Telangana News: 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Solar Power To Telangana | తెలంగాణ ప్రభుత్వం 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

Bhatti Vikramarka | హైదరాబాద్: 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల పాటు టెండర్ల ద్వారా సోలార్ పవర్ సేకరించనుంది. అండర్‌గ్రౌండ్ కేబుల్స్‌గా మార్చే ప్రాజెక్ట్ కోసం రూ. 4,051 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ చేసింది ప్రభుత్వం. ఆ ప్రాజెక్ట్ ఫెజ్ 1 ద్వారా బంజారా హిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సెంట్రల్, హైదరాబాద్ సౌత్ సర్కిల్స్ పనులు చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ ఆర్థికాభివృద్ధికి విద్యుత్ ప్రణాళికలు
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లో విద్యుత్ ప్రణాళికలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP) పెంచడానికి, ప్రజల విద్యుత్ అవసరాలను తీర్చడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ప్రపంచంలోని అత్యంత అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడే విధంగా రాష్ట్రాన్ని నిర్మించడానికి బలంగా పునాదులు వేస్తున్నామని, ఇందులో భాగంగా 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని వివరించారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి అనుగుణంగానే సమగ్రమైన విద్యుత్ ప్రణాళికలను తయారు చేశామని పేర్కొన్నారు.
ఉత్పత్తి రంగాలు, ముఖ్యంగా తయారీ, వ్యవసాయం, సేవల రంగాలు అభివృద్ధి చెంది, వాటి ద్వారా ఉత్పత్తి భారీ స్థాయిలో పెరిగితేనే రాష్ట్ర జీఎస్డీపీకి దోహదపడి, ఆర్థిక వ్యవస్థ ఆశించిన స్థాయిలో పెరుగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ ఉత్పత్తి రంగాలకు అవసరమైన నాణ్యమైన విద్యుత్తును అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రపంచ స్థాయి నగరాలతో పోటీపడే విధంగా తెలంగాణ అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఆశిస్తోందని, అందుకనుగుణంగా ప్రపంచంలోని వివిధ దేశాలలో తలసరి విద్యుత్ వినియోగానికి అనుగుణంగా తెలంగాణలో కూడా తలసరి విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి ఆలోచన చేస్తూ ముందుకు వెళుతున్నట్లు తెలిపారు.

పెరిగిన విద్యుత్ డిమాండ్
రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంతో పోలిస్తే ఒకేసారి విద్యుత్ డిమాండ్ 10 శాతం పెరిగిందని భట్టి విక్రమార్క వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబులు దావోస్ వెళ్లి వివిధ సంస్థలతో ఎంఓయూలు చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో డేటా, గ్లోబల్ సెంటర్స్ ఏర్పాటు కానున్నాయని, దీనితో హైదరాబాద్ గ్లోబల్ హబ్‌గా మారనుందని తెలిపారు. అంతేకాక, మూసీ నది పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా విద్యుత్ ప్రణాళికలు రూపొందించామని చెప్పారు.
2047 లక్ష్యం: 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ
రాష్ట్ర ప్రభుత్వం 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఒక ఖచ్చితమైన ప్రణాళికతో ముందుకు పోతోంది. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే జీఎస్డీపీ 13 శాతం పెరగాలని, అదే స్థాయిలో విద్యుత్తు వినియోగం పెరుగుదల ప్రతి ఏటా 10 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. ఆ లెక్కన 2047 నాటికి 1,39,310 మెగావాట్లకు పైగా విద్యుత్ అవసరం ఏర్పడుతుందని వివరించారు. ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్ అవసరం ఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కేవలం 20,754 మెగావాట్లుగా ఉందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014లో పవర్ డిమాండ్ 6,755 మెగావాట్లు ఉండగా, అది 2025 నాటికి 17,162 మెగావాట్లకు పెరిగింది. 2025-26 నాటికి ఇది 18,825 మెగావాట్లకు, 2035 నాటికి 48,827 మెగావాట్లకు పెరిగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయని చెప్పారు. 2025 నుంచి ప్రతి ఏటా 8.50 శాతం పెరుగుదలతో, 2047 నాటికి ప్రతి ఏటా 10 శాతం మేర వృద్ధి రేటు ఉండవచ్చని అంచనాలున్నాయి.

భవిష్యత్తులో విద్యుత్ డిమాండ్ అవసరాలు ఈ విధంగా ఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 20,754 మెగావాట్లుగా మాత్రమే ఉందని, కాబట్టి 2047 లక్ష్యానికి చేరుకునేందుకు విద్యుత్తు ఉత్పత్తిని పెంచుకోవాలని భట్టి విక్రమార్క అన్నారు. పారిస్ ఒప్పందం ప్రకారం, 2030 నాటికి విద్యుత్ వినియోగంలో 50 శాతం గ్రీన్ ఎనర్జీనే ఉండాలని, 2070 నాటికి పూర్తిగా గ్రీన్ ఎనర్జీనే వినియోగించాలని స్పష్టంగా ఉందని గుర్తు చేశారు. గత పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం విద్యుత్తు పాలసీ తీసుకురాకపోవడం వల్ల సోలార్, థర్మల్, విండ్, పంప్డ్ స్టోరేజీలలో మనం వెనుకబడి ఉన్నామని తెలిపారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) ప్రకారం, 2029-30 నాటికి రాష్ట్రం మైనస్ 243 మిలియన్ యూనిట్లకు వెళుతుందని, ఆ సంవత్సరానికి విద్యుత్ స్టోరేజీ 7,366 మెగావాట్లు అవసరమని వివరించారు. సోలార్ పవర్ కొనుగోలు చేయాలంటే 25 ఏళ్ల అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుందని, ఇప్పటికైనా విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తును బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ స్టోరేజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోందని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో 12 ప్రాంతాల్లో పంప్డ్ స్టోరేజ్ పాయింట్లకు అవకాశం ఉందని, పంప్డ్ స్టోరేజ్ కు తెలంగాణ అనుకూలమైన రాష్ట్రమని, రాష్ట్రానికి కావాల్సిన నీరు (వాటర్), శక్తి (ఎనర్జీ) పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. ప్రపంచంతో పోటీపడే విధంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ సమీపంలో బొగ్గు గనులు లేకపోవడం వల్ల వందల కిలోమీటర్ల దూరం నుంచి బొగ్గు తీసుకురావాల్సి వస్తోందని, ఈ కారణంగా విద్యుత్ ఉత్పత్తిపై భారం పడుతోందని వివరించారు. అందుకే, ప్రజా ప్రభుత్వం బొగ్గు గనుల వద్దనే థర్మల్ ప్రాజెక్ట్ను నిర్మించాలని చూస్తోందని, ఎన్టీపీసీ లేదా జెన్ కో - ఎవరు తక్కువ ధరకు నిర్మిస్తే వారికే ఈ పని అప్పగిస్తామని ఆయన చెప్పారు.






















