Pawan Kalyan Seize The Ship: సీజ్ ది షిప్ డైలాగ్ బాగుంది, కానీ పవన్ కళ్యాణ్‌కు ఆ అధికారం ఉందా?
Andhra Pradesh News | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో విదేశీ ఓడను సీజ్ ద షిప్ అంటూ అధికారులను ఆదేశించారు. విదేశీ ఓడను సీజ్ చేయాలని ఆదేశించే అధికారం ఆయనకు ఉందా అనే ప్రశ్నలు తలెత్తాయి.
Does Pawan Kalyan have the authority to seize a foreign ship | సీజ్ ది షిప్ – ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన డైలాగ్ ఇది. దీనిని ఎవరో సాధారణ వ్యక్తి చెప్పి ఉంటే ఇలా ఫేమస్ అయ్యేది కాదు. కానీ ఇది చెప్పింది పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ఆయన ఉన్నా, పవర్ స్టార్ అభిమానులు ఆయనకు కల్పించిన క్రేజ్ వల్ల ఈ మాట నేషనల్ లెవల్‌లో మారుమోగింది. పవన్ కళ్యాణ్ ఆరోపణల ప్రకారం, రాష్ట్రంలోని కాకినాడ పోర్టు స్మగ్లర్లకు, సంఘవిద్రోహ శక్తులకు అడ్డాగా మారిందట. ఇది నిజమే అయితే, బ్లాక్ మార్కెట్ ద్వారా చౌకధరల బియ్యాన్ని (PDS Rice) ఇతర దేశాలకు తరలిస్తున్న ఆగంతకులపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సి ఉంటుంది. అలాంటి వారిని చట్టం కఠినంగా శిక్షించాల్సిందే.
ఇంకా ఒక విషయాన్ని గమనించాలి – పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం. "సీజ్ ద షిప్" అని చెప్పి ఆయన జాతీయ భద్రతపై తన స్పష్టమైన వైఖరిని చూపించారు. కానీ ఆయనకు ఇలాంటి చర్యలు తీసుకునే అధికారాలు ఉన్నాయా? ఆయన తన పరిధిని దాటి ప్రవర్తించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారత దేశ తూర్పు భాగమైన ఏపీ తీరంలో భద్రతకు ముప్పు పొంచి ఉందని, కసబ్ లాంటి ఉగ్రవాదులు సైతం దేశంలోకి ఎలా వచ్చారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
ఇక్కడ పవన్ కళ్యాణ్ పేర్కొన్న నౌక "పనామా స్టెల్లా", ఇది పనామా దేశానికి చెందిన కార్గో షిప్. ప్రస్తుతం ఇది వెస్ట్ ఆఫ్రికాకు వస్తువులను తరలిస్తోంది. ఇది అంతర్జాతీయ నౌక కావడంతో, ఈ కేసులో రాజ్యాంగం ఏం చెబుతుందో పరిశీలించడం ముఖ్యం.
రాజ్యాంగపరంగా అధికారాలు, పరిధి ఏంటి?
పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి. అయితే డిప్యూటీ సీఎం అనే పదవికి రాజ్యాంగ పరంగా ప్రత్యేక అధికారాలు ఏమీ ఉండవు. ముఖ్యంగా ఆయనకు కేటాయించిన పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మంత్రిత్వ శాఖలు అంతర్జాతీయ షిప్పింగ్ లేదా పోర్టుల సంబంధిత అంశాలకు సంబంధించిన అధికారాన్నికల్పించవు. ఈ హోదా గౌరవార్థం, రాజకీయ గుర్తింపు కోసం మాత్రమే ఉంటుంది.
అంతర్జాతీయ ఓడను సీజ్ చేయవచ్చా? (Seizing an International Ship)
"పనామా స్టెల్లా" అనే షిప్ ఓ అంతర్జాతీయ నౌక. ఇది వెస్ట్ ఆఫ్రికాకు వెళ్తోంది. అంతర్జాతీయ సముద్ర చట్టాల ప్రకారం (UNCLOS), నౌకలను సీజ్ చేయడం రాజ్యంగబద్ధమైన, న్యాయపరమైన అంశం. కస్టమ్స్, కోస్ట్ గార్డ్స్, లేదా కేంద్ర ప్రభుత్వమే ఈ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అది మన జలాల పరిధిలో ఉన్నా కూడా రాష్ట్రానికి ఈ విషయంలో అధికారాలు లేవు.
ఓ సాధారణ పౌరుడు అయిన సందర్భంలో
ఒక సాధారణ పౌరుడిగా పవన్ కళ్యాణ్ ప్రవర్తించినా, షిప్ పైకి వెళ్లి తన నిర్ణయాలు అమలు చేయడం చట్టబద్ధంగా కుదరదు. స్మగ్లింగ్, జాతీయ భద్రతకు సంబంధించి ఉన్న అనుమానాలు అధికారిక సంస్థలైన కోస్ట్ గార్డ్స్ లేదా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలి. కానీ ఒక రాష్ట్ర మంత్రిగా ఇలాంటి చర్యలు తీసుకోవడం రాజ్యాంగ పరంగా అతిక్రమణగా పరిగణిస్తారు.
దేశ భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నా సైతం..
పవన్ కళ్యాణ్ చెప్పిన అంశాలు జాతీయ భద్రతను స్పృశించే అంశాలు కావచ్చు. కానీ అలాంటి పరిస్థితుల్లో సైతం NIA, IB వంటి కేంద్ర సంస్థలకు ఆయన సమాచారం ఇవ్వాలి. అప్పుడు ఆ సంస్థలు దీనిపై విచారణలు చేపట్టాలి. రాష్ట్ర మంత్రుల స్థాయిలో ఇలాంటి చర్చలు, ఆదేశాలు జారీ చేయడం ఏ మాత్రం చట్టబద్ధమైన చర్య కాదు. దీనిపై జాతీయ స్థాయిలోనూ సమన్వయం అవసరం. కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే చర్యలు తీసుకునే అధికారం కలిగి ఉంటాయి.
అసలు విషయం ఇదీ..
పవన్ కళ్యాణ్ చర్యలు మంచి ఉద్దేశంతో తీసుకున్నా, అతని అధికారాలు పరిధిని దాటి వెళ్ళాయి. రాజ్యాంగ పరంగా కేంద్రం, రాష్ట్రాలకు వారి పరిధుల విషయంలో స్పష్టమైన హద్దులు ఉంటాయి. "సీజ్ ద షిప్" అంటూ చర్యలు తీసుకోవడం న్యాయపరంగా ఆయన అధికారాల్లో లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం, కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకునే హక్కు కలిగి ఉంటాయి. అంటే ఇది రాష్ట్రాలకు ఏ మాత్రం సంబంధించిన, చర్యలు తీసుకోదగిన పరిధిలోకి రాదు.