Budget 2025: పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారా? - దీని గురించి ఎందుకు చర్చిస్తున్నారు!
Old Income Tax Regime: పాత ఆదాయ పన్ను విధానం రద్దుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, దీనిపై దేశవ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది.

Income Tax Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), 01 ఫిబ్రవరి 2025న కేంద్ర బడ్జెట్ సమర్పించనున్నారు. ఏటా, బడ్జెట్ సమయంలో, ఆదాయ పన్ను మినహాయింపులు & టాక్స్ స్లాబ్‌లకు సంబంధించి ఏదో ఒక అంచనా ఉంటుంది. ఈసారి మాత్రం, ఏకంగా పాత ఆదాయ పన్ను విధానాన్ని (Old Tax Regime) రద్దు చేస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి, కొత్త ఆదాయ పన్ను విధానాన్ని (New Tax Regime) ప్రోత్సహించడానికి & విస్తృతపరచడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో, పాత పన్ను విధానానికి మంగళం పాడతారన్న వార్తలు జాతీయ మీడియాలో కనిపిస్తున్నాయి. నిజంగానే కేంద్ర ప్రభుత్వం పాత ఆదాయ పన్ను విధానాన్ని రద్దు చేస్తుందా, ఆ విషయాన్ని వచ్చే బడ్జెట్‌లో ప్రకటిస్తుందా?. 2020 ఫిబ్రవరి 01న సమర్పించిన సాధారణ బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది.
ఇప్పుడు, పాత పన్ను విధానాన్ని ఒకసారి పరిశీలిద్దాం. పాత పన్ను విధానంలో చాలా రకాల తగ్గింపులు & మినహాయింపులు (Deductions & Exemptions) ఉన్నాయి. అందువల్ల ప్రజలు, ముఖ్యంగా జీతం తీసుకుంటున్న ఉద్యోగులు (Salaried Employees) దీనిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే.. కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు తక్కువగా ఉన్నాయి. కానీ, తగ్గింపులు & మినహాయింపుల ప్రయోజనాలు పెద్దగా లేవు.
ఆదాయ పన్ను విధానాన్ని సరళీకరించడమే లక్ష్యం
కేంద్ర ప్రభుత్వం, ఆదాయ పన్ను విధానాన్ని సులభంగా మార్చాలని భావిస్తోందని, కొత్త పన్ను విధానాన్ని సరళీకరించి & పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తుందని పన్ను చెల్లింపుదారులు ఊహిస్తున్నారు. ఈ విషయం తమ దృష్టికి కూడా వచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇటీవల చెప్పారు. పాత పన్ను విధానంలో, ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి (Section 80C of the Income Tax Act) కింద రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడులపై పన్ను మినహాయింపు లభిస్తుంది. అదేవిధంగా, సెక్షన్ 80డి (Section 80D of the Income Tax Act) కింద ఆరోగ్య బీమా ప్రీమియంపై మినహాయింపు కోసం ఒక నిబంధన ఉంది. ఈ సెక్షన్ ప్రకారం, పన్ను చెల్లింపుదారులు తమకు & తమ కుటుంబానికి వైద్య బీమా ప్రీమియంపై మినహాయింపులు పొందవచ్చు. ఇది పన్ను విధించదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది.
ప్రభుత్వం పాత పన్నుల విధానాన్ని నిజంగానే ముగిస్తుందా?
కొత్త పన్ను విధానం పట్ల కేంద్ర ప్రభుత్వ పక్షపాత వైఖరి, దానిని స్వీకరించే వారి సంఖ్య ఏటికేడు పెరగడాన్ని పరిగణనలోకి తీసుకుని చూడాలని పన్ను నిపుణులు (Tax Experts) చెబుతున్నారు. పాత పన్ను విధానంలో మినహాయింపుల పరిమితిని కూడా పెంచడం లేదు. కాబట్టి, వచ్చే బడ్జెట్‌లో కాకపోయినా, భవిష్యత్‌లో పాత పన్ను విధానాన్ని పూర్తిగా రద్దు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
మరో ఆసక్తికర కథనం: పాకిస్థాన్ ప్రధాని సమర్పించిన భారతదేశ బడ్జెట్ - 'పేదల బడ్జెట్'గా ఖ్యాతి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

