Annavaram Satyanarayana Swamy: జంట కొండల మధ్య రహస్య స్థావరం ..అన్నవరంలో తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రదేశం ఇది!
Satyanarayana Swamy: వైశాఖ మాసంలో అన్నవరం సత్యనారాయణ స్వామి కల్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ సందర్భంగా అన్నవరం దర్శించుకునే భక్తులు వీటిని మిస్సవకండి

Annavaram Satyanarayana swamy: తూర్పుగోదావరి జిల్లా రత్నగిరి కొండలపై ఉన్న అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనది. ఈ క్షేత్రాన్ని దర్శించుకునే భక్తులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్థిల్లుతారని భక్తుల విశ్వాసం.
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతశ్చ మహేశ్వరం
అధతో విష్ణురూపాయ త్ర్త్యెక్య రూపాయతేనమః
పురాణాల్లో పేర్కొన్న కథనం ప్రకారం... మేరుపర్వతం ఆయన భార్య ఇద్దరూ శ్రీ మహావిష్ణువు కోసం తపస్సుచేయగా ఇద్దరు సంతానం కలిగారు. వారిద్దరే భద్రుడు, రత్నాకరుడు. వీళ్లిద్దరూ కూడా నిత్యం స్వామివారి సేవలో నిమగ్నమై ఉండేవారు. వారిని కరుణించిన శ్రీమహావిష్ణువు త్రేతాయుగంలో రాముడిగా కొలువై నీ కొండపై ఉంటానని వరమిచ్చాడు. అలా భద్రుడు కొండగా కొలువైన ప్రదేశం భద్రగిరి. ఇక రత్నగిరిగా మారిన రత్నాకరుడిపై త్రిమూర్తులు కొలువయ్యారు.
రత్నగిరిపై సత్యనారాయణడు కొలువైన విషయం కొన్నేళ్లపాటూ బయటప్రపంచానికి తెలియలేదు. ఇక వెలుగులోకి రావాలని భావించిన భగవంతుడు ఆ ప్రదేశంలో ఉన్న సంస్థాన జమిందారుకి, మరో విష్ణుభక్తుడికి కలలో కనిపించి చెప్పారు. 1891 ఆగష్టు 6న స్వామివారిని వెతుక్కుంటూ వెళ్లిన ఆ జమిందారు కొండల్లో ఎంత వెతికినా కనిపించలేదు. అప్పుడు అమ్మవారు వృద్ధురాలిగా వచ్చి ఓ చెట్టుకింద ఉన్న పుట్టలో వెతకమని చెప్పింది. అలా స్వామివారి రూపం బయటకొచ్చింది.
సాధారణంగా ఏ ఆలయంలో అయినా గర్భగుడిలో విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ముందు యంత్ర ప్రతిష్ట చేస్తారు. అన్నవరంలో ఉండే యంత్రం విశేషం ఏంటంటే స్వామివారు స్వయంగా కాశీలో ఉన్న ఓ సిద్ధుడితో తన యంత్రాన్ని గీయించుకుని తెప్పించుకున్నారట. ఆ యంత్రమే రత్నగిరిలో మొదటి అంతస్తులో ఏర్పాటు చేశారు. అన్నవరం వెళ్లే భక్తులు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన, గమనించాల్సిన, తెలుసుకోవాల్సిన ప్రదేశం ఇది.
అన్నవరాలు ఇచ్చే స్వామి కాబట్టే అన్నవరం అనే పేరొచ్చింది. ఈ ఆలయం రెండు అంతస్థుల్లో ఉంది. పై అంతస్తులో శివుడు, అమ్మవారు ఉంటారు. ఆ మధ్యలో ధీరుడిలా మీసాలతో దర్శనమిస్తారు సత్యానారాయణ స్వామి. కింద అంతస్తులో ఉండే పీఠం కిందనే ఉంది యంత్రం( కాశీ నుంచి సిద్ధుడు తీసుకొచ్చిన యంత్రం ఇది). ఇక్కడ లింగరూపంలో కనిపిస్తూనే పైన సత్యనారాయణ స్వరూపం ఉంటుంది. పీఠానికి ఆగ్నేయం వైపు వినాయకుడు, నైరుతి వైపు సూర్యుడు, ఈశాన్యంలో ఈశానుడు, వాయువ్యంలో అమ్మవారు..అందరికి మధ్యలో విష్ణువు కొలువై ఉంటారు. అందుకే ఇక్కడ స్వామివారిని పంచాయతన మూర్తి అని పిలుస్తారు.
అన్నవరంలో దర్శించుకునే భక్తులు చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాలు ఇవే
అన్నవరం ఘాట్ రోడ్ మార్గంలో నేరెళ్లమ్మ అనే గ్రామదేవత ఆలయం ఉంటుంది. ఒకప్పుడు పిఠాపురంలో ఉండే ఈ అమ్మవారు సత్యనారాయ స్వామివారు ఇక్కడ కొలువైన తర్వాత తనకు తానుగా వచ్చి అమ్మవారు ఇక్కడ వెలిశారని స్థలపురాణం
మెట్లదారి సమీపంలో కనకదుర్గమ్మ ఆలయం ఉంది
అన్నవరం కొండెక్కే ముందు మార్గ మధ్యలో వనదుర్గ ఆలయం ఉంటుంది. రాత్రి సమయంలో ఇక్కడ అమ్మవాు సంచరిస్తారని కొందరు ఉపాసకులు చెబుతారు
కొండపైన ఉన్న ఆలయం పక్కన సీతారామచంద్రులు ఉన్నారు..భద్రగిరిపై వెలసిన సీతారాములే రత్నగిరిపై వెలసిన స్వామికి క్షేత్రపాలకులు.
అన్నవరం కొండపై సన్ డయల్ అని ఉంటుంది. పిడవర్తి కృష్ణమూర్తి శాస్త్రి, స్థానిక జమిందారు కలసి రూపొందించిన ఈ సన్ డయల్.. సూర్యుడి నీడ ఆధారంగా సమయాన్ని సూచిస్తుంది
ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో ఏకాదశి రోజు స్వామివారి కళ్యాణం కన్నులపండువగా జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు గిరిప్రదక్షిణకు లక్షలాది భక్తులు పాల్గొంటారు.
తిరుమల వెంకన్న లడ్డూ ప్రసాదం తర్వాత సత్యనారాయణ స్వామి ప్రసాదం అంత రుచికరంగా ఉంటుందంటారు భక్తులు. విశాఖ ఏజెన్సీ నుంచి నెలకు దాదాపు 20 లక్షల ఆకులు తెప్పించి వాటిలో ప్రసాదాన్ని పెట్టి అందిస్తారు.
అన్నవరంలో జంట కొండల మధ్య రహస్య స్థావరం ఉందని..అల్లూరి సీతారామరాజు ఉద్యమ సమయంలో ఆ రహస్యమార్గంలోనే రాకపోకలు సాగించేవారని చెబుతారు






















