10th Examinations 2025: తెలుగు పరీక్ష కోసం వెళ్తే హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు- మంచిర్యాల జిల్లాలో షాక్ తిన్న విద్యార్థులు
Telangana SSC Examinations 2025 : మంచిర్యాల జిల్లాలో పదో తరగతి పరీక్షల్లో తప్పుజరిగింది. తెలుగు పేపర్‌కు బదులు హిందీ ప్రశ్నాపత్రం ఇచ్చారు. దీంతో ఇద్దరిని కలెక్టర్ సస్పెండ్ చేశారు.

Telangana 10th Examinations 2025: తెలంగాణలో ఇవాళ్టి(21 మార్చి 2025) నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఫస్ట్ లాంగ్వేజ్‌ను విద్యార్థులు రాశారు. అయితే ప్రారంభమైన మొదటి రోజే మంచిర్యాల జిల్లాలో అధికారు నిర్లక్ష్యం కనిపించింది. ఒక ప్రశ్నాపత్రానికి బదులు మరో ప్రశ్నాపత్రం ఇచ్చి విద్యార్థులను కంగారు పెట్టింది. కాసేపటికి తేరుకొని తప్పు సరి చేసుకున్నారు. కొందరు విద్యార్థులు ఆ షాక్ నుంచి తేరుకొని పరీక్ష రాసే సరికి సమయం పట్టింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పరీక్ష ప్రారంభమైందని బెల్ కొట్టిన తర్వాత పరీక్ష కేంద్రంలోని ఇన్విజిలేటర్లు ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు ఇచ్చారు. ప్రశ్నాపత్రాన్ని చూసి విద్యార్థులంతా అవాక్కయ్యారు. తెలుగు పరీక్ష అని చదువుకొని వస్తే హిందీ పేపర్ రావడంతో అంతా కంగారు పడ్డారు.
హిందీ పేపర్ చూసిన విద్యార్థులు భయపడిపోయారు. విషయాన్ని ఇన్విజిలేటర్లకు చేరవేశారు. తెలుగు పేపర్ బదులు హిందీ పేపర్ వచ్చిందని అప్పటి వరకు ఎవరికీ తెలియలేదు. అప్రమత్తమైన సీఎస్ జిల్లా విద్యాశాఖాధికారికి తెలిపారు. డీఈఓ, జిల్లా కలెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అధికారులు అక్కడికి చేరుకొని సరి చేసిన పరీక్ష పేపర్‌ను విద్యార్థులకు ఇచ్చారు.
ఇలా ఉదయం ఉదయం 9.30గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష 11:30 గంటలకు మొదలైంది. దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విద్యార్థులు పరీక్ష రాశారు. ఇంతలో చాలా మంది విద్యార్థులు భయపడిపోయారు. ఏం జరుగుతుందో తెలియకపోవడంతో తర్వాత పరీక్షను కూడా సరిగా రాయలేకపోయామని అంటున్నారు.
ప్రశ్నాపత్రం తారుమారైన విషయంపై జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సీరియస్ అయ్యారు. తొలి రోజే ఇలాంటివి జరగడం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని నిలదీశారు. ప్రశ్నాపత్రాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం, పరీక్ష ఆలస్యంపై ప్రశ్నలు సంధించారు.
ఒక ప్రశ్నాపత్రం బదులు మరో పేపర్ రావడం అంటే చిన్న విషయం కాదని కలెక్టర్ మండిపడ్డారు. దీనిపై వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా డీఈఓకు ఆదేశాలు జారీ చేశారు. పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలిరోజే విధుల్లో నిర్లక్ష్యం వహించారని ఇద్దరు అధికారులను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇలాంటి తప్పులు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ ఘటన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరీక్షా కేంద్రంలోని ఒక సెంటర్‌లో మాత్రమే రెండు గంటలు పేపర్ ఆలస్యంగా ఇచ్చారని కలెక్టర్ ధైర్యం చెప్పారు. విద్యార్థులు పరీక్ష కాస్త లేటుగా రాసరన్నారు. నిర్లక్ష్యం వహించిన ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేశామని తెలిపారు. ఇలాంటి తప్పులు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
పదోతరగతి పరీక్ష టైంటేబుల్ ఇదే
మార్చి 21- ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 22- సెకండ్ లాంగ్వేజ్
మార్చి 24- ఇంగ్లీష్
మార్చి 26- గణితం
మార్చి 28- ఫిజికల్ సైన్స్
మార్చి 29- బయోలాజికల్ సైన్స్
ఏప్రిల్ 2- సోషల్ స్టడీస్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

