Rammohan Naidu: వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణంపై రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
Warangal Airport | వరంగల్ మామునూరు ఎయిర్ పోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేసి ఇస్తే, రెండున్నరేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.

Warangal Mamunur Airport |హైదరాబాద్: త్వరలో భద్రాద్రి ఎయిర్‌పోర్టుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టుకు తన హయాంలో క్లియరెన్స్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని కవాడిగూడలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఎయిర్ పోర్టు కోసం తెలంగాణ ప్రభుత్వం త్వరగా భూసేకరణ చేస్తే పనులు వేగవంతం చేస్తామని రామ్మోహన్‌నాయుడు అన్నారు. రెండున్నరేళ్లలో ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించారు. భద్రాద్రి విమానాశ్రయానికి సంబంధించి కొత్త స్థలం ఫీజిబులిటీని పరిశీలించి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
వరంగల్ ఎయిర్ పోర్ట్ గతంలో ఆసియాలోనే అతిపెద్దదిగా ఉండేది. 1981వరకు ఏదో రూపంలో అక్కడ కార్యకలాపాలు జరిగాయి. కానీ హైదరాబాద్ అభివృద్ధి చెందడం, అక్కడ విమానాశ్రయాలు నిర్మించుకున్నాం. ఇప్పుడు వరంగల్ లో అక్కడ పూర్తి స్థాయి ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టేందుకు అడుగులు పడుతున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. తాను కేంద్ర మంత్రి అయిన సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు తనకు ఒకటే మాట చెప్పారని.. ఏపీతో పాటు తెలంగాణకు.. దేశం మొత్తానికి ప్రతినిధిగా ఎయిర్ పోర్టుల అభివృద్ధిపై చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చారని రామ్మోహన్ నాయుడు గుర్తు చేసుకున్నారు.
నరేంద్ర మోదీ ప్రభుత్వంలో చిన్న చిన్న నగరాల్లోనూ విమానాశ్రయాలు ఏర్పాటు చేశాం. కానీ వరంగల్ సిటీలో ఎయిర్‌పోర్టు విషయంలో ముందడుగు పడలేదు. ఎన్డీయే గత పదేళ్ల పాలనలో ఎయిర్‌పోర్టుల సంఖ్య 79 నుంచి 150కి పెరిగిందని తెలిపారు. అదేవిధంగా తెలంగాణలోనూ ఎయిర్‌పోర్టులు సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయాలని కిషన్ రెడ్డి సూచించినట్లు తెలిపారు. వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్టు క్లియరెన్స్ పై కొన్ని సమస్యలు వచ్చాయని తెలిపారు. ఎయిర్‌పోర్టుకు 2800 మీటర్ల రన్‌వే అవసరం కాగా, 280 ఎకరాలు అదనంగా భూసేకరణ అవసరమని ప్రతిపాదనలు వచ్చాయన్నారు. గత తెలంగాణ ప్రభుత్వం నుంచి సహకారం లేనందువల్లే వరంగల్ ఎయిర్ పోర్టు ఆలస్యమైంది. ప్రస్తుత ప్రభుత్వం త్వరగా భూసేకరణ పూర్తి చేస్తేనే మామునూరు ఎయిర్‌పోర్టు పనులు వేగవంతం అవుతాయి. భూసేకరణ పూర్తయిన రెండున్నరేళ్లలో ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని రామ్మోహన్ నాయుడు ప్రకటించారు.






















