Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
Kakinada PDS Rice News | సూర్య సింగం సీన్ తరహాలో కాకినాడ కలెక్టర్ సముద్రంలోకి వెళ్లి మరీ ఛేజింగ్ చేసి అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు. ఆయన సాహసాన్ని అంతా మెచ్చుకుంటున్నారు.
సముద్ర మార్గంలో బియ్యం ఎగుమతి, కలెక్టర్ రావడంతో మారిన సీన్
కాకినాడ: నీతి, నిజాయితీగా పనిచేస్తే ఎక్కడికైనా వెళ్లొచ్చు, ఎవరిరైనా ప్రశ్నించే అధికారం అధికారులకు ఉంటుంది. కానీ నిందితులు తెలివి మీరిపోయారు. టెక్నాలజీ వాడి ఏదో రూపంలో తమ కార్యకలాపాలు సాగిస్తుంటారు. కొన్ని సందర్భాలలో డ్యామిట్ కథ అడ్డం తిరిగింది అనుకోవాల్సి వస్తుంది. సరిగ్గా కాకినాడలో అలాంటి ఘటనే జరిగింది. సముద్ర మార్గంలో షిప్ ద్వారా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాను కాకినాడ జిల్లా కలెక్టర్ అడ్డుకున్నారు. పోలీసులతో కలిసి పడవలో వెళ్లి మరీ అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేశారు.
సింగం సినిమా సీన్ తలపించేలా కలెక్టర్ చర్యలు
సింగం సినిమాలో హీరో సూర్య సముద్రంలోకి వెళ్లి ఛేజ్ చేసి నిందితులను పట్టుకుంటారు. అవసరమైతే విదేశాలకు వెళ్లి సైతం నిందితుడి ఆటకట్టించడం సినిమా చూసిన వారికి గుర్తుంటుంది. రియల్ లైఫ్ లో కాకినాడ తీరంలో సముద్రంలో అలాంటి ఛేజ్ సీన్ జరిగింది. సముద్ర మార్గంలో కాకినాడ నుంచి ఓ షిప్ ద్వారా బియ్యం ఎగుమతి అవుతున్నట్లు కలెక్టర్ షాన్ మోహన్ సగిలికి సమాచారం అందింది. కొందరు అధికారులతో అకస్మాత్తుగా సముద్ర తీరానికి వెళ్లారు. ఓ పడవలో సముద్రంలోకి వెళ్లి మరీ పీడీఎస్ బియ్యం లోడింగ్ చేసి అక్రమంగా ఎగుమతి చేస్తున్న సమయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. పీడీఎస్ బియ్యం సీజ్ చేసి కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న నిందితులను అరెస్ట్ చేయించారు.
సముద్రం నుంచి బయటకు వచ్చాక కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ.. యాంకరేజ్ పోర్ట్ నుంచి స్టెల్లా ఎల్ అనే షిప్ నుంచి అక్రమ రవాణా జరుగుతోంది. పీడీఎస్ బియ్యం రవాణా సమాచారం అందడంతో టీమ్ తో కలిసి అక్కడికి వెళ్లి ఆకస్మిక తనిఖీలు చేసి సీజ్ చేశామని చెప్పారు. మొత్తం హ్యాచ్ లు ఉండగా, టెక్నికల్ టీమ్ తో వెళ్లి సీజ్ చేసి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 52 వేల టన్నుల బియ్యానికిగానూ 38 వేల టన్నులు లోడ్ చేశారు. వీటిలో 640 టన్నులు పీడీఎస్ బియ్యం గుర్తించినట్లు చెప్పారు. బాయిల్డ్ రైస్ కూడా ఉందని, దర్యా్ప్తులో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు.
ఇటీవల కంటతడి పెట్టి కదిలించిన కలెక్టర్
కాకినాడలో అంతర్జాతీయ బాలల హక్కుల దినోత్సవ సభలో కాకినాడ కలెక్టర్ షాన్‌మోహన్ కంటతడి పెట్టడం అందర్నీ కదిలించింది. చీఫ్ గెస్ట్ గా హాజరైన కలెక్టర్ షాన్‌మోహన్ మాట్లాడుతూ టీచర్లు అయిన తన తల్లిదండ్రులు ఎంతో నిబద్ధతతో వృత్తిధర్మాన్ని పాటించడంతో తాము ఈ స్థాయిలో ఉన్నామని చెప్పారు. ఒకవేళ వారు సక్రమంగా విధులు నిర్వహించకపోయి ఉంటే, తాము ఈ స్థాయికి వచ్చేవాళ్లం కాదని చెబుతున్న సందర్భంలో కలెక్టర్ కంటతడి పెట్టారు. కానీ కొంతమంది అవకాశం వచ్చిన తరువాత తమ బాధ్యతను విస్మరిస్తున్నారంటూ కలెక్టర్ భావోద్వేగానికి గురయ్యారు. టీచర్లు తన వృత్తి ధర్మాన్ని పాటించకపోతే వారు పిల్లల జీవితాలను నాశనం చేసిన వాళ్లు అవుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సభల్లో తాను ఎక్కువగా మాట్లాడనని, ఎందుకంటే నిక్కచ్చిగా తాను నిజాలు చెబుతానన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తాను ఇలా మాట్లాడాల్సి వచ్చినట్లు కాకినాడ కలెక్టర్ తెలిపారు.