Danam Nagender: కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారు - దానం సంచనల వ్యాఖ్యలు- హ్యాండిచ్చేసినట్లే
Khairatabad MLA: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ కోసం జనం ఎదురు చూస్తున్నారని ఆయన చెబుతున్నారు.

Danam Nagender Supports KCR: భారత రాష్ట్ర సమితి ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ కు దాదాపుగా హ్యాండిచ్చేశారు. కేసీఆర్, బీఆర్ఎస్ కు అనుకూలంగా ఆయన మాట్లాడుతున్నారు. భారత రాష్ట్ర సమితి రజతోత్సవ సభ సక్సెస్ అవుతుందని ప్రకటించారు. కేసీఆర్ రాక కోసం జనం ఎదురు చూస్తున్నారని ఆయన అంటున్నారు. బహిరంగసభకు పెద్ద ఎత్తున వస్తారని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఐఏఎస్ స్మితా సభర్వాల్‌కూ ఆయన మద్దతు పలికారు. కంచ గచ్చిబౌలి విషయంలో స్మితా సభర్వాల్ చేసిన పోస్టులో తేడా ఏమీ లేదన్నారు. ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆమె పోస్టు చేయలేదని చెప్పుకొచ్చారు.
బీఆర్ఎస్ తరపున గెలిచి ఫిరాయించిన దానం నాగేందర్
బీఆర్ఎస్ తరపున ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్ తర్వాత కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. ఆ పార్టీ తరపున సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిస స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ తనకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో రివర్స్ అయ్యారు. అనర్హతా వేటు పడితే.. ఒక్క చాన్స్ దానంపైనే ఉంది. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ.. కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు. ఈ విషయంలో ఆయనపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ పై ఒత్తిడి రావొచ్చన్న అంచనాలు ఉన్నాయి. అయినా ఆయన కాంగ్రెస్ కు దూరంగానే ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ కొత్త ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ఆయన హాజరు కావడంలేదు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లోనూ కనిపించడం లేదు. ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రిని కూడా కలవలేదు.
పార్టీ వీడేందుకు దానం సిద్ధమయ్యారా?
పార్టీ వీడేందుకే సిద్దమయ్యే ఇలా మాట్లడుతున్నారంటూ మరో టాక్ వినిపిస్తోంది. అధికారంలో ఉన్న పార్టీ వీడి మరో పార్టీలోకి వెళ్లడం అనేది సాధారణంగా జరగదు. అదీ పార్టీ మరీ పట్టించుకోవడం లేదు, ఉన్నా ఉపయోగం లేదు అన్న సందర్భంలో తప్ప. ఇప్పుడు దానం విషయంలో అదే జరుగుతోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. ఏదో ఆశించి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరితే తీరా, ఇక్కడ కూడా లైట్ తీసుకుంటారా.? అనే అసంతృప్తితోనే దానం ఇలా సహనం కోల్పోతున్నారు అనే వాదనలు ఉన్నాయి.
మళ్లీ బీఆర్ఎస్‌లో ఆదరణ లభిస్తుందా?
ఇప్పుడు దానం నాగేందర్ రాజకీయంగా ఏం నిర్ణయం తీసుకుంటారన్నది కీలకంగా మారింది. మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్తే రానిస్తారేమో కానీ.. గతంలోలా ప్రాధాన్యం ఇవ్వరు. గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతూండటంతో కాంగ్రెస్ పార్టీనే తన డిమాండ్లను నెరవేరుస్తుందని ఆయన నమ్మకంతో బెట్టు చేస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఆయన పార్టీ కార్యక్రమాలకు రావడం లేదు అని కాంగ్రెస్ కూడా ఫీలవడం లేదు. రాకపోతే పోయారులే అనుకుని లైట్ తీసుకుంటున్నారు. దానం సిఫారసులను కూడా పట్టించుకోవడం లేదు. అందుకే బీఆర్ఎస్ ను పొగుడుతున్నారని అంటున్నారు.




















