Pawan Kalyan: తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు, ఉగ్రవాది కసబ్ ఎలా వచ్చాడు- పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
AP Deputy CM Pawan Kalyan | తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని, కసబ్ లాంటి ఉగ్రవాదులు దేశంలోకి రాలేదా అని కాకినాడ పోర్టు వద్ద పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan at Kakinada Port | కాకినాడ: గంజాయికి ఆంధ్రప్రదేశ్ అడ్డాగా మారిందని, కాకినాడ పోర్టులోకి వెళ్లి స్టెల్లా అనే ఓడను పరిశీలించేందుకు వెళ్తే తనకు అధికారులు సహకరించలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎదురుగా షిప్ లో చిన్న చిన్న షిప్ నుంచి సరుకులు దింపుతూ ఎగుమతి చేస్తున్నారని పేర్కొన్నారు. పోర్టులో ఎగుమతి ఎలా జరుగుతుంది, ఎవరు చేస్తున్నారని అడిగితే తమకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉందని చెప్పడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.
తీరం ఎంత బలమో, అంత బలహీనత - పవన్ కళ్యాణ్
ఏపీకి 975 కిలోమీటర్ల తీరం కలిగి ఉంది. తీర ప్రాంతం మనకు ఎంత బలమో, అంత బలహీనత. గతంలో విశాఖపట్నానికి ఘాజీ అనే పాకిస్తాన్ సబ్ మెరైన్ రావడానికి నిదర్శనం. విదేశాల నుంచి ఆర్డీఎక్స్ దిగుమతి చేసుకోవచ్చు. గ్యాస్ నిక్షేపాల లాంటి సంస్థలు ఉన్నాయి. వంద కిలోల ఆర్డీఎక్స్ తీసుకొచ్చినా చూసే నాథుడే లేడు. ఇది కేవలం బియ్యానికి సంబంధించిన విషయం కాదు. పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్ లాంటి వాళ్లు కరాచీ నుంచి ఎలా వచ్చారు. మనకు తూర్పు తీరంలో సముద్రమార్గంలో రక్షణ లేదు. ఎస్పీకి మొదటినుంచీ చెబుతున్నా. వారి నుంచి మాకు కనీసం రిపోర్టు రాలేదు. కలెక్టర్, కొండబాబు, సివిల్ సప్లైస్ చైర్మన్ సుధీర్ లాంటి వారు ఎంతో కొంత బియ్యాన్ని పట్టుకుని ఉక్కుపాదం మోపుతున్నారు. - ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అధికారులు నాకు సహకరించడం లేదు- పవన్ కళ్యాణ్
స్టెల్లా అనే షిప్‌లో టన్నుల కొద్దీ పీడీఎస్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారని, దీని మీద చర్యలు తీసుకోవాలని చూస్తే ఇది పెద్ద నెట్‌వర్క్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈరోజు తనకు షెడ్యూల్ లేకున్నా, ఢిల్లీ నుంచి వచ్చాక కాకినాడ పోర్టుకు తాను వస్తానని తెలియగానే రావొద్దు సార్ వేలాది జీవితాలు దీని మీద ఆధారపడి ఉన్నాయని ఫోన్లు, మెస్సేజ్‌లు వచ్చాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. డిప్యూటీ సీఎం అయిన తనకే కాకినాడ పోర్టులో స్టెల్లా అనే ఓడను పరిశీలించేందుకు అధికారులు సహకరించడం లేదని సంచలన విషయాలు చెప్పారు. నాదెండ్ల మనోహర్ దీనిపై పోరాటం చేస్తే విషయం వెలుగులోకి వచ్చినా, చర్యలు తీసుకోవడానికి వీలు కావడం లేదంటే.. ఇది చాలా పెద్ద నెట్‌వర్క్ అన్నారు.
ఏపీ నుంచి విదేశాలకు కాకినాడ పోర్టు ద్వారా అక్రమంగా టన్నుల కొద్దీ బియ్యం తరలించడాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారని పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం నాడు కాకినాడ పోర్టుకు వెళ్లి తనిఖీలు చేపట్టి.. అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న సీజ్ చేసిన బియ్యాన్ని పరిశీలించారు. కాకినాడ పోర్టులో సీజ్ చేసిన టన్నుల కొద్ది బియ్యాన్ని పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న తరువాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.
2019 నుంచి 2024 మధ్య కాలంలో అక్రమంగా బియ్యం తరలించారని ఆరోపించారు. నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఆరోజు డ్రోన్ విజువల్స్ తీసి ప్రపంచానికి తెలిసేలా చేశాం. ఇప్పుడు కాకినాడ పోర్టుకు 1000 నుంచి 1100 లారీల బియ్యం వస్తుంది. ఇక్కడి నుంచి ప్రపంచానికి బియ్యం సరఫరా అవుతుంది. కానీ కాకినాడ పోర్టుకు కేవలం 16 మంది సెక్యూరిటీ ఉన్నారు. నాదెండ్ల మనోహర్ బియ్యం పట్టుకుని కేసులు పెట్టించి సీరియస్ అయితే అధికారులు స్పందిస్తున్నారు. తూర్పు తీరంలో దేశ భద్రతకు ముప్పు పొంచి ఉందని, వందల కిలోల ఆర్డీఎక్స్ మన దేశంలోకి తీసుకువచ్చినా పట్టించుకునే నాథుడు లేడన్నారు. భద్రత పెంచాల్సిన అవసరం ఉందని, ప్రధాని మోదీతో ఈ విషయంపై ఏపీ ప్రభుత్వం మాట్లాడుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.