AP DSC Merit List 2025 Out: ఏపీ డీఎస్సీకి ఎంపిక కాని వారికి మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్, ఆ పోస్టులపై కీలక ప్రకటన
Nara Lokesh responds on AP DSC Selection List 2025 | ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించి పోస్టులు భర్తీ చేస్తామని, ఏపీ డీఎస్సీకి ఎంపిక కాని వారిలో ఉత్సాహాన్ని నింపే వార్త చెప్పారు.

AP DSC Selection List 2025 | అమరావతి: ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగా డీఎస్సీ 2025 ఫలితాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఏపీ మెగా డీఎస్సీలో పోస్టులకు ఎంపికైన వారిని అభినందించిన లోకేష్.. ఎంపిక కాని వారికి శుభవార్త చెప్పారు. తాజాగా నియామకం కాని వారు నిరాశ చెందవద్దని, ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టుల ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. కనుక తాజాగా పోస్టులకు ఎంపికకాని డీఎస్సీ అభ్యర్థులు నిరుత్సాహ పడకుండా ప్రిపరేషన్ కొనసాగిస్తే వచ్చే డీఎస్సీలో ఉద్యోగాలు సాధించే అవకాశం ఉందని వారిలో ఉత్సాహాన్ని నింపే విషయం చెప్పారు. ప్రభుత్వ శాఖల్లోని ఇతర పోస్టులను భర్తీ చేస్తామన్నారు.
డీఎస్సీలో భర్తీ కాని పోస్టులు 406
గత ఏడాది కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక అమరావతిలోని సచివాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలుపై చేశారని.. నేడు ఆ హామీ అమలు చేశామన్నారు నారా లోకేష్. ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేయడం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని, తద్వారా విద్యా రంగంలో దేశంలో ఏపీ నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని నారా లోకేష్ పేర్కొన్నారు. 16,347 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయగా వాటిలో 15,941 పోస్టులు భర్తీ అయ్యాయి. మిగతా పోస్టులకు సెకండ్ మెరిట్ లిస్ట్, వెయిటింగ్ లిస్ట్ ఉండవని ఏపీ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ స్పష్టం చేశారు. ఈ ఏడాది మిగిలిన పోస్టులను వచ్చే డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని తెలిపారు. అధికారిక వెబ్‌సైట్ http://apdsc.apcfss.inలో అభ్యర్థులు డీఎస్సీ ఫలితాలు చెక్ చేసుకోవాలని సూచించారు. వర్టికల్, మొట్ట మొదటిసారిగా హారిజాంటల్ రిజర్వేషన్లను అమలు చేసి పోస్టులకు అభ్యర్థులకు ఎంపిక చేశారు.
DSC-2025: చరిత్రలోనే అతిపెద్ద ఉపాధ్యాయ నియామక ప్రక్రియ
- 16,347 పోస్టులు భర్తీకి ప్రక్రియ
- 2024 జూన్ 13: GO No.27తో ప్రారంభం
- 2024 అక్టోబర్: ఎక్కువ అవకాశాల కోసం రెండోసారి TET నిర్వహణ
- 3,36,300 అభ్యర్థుల నుండి 5,77,675 దరఖాస్తులు
పరీక్షలు, కీ, అభ్యంతరాలు
- CBT పరీక్షలు: 2025 జూన్ 6 – జులై 2 మధ్య రెండు షిఫ్టుల్లో నిర్వహణ
- డ్రాఫ్ట్ కీ: జులై 5న విడుదల, లక్షా 40 వేల అభ్యంతరాలు
- ఫైనల్ కీ: ఆగస్టు 1న విడుదల
రిజర్వేషన్లు – కీలక అంశాలు
- GO No.77 (ఆగస్టు 2, 2023) ద్వారా వర్టికల్ + హారిజాంటల్ రిజర్వేషన్లు
- GO No.46 (ఏప్రిల్ 19, 2025): SC సబ్ క్లాసిఫికేషన్ మొదటిసారి అమలు
- GO No.47 ప్రకారం 3% కోటా కింద స్పోర్ట్స్ పర్సన్లకు 372 పోస్టులు
- ఉపాధ్యాయ నియామకాలు వివిధ శాఖలకు: ప్రభుత్వ, పంచాయతీరాజ్, మునిసిపల్, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, BC వెల్ఫేర్
నో సెకండ్ లిస్ట్, నో వెయిటింగ్ లిస్ట్
- ఫైనల్ లిస్టులో 15,941 మంది అభ్యర్థులు
- 7,955 మహిళలు (49.9%)
- 7,986 పురుషులు (50.1%)
- మిగిలిన 406 పోస్టులు – సంబంధిత కమ్యూనిటీలో అర్హుల లేకపోవడంతో
- డీఎస్సీపై రెండో మెరిట్ లిస్ట్ గానీ, వెయిటింగ్ లిస్ట్ గానీ లేవని ప్రకటించారు





















