BRS Silver Jubilee Meeting: బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
BRS Public Meeting: గులాబీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండగ రోజు రానే వచ్చింది. అందుకే గులాబీ జెండాను భుజానకెత్తుకొని కార్యకర్తలు, నాయకులంతా ఎల్కతుర్తి సభకు బయల్దేరి వెళ్తున్నారు.

BRS Silver Jubilee Meeting: బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు సర్వం సిద్ధమైంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి వద్ద ఇవాళ ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభకో గత నెల రోజులుగా గులాబీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లిన ఆ పార్టీ నాయకులు సభకు తరలి రావాలని ఆహ్వానించారు. దీంతో ఈ సభకు లక్షల్లో ప్రజలు వస్తాయని ఆకాంక్షిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే విస్తృత ఏర్పాటు చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న ఆకాంక్షతో 2001 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించింది. రాష్ట్రాన్ని సాధించి పదేళ్లు పాలించి జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టేందుకు బీఆర్‌ఎస్‌గా పేరు మార్చుకుంది. అయితే అనూహ్య రీతిలో ప్రతిపక్ష పార్టీ స్థానంలో ఉంటూ పాతికేళ్ల పండగను జరుపుకుంటోంది. ఇది గులాబీ శ్రేణులు ఊహించని పరిణామం అయినా సరే ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా సభకు తరలి వెళ్తున్నారు.
ఆదివారం జరిగే పాతికేళ్ల ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని బీఆర్‌ఎస్ శ్రేణులు ఘంటాపథంగా చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ప్రజలను ఏకతాటిపై నడిపించిన కేసీఆర్... కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తెలంగాణ సాధించారని చెబుతున్నారు. అదే దీక్షతో తెలంగాణలో అధికారం చేపట్టి పదేళ్ల పాటు దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిపారని పేర్కొంటున్నారు. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ చేతిలో పడి ధ్వంసం అవుతుందని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మరో పోరాటానికి కేసీఆర్ నడుంబిస్తారని అంచనాలతో ఉన్నారు. ఈ సభ సాక్షిగా 14 ఏళ్ల ఉద్యమ ప్రస్తానం, పదేళ్ల పాలనా విజయాలు, ఇప్పుడు తెలంగాణ ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటినీ అడ్రెస్ చేసేలా సభ సాగుతుందని చెబుతున్నారు.
రాష్ట్ర నలు మూలల నుంచి సభకు బీఆర్‌ఎస్ శ్రేణులు తరలి వస్తున్నారు. ఉమ్మడి వరంగల్ మొత్తం గులాబీ మయం అయిపోయింది. ఎక్కడ చూసినా ఫ్లెక్సీసీలు, బ్యానర్లు, భారీ కటౌట్లు ఇలా సభకు వెళ్లే నలుదిక్కులు కూడా నిండిపోయాయి. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వెయ్యి ఎకరాల్లో పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వచ్చే వాళ్లకు ఫుడ్ , వాటర్‌కు ఇబ్బందిలేకుండా సౌకర్యాలు కల్పించారు. ఆరోగ్య సమస్యలు వచ్చినా వైద్యం అందించేందుకు ప్రత్యేక శిబిరాలు సిద్ధం చేశారు. ఎకరాల్లో ప్రత్యేక టెంట్‌లు వేశారు. ఎక్కడి నుంచి అయినా నేతల ప్రసంగాలు కనిపించేలా ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఉంచారు. దీని వల్ల తోపులాట ఘటనలు జరకుండా ముందుజాగ్రత్తలు తీసుకున్నారు.
రజతోత్సవ సభ కోసం 1213 ఎకరాల్లో కేవలం సభా ప్రాంగణం కోసం 154 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. ఈ వేదికపై 500 మంది కూర్చోవచ్చు. దీని పక్కనే కళాకారుల కోసం ప్రత్యేక స్టేజ్ నిర్మించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా వాహనాలు వస్తాయని ట్రాఫిక్ సమస్యల్లేకుండా ఉండేందుకు 1,059 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఎండలు భారీగా ఉన్నందున వచ్చే వాళ్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు పది లక్షల వాటర్ బాటిల్స్‌్, 15 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 1200 మరుగుదొడ్లు రెడీ అయ్యాయి. ఎక్కడికక్కడ వచ్చే వాళ్లు దారి తప్పిపోకుండా లేదా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు రెండు వేల మందికిపైగా వాలంటీర్లను కూడా ఉంచారు.





















