PM Modi AP Tour Schedule: ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు, 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ
Pm modi Andhra Pradesh Tour | ఏపీ ప్రభుత్వం మే 2న అమరావతి పునర్ నిర్మాణ పనులు ఘనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరు కాబోతున్నారు.

PM Modi Amaravati Visit Schedule | అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. రాజధాని అమరావతిలో మే 2న పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్వయంగా ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అమరావతి పునర్ నిర్మాణంలో భాగంగా వేల కోట్ల పనులకు మోదీ శ్రీకారం చుట్టనున్నారు. మే 2న ప్రధాని మోదీ 15 నిమిషాలు రోడ్డుషో.. గంట పాటు సభ నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
అమరావతి పునర్ నిర్మాణ పనులను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకోసం ప్రధాని మోదీని ఏపీ సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు ఢిల్లీకి వెళ్లి ఇటీవల ఆహ్వానించారు. మే2 నిర్వహించనున్న కార్యక్రమం ప్రధాన వేదికపై 20 మంది కుర్చునేందుకు ప్లాన్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సభ కోసం మూడు వేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా మొత్తం 20 మంది కూర్చునేందుకు ప్లాన్ చేశారు. మిగతా వీవీఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేయనున్నారు. ఆ వేదికపై మొత్తం 100 మంది వరకు ఉంటారని సమాచారం.
ప్రధాని మోదీ అమరావతి పర్యటన షెడ్యూల్
- ప్రధాని 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
- హెలికాప్టర్ లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలిప్యాడ్‌కు ఆయన చేరతారు.
- అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కిలో మీటర్ల మేర రోడ్డు షోలో పాల్గొంటారు. 15 నిమిషాలపాటు రోడ్డు షో ఉంటుంది.
- 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్ ప్రధాని మోదీ సందర్శిస్తారు.
- సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సభజరుగుతుంది. అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం సభలో ప్రసంగిస్తారు.
- 5.10 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.
- 5.20కి గన్నవరం నుంచి బయల్దేరి ప్రధాని మోదీ ఢిల్లీ వెళతారు.






















