Crime News: ఏపీలో కాంగ్రెస్ నేత దారుణ హత్య, వాహనంతో ఢీకొట్టి, వేట కొడవళ్లతో నరికేశారు!
Congress Leader Murder | ఏపీలో కాంగ్రెస్ నేత, ఆలూరు నియోజకవర్గం ఇంఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణహత్యకు గురయ్యారు. ఈ ఘటనపై పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Anantapur Crime News | గుంతకల్లు: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణహత్యకు గురయ్యారు. గుంతకల్లు రైల్వే బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు మొదట లారీతో కాంగ్రెస్ నేత వాహనాన్ని ఢీకొట్టారు. అనంతరం వేటకొడవళ్లతో దాడి చేసి నరికి చంపారు. కాంగ్రెస్ నేత కుమారుడు చిప్పగిరి వినోద్ తీవ్రంగా గాయపడ్డాడు.
వైఎస్ షర్మిల దిగ్భ్రాంతి..
ఆలూరు కాంగ్రెస్ ఇంఛార్జ్ లక్ష్మీనారాయణ దారుణహత్య గురికావడంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఓ పార్టీ నేతను మొదట లారీతో ఢీ కొట్టి, ఆ తరువాత వేట కొడవళ్ళతో నరికి చంపారంటే.. ఏపీలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయని అందరికీ అర్థం అవుతుంది. కాంగ్రెస్ నేత హత్య ఘటనపై పోలీసు శాఖ అత్యున్నత విచారణ జరిపించాలి. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి. లక్ష్మీ నారాయణ కుటుంబ సభ్యులకు షర్మిల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని షర్మిల భరోసా ఇచ్చారు.






















