Telangana ఉద్యమానికి, బీఆర్ఎస్ ప్రస్థానానికి లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ సార్ స్ఫూర్తి.. అమరవీరుల స్థూపం వద్ద కేటీఆర్ నివాళులు
తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎఆర్ఎస్ స్థానానికి కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి అని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ఆ విర్భావ దినోత్సవం సందర్భంగాఅమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు.

BRS silver jubilee celebrations: తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, రజతోత్సవం సందర్భంగా గన్ పార్కులోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద, ట్యాంక్ బండ్ వద్ద ఉన్న ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, జయశంకర్ విగ్రహాలకు కేటీఆర్‌తోపాటు ఆ పార్టీ నేతలు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మొత్తం 25 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో పాటు కేసీఆర్ అందించిన నాయకత్వమే ప్రధాన కారణమన్నారు. 25 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో జలదృశ్యంలో కేసీఆర్ సారథ్యంలో తమ పార్టీ పురుడు పోసుకుందని గుర్తుచేశారు. ఆనాడు ఒకరితో ప్రారంభమైన పార్టీ ప్రస్థానం లక్షల మందితో బలోపేతమై తెలంగాణను సాధించిందని పేర్కొన్నారు.
పార్టీ పుట్టిన జల దృశ్యం స్థలంలో పార్టీ రజతోత్సవ సంబురానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గులాబీ జెండాకు ఏ గడపా దొరకని కాలంలో తన గడపను ఇచ్చి లక్ష్మణ్ బాపూజీ కొండంత అండగా నిలిచారని, ఆయనకు వినమ్ర నివాళి అర్పిస్తున్నామని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీకి ఆనాడైనా ఈనాడైనా తెలంగాణనే ఏకైక ఎజెండా అన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించి, రాష్ట్రాన్ని సాధించి, తెలంగాణ ప్రగతి కోసం నిరంతరం పాటుపడుతోందని ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులందరికీ తలవంచి వినమ్ర నివాళులు అర్పిస్తున్నామని పేర్కొన్నారు. సంవత్సరాలు నిండి అమరవీరుల ఆశీస్సులతో పాటు, పెద్దల ఆశీర్వాదాలతో మరో 25 సంవత్సరాలు తెలంగాణ సమాజానికి సేవ చేసే అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాం అని అన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో వరంగల్ సభ చరిత్రను సృష్టించబోతోంది
వరంగల్ వేదికగా జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు గులాబీ సైనికులతో పాటు తెలంగాణ సబ్బండవర్గాల ప్రజలు లక్షలాదిగా తరలిరావాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ ముఖ్య నేతలతో కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి గ్రామంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ఉదయాన్నే గులాబీ జెండాలు ఆవిష్కరించుకొని కదలిరావాలని సూచించారు.
పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన సభ కాబట్టి సభకు హాజరయ్యే వారు గులాబీ రంగు దుస్తులు ధరించి రావాలని కోరారు. రాష్ట్ర నలుమూలల నుంచి సభకు తరలిరావాలనే ఉత్సాహం ప్రజల్లో పెద్ద ఎత్తున ఉందన్నారు. వారందరినీ సమన్వయం చేసుకొని అనుకున్న సమయానికి సభా ప్రాంగణానికి చేరుకునేలాగా ప్రణాళిక వేసుకోవాలని కోరారు.
పార్టీ సిల్వర్ జూబ్లీ సభకు తరలివచ్చే ప్రతి వాహనానికి అన్ని వైపులా గులాబీ జెండాలను కట్టుకుని ఉత్సాహంగా బయలుదేరాలని సూచించారు. ఎండల వల్ల ఇబ్బంది లేకుండా ప్రతి బస్సులో మంచినీళ్ల బాటిళ్ళు, మజ్జిగ ప్యాకెట్లతోపాటు భోజన వసతికి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. తెలంగాణ నలువైపుల నుంచి తరలివచ్చే వాహనాలు ట్రాఫిక్ జామ్ కాకుండా ఇప్పటికే రూట్ మ్యాప్ పంపించామని, దానికి అనుగుణంగానే ఆయా రూట్లలో సభాస్థలికి చేరుకోవాలని తెలిపారు.
సభా ప్రాంగణానికి 30 కిలోమీటర్ల దూరం నుంచి రోడ్లపై ఎక్కడా వాహనాలు నిలపరాదని.. వారికి సూచించిన పార్కింగ్ స్థలాలకు నేరుగా చేరుకొని అక్కడే వాహనాలను నిలపాలని సూచించారు. అనేక ప్రాంతాల్లో పార్టీ వాలంటీర్లు ఎప్పటికప్పుడు గైడ్ చేసేందుకు సిద్ధంగా ఉంటారని వెల్లడించారు. సభకు చేరుకున్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ మంచినీటి బాటిళ్లతోపాటు, మజ్జిగ ప్యాకెట్లు అందించేందుకు వాలంటీర్లు సిద్ధంగా ఉంటారని తెలిపారు. చారిత్రక సభలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రసంగంపై అన్ని వర్గాల్లో పెద్ద ఎత్తున ఆసక్తి నెలకొని ఉందని, రాష్ట్ర రాజకీయాల్లో ఈ సభ సరికొత్త చరిత్రను సృష్టించబోతోందని కేటీఆర్ పేర్కొన్నారు.






















