Cyclone Fengal Effect: దూసుకొస్తున్న ఫెంగల్ తుపాను, ఏపీలో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు - ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ
Andhra Pradesh Rains | వాయుగుండం తీవ్రరూపం దాల్చి ఫెంగల్ తుపానుగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి.
Weather Update: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండము మరికొన్ని గంటల్లో తుపానుగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర అక్షాంశం 8.5°, తూర్పు రేఖాంశం 82.3°వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది శ్రీలంకలోని ట్రింకోమలీకి తూర్పు ఆగ్నేయంగా 120 కి.మీ దూరంలో, నాగపట్టణానికి ఆగ్నేయంగా 370 కి.మీ దూరంలో., చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 550 కిలోమీటర్ల దూరంలో, పుదుచ్చేరికి ఆగ్నేయంగా 470 కి.మీ దూరంలో ఉందని అధికారులు తెలిపారు.
వాయుగుండం ఇది ఉత్తర వాయవ్య దిశగా కదిలే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. రాగల కొన్ని గంటల్లో మరింత బలపడి ఫెంగల్ తుఫానుగా మారనుంది. మరో 2 రోజులలో ఈ తుఫాను శ్రీలంక తీరంవైపు కదులుతూ, ఉత్తర వాయవ్య దిశగా తమిళనాడు తీరం చేరుకుంటుంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్‌లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నవంబర్ 28 నుంచి 30 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని, బలమైన ఈదురుగాలులు సైతం వీస్తాయని తెలిపారు.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురవనున్నాయని ఎల్లో వార్నింగ్ జారీ చేశారు. ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గురువారం నాడు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. ఉరుములతో కూడిన జల్లులు ఒకట్రెండు చోట్ల పడే అవకాశముంది. శుక్రవారం తేలికపాటి వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్
నేటి నుంచి మూడు రోజులపాటు గంటకు 44 నుంచి 55 కి మీ వేగంతో గాలులు వీచనున్నాయి. గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంలో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. కాకినాడ, తూర్పు గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. తేలికపాటి జల్లులు లేదా ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గురువారం, శుక్రవారాల్లోనూ ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. గరిష్టంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. రైతులు పంట దిగుబడి, కుప్పలను వర్షాలకు తడవకుండా జాగ్రత్త చేసుకోవాలని సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లడం ప్రమాదకరమని, రెండు రోజులు వేటకు వెళ్లకపోవడం మంచిదని మత్స్యాకారులకు సూచించారు.
District forecast of Andhra Pradesh dated 27-11-2024 #IMD #APWeather #APforecast #MCAmaravati pic.twitter.com/oIyvufiK7A
— MC Amaravati (@AmaravatiMc) November 27, 2024
రాయలసీమ
ఫెంగల్ తుపాను రాయలసీమ జిల్లాలపై అధికంగా ప్రభావం చూపనుంది. రాయలసీమ జిల్లాల్లో రెండు, మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. గంటకు-44 -55 కి మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. గురువారం, శుక్రవారాల్లో గంటకు 55 - 65 కిలోమీటర్ల వేగం, గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మూడు రోజులపాటు కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకట్రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ సైతం జారీ చేసింది.
తెలంగాణపై ఫెంగల్ ప్రభావం
తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. నవంబర్ 30 నుంచి రెండు మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల కిందకు వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ ప్రజలు చలికి పటాన్‌చెరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్ లో 10.8 డిగ్రీలు, రాజేంద్రనగర్ లో 13 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.