Babili water Release: బాబ్లీ నుంచి నీటి విడుదల- సుప్రీం ఆదేశాల మేరకు నీటిని వదిలిన మహరాష్ట్ర
Babili water Release: బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల అయింది. తెలంగాణ నీటి అవసరాల కోసం మహరాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శనివారం తెరిచారు

Babili water Release: బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల అయింది. తెలంగాణ నీటి అవసరాల కోసం మహరాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను శనివారం తెరిచారు. మహరాష్ట్ర, తెలంగాణ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు 0.6 టీఎంసీల నీటిని మహరాష్ట్ర నుంచి దిగువకు వదిలారు. కేంద్ర జలసంఘం అధికారుల సమక్షంలో శనివారం మహరాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో బాబ్లీ ప్రాజెక్టు గేట్లను తెరిచి 0.6 టీఎంసీల మేర నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు 14 గేట్లను తెరిచి అధికారుల సమక్షంలో తెలంగాణ కోటాకు రావలసిన నీటిని వదిలారు. ఆ జలాలు ఆదివారం నాటికి శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు చేరుకుంటాయి.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మహరాష్ట్ర ఈ నీటిని విడుదల చేస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు కేంద్ర జలసంఘం ఈ నీటిపంపిణీని పర్యవేక్షిస్తుంది. ప్రతి ఏటా గోదావరి పరివాహక ప్రాంతంలోని తాగునీటి అవసరాల కోసం మార్చి 1న 0.6 టీఎంసీల నీటిని విడుదల చేస్తారు. ఆ తర్వాత బాబ్లీ గేట్లను మూసేస్తారు. ఆ తర్వాత జూలై 1 వతేదీన గేట్లను తెరిచి అక్టోబర్ 29 వరకూ అలాగే ఉంచుతారు.
బాబ్లీ వివాదం
బాబ్లీ వివాదం ఇప్పటిది కాదు. 2005లో నాందేడ్ జిల్లాలో ఈ బ్యారేజ్ ను కడుతున్నప్పుడే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఆ ప్రాజెక్టు శ్రీరాం సాగర్ బ్యాక్ బాటర్ పరిధిలోకి వస్తుందని, బ్యాక్ వాటర్ కు అడ్డుగా బారేజ్ గేట్లను ఏర్పాటు చేస్తే.. ప్రాజెక్టు సామర్థ్యం తగ్గుతుందని ఏపీ వాదించింది. తమ వాటా నీటిని సమర్థంగా వాడుకోవడానికే బ్యారేజ్ కట్టుకున్నామని ఏపీకి రావలసిన నీటిని గేట్ల ద్వారా వదులుతామని మహరాష్ట్ర చెప్పింది. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. విచారణ జరుగుతుండగానే రాజకీయ ఆందోళనలు కూడా జరిగాయి. 2010లో అప్పటి మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సహా తెలుగుదేశం నేతలు బాబ్లీ ప్రాజెక్టు వద్దకు ఆందోళనకు వెళ్లడం చాలా మంది సీనియర్ నేతలు అరెస్ట్ కావడం జరిగింది. ఆ తర్వాత ఈ వివాదంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి వేసవిలో తెలంగాణ తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని ఆదేశించింది. దాని ప్రకారమే ఇప్పుడు మహరాష్ట్ర నుంచి నీటిని విడుదల చేశారు. ఈ జలాలు నిర్మల్ జిల్లా మీదుగా శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు చేరుతాయి.





















