SLBC Tunnel Rescue operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి, రెస్క్యూ ఆపరేషన్‌పై సమీక్ష
SLBC Rescue operation | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్దకు వెళ్లి సహాయక చర్యలను పరిశీలించనున్నారు. రెస్క్యూ పనులపై స్వయంగా సమీక్షించనున్నారు.

SLBC Tunnel Tragedy | నాగర్ కర్నూలు: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (SLBC Tunnel) లోపల చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 9వ రోజు అయిన ఆదివారం నాడు నలుగురి ఆనవాళ్లు గుర్తించే అవకాశం ఉందని సమాచారం. ఈ క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించనున్నారు. ఉదయం వనపర్తి జిల్లా పర్యటనకు వెళ్లి అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపన, భూమి పూజల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 5 గంటలకు వనపర్తి నుంచి SLBC టన్నెల్ ప్రమాదం జరిగిన దోమలపెంటకు చేరుకుంటారని అధికారులు తెలిపారు. కార్మికులను బయటకు తెచ్చే రెస్క్యూ ఆపరేషన్ పనులను సీఎం రేవంత్ సమీక్షించనున్నారు.
టన్నెల్ లో చిక్కుకున్న 8 మందిని గుర్తించేందుకు అత్యాధునిక జీపీఆర్ మెషిన్లు వాడుతున్నా ప్రయోజనం కనిపించడం లేదు. నేడు 9వ రోజు టన్నెల్‌లో రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. SLBC టన్నెల్ లోపల 10 అడుగుల మేర బురద పేరుకుపోయింది. ఈ బురద తొలగిస్తున్న కొద్దీ మళ్లీ నీళ్లు ఊరుతుండటంతో పని చేయడం వారికి సవాల్ గా మారింది. పలు బృందాలుగా ఏర్పడి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా ప్రతికూల పరిస్థితుల కారణంగా లోపల చిక్కుకున్న వారి జాడ గుర్తించలేకపోతున్నారు.

ఫిబ్రవరి 22న ఉదయం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పైకప్పు కొంతభాగం కూలింది. 42 మంది కొన్ని కిలోమీటర్లు పరుగులు పెట్టి, ఆపై లోకో ట్రైన్లో బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. టన్నెల్ బోరింగ్ మెషిన్ కు లోపల వైపున ఉన్న 8 మంది మాత్రం టన్నెల్ లో చిక్కుకున్నారు. ఎన్టీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ టీమ్స్, సింగరేణి టీమ్స్, ఇండియన్ ఆర్మీ, పోలీసులు, ర్యాట్ హోల్ మైనర్స్ టీమ్ లు సైతం ఎంత ప్రయత్నించినా లోపల చిక్కుకున్న వారి జాడను గుర్తించలేకపోతున్నాయి. తుది దశకు రెస్క్యూ ఆపరేషన్ అని ప్రచారం జరుగుతున్నా, ఇంతవరకూ లోపల చిక్కుకున్న వారి జాడను కనిపెట్టలేకపోయారు. వారి ఆచూకీపై ఇప్పటివరకూ ఒక్క అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు.
అసలేంటీ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్..
నల్గొండలో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, కొన్ని వందల గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ (SLBC Tunnel) ప్రాజెక్టు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2005లో వైఎస్సార్ సీఎంగా ప్రాజెక్టు ప్రారంభించారు. టన్నెల్ ప్రాజెక్టు మొత్తం పొడవు 44 కిలోమీటర్ల కాగా, అనివార్య కారణాలు, సాంకేతిక సమస్యలతో పలుమార్లు పనులు నిలిచిపోయాయి. ప్రభుత్వాలు మారినా, దశాబ్దాలు గడిచినా పనులు పూర్తి కాలేదు. ఈ 20 ఏళ్లలో దాదాపు 35 కిలోమీటర్ల మేర టన్నెల్ పూర్తి కాగా, మరో 9 కిలోమీటర్ల పనులు చేయాల్సి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టన్నెల్ పూర్తిచేసి సాగునీరు, తాగునీరు అందించాలని భావించింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 18న SLBC టన్నెల్ పనులు చేపట్టగా, ఫిబ్రవరి 22న ఉదయం టన్నెల్ పైకప్పు కూలిపోవడంతో విషాదం నెలకొంది. 14వ కిలోమీటర్ వద్ద ఘటన జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట వద్ద ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగింది.
Also Read: SLBC Tunnel : SLBC నిర్మాణంలో ఆది నుంచి నిర్లక్ష్యమే, పాలకుల తప్పునకు కార్మికులకు శిక్ష!






















