంది. మ్యాగ్జిమమ్ సినిమాను సెట్స్‌లో తీసిన గ్రాండ్ లుక్ తీసుకు వచ్చారు. వీఎఫ్ఎక్స్ కొన్ని సన్నివేశాల్లో బావున్నా... చాలా చోట్ల వర్క్ ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ భారీగా ఖర్చు చేసినట్టు అర్థం అవుతుంది.
ప్రభాస్ హుషారుగా కనిపించారు. ఆయన లుక్స్ బావున్నాయి. నటనలో ఎనర్జీని ఫ్యాన్స్ ఫీలవుతారు. ఆయన పడిన కష్టం తెరపై కనబడుతుంది. జరీనా వాహెబ్, ఆయనకు మధ్య సన్నివేశాల్లో ఎమోషన్స్ వర్కవుట్ అయ్యాయి. నటిగా జరీనా మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. సంజయ్ దత్ విలనిజం సినిమాకు పెద్ద ప్లస్. కనకరాజు పాత్రలో అదరగొట్టారు.
Also Read: 'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? హీరోయిన్లు, ఆర్టిస్టులకు అందులో సగం కూడా ఇవ్వలేదు
నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్... ముగ్గురి నటన కంటే గ్లామర్ షో ఎక్కువ హైలైట్ అవుతుంది. ప్రతి సన్నివేశంలోనూ గాడీ కనిపించేలా కాస్ట్యూమ్స్ ధరించారు. నిధి నటన ఓకే. మాళవికా మోహనన్ లుక్స్, ఎక్స్‌ప్రెషన్స్ పరంగా కేర్ తీసుకోవాలి. రిద్ధిని హీరోయిన్ అని చెప్పలేం. తన పరిధి మేరకు నటించారు. ఓ సంస్థాన వారసురాలిగా అమ్ము అభిరామి కనిపించారు. మొదటి పాటలో ఆనంది తళుక్కున మెరిశారు.
కమెడియన్ సత్య లుక్ వెరైటీగా ఉంది. ఆయనతో పాటు ప్రభాస్ శ్రీను, వీటీవీ గణేష్ నవ్వించారు. సప్తగిరి ఎంట్రీ నవ్వించినా తర్వాత ఆయన ఇంపాక్ట్ చూపించలేదు. వీటీవీ గణేష్ పాత్ర సడన్‌గా ముగిసినట్టు అనిపిస్తుంది. బోమన్ ఇరానీ స్క్రీన్ స్పేస్ తక్కువ. ఉన్నంతలో బాగా చేశారు.
ప్రభాస్ ఎనర్జీతో పాటు ఆయన లుక్స్ 'ది రాజా సాబ్'కు బిగ్గెస్ట్ ప్లస్. హీరోని బాగా చూపించారు దర్శకుడు మారుతి. ఆయన తీసుకున్న కాన్సెప్ట్ కూడా బావుంది. కానీ స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంటర్టైన్ చేయలేదు. ఫ్యాన్స్‌ను శాటిస్‌ఫై చేసేలా, ఎంగేజ్ చేసేలా లేదు. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేయవచ్చు. ఇంట్రడక్షన్, ఇంటర్వెల్, క్లైమాక్స్ బావున్నాయి.





















