APSRTC Income: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసికి పండగే పండగ! ఒక్కరోజులో 27.68 కోట్ల ఆదాయం! రికార్డ్ సృష్టించిన APSRTC
APSRTC Income: సంక్రాంతి పండగ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రఆర్టీసీకి బాగా కలిసి వచ్చింది. ఒక్కరోజులోనే 27.68 కోట్ల ఆదాయంతో కొత్త రికార్డ్ సృష్టించింది.

APSRTC Income: APSRTC కొత్త రికార్డ్ సృష్టించింది. ఒక్క రోజులోనే 27.68 కోట్ల రూపాయల ఆదాయం సంపాదించింది. ఇది APSRTC చరిత్రలోనే ఇంతకుముందు ఎన్నడూ జరగని ఘటనగా అధికారులు చెబుతున్నారు. జనవరి 19 అంటే సోమవారం రోజున ఈ రికార్డ్ నమోదైంది. ఆ రోజున 50 లక్షల మంది ప్రయాణికులు RTC బస్సుల్లో ప్రయాణించారు.
సంక్రాంతి పండుగ తర్వాత భారీ ఎత్తున తిరిగి వెళ్లిన ప్రయాణికులు
సంక్రాంతి పండుగకు పెట్టింది పేరైన ఆంధ్రప్రదేశ్‌కు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు. ఏపీకి చెందిన ప్రజలతోపాటు తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన సంక్రాంతి చూడడం కోసం టూరిస్ట్‌లతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు జనంతో కలకలలాడాయి. వాళ్ళలో చాలామంది సొంత వాహనాల్లో రాగా RTC బస్సులను నమ్ముకుని ప్రయాణం చేసిన వారి సంఖ్య కూడా ఎక్కువే. వారిని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున బస్సులు నడిపింది RTC. రెగ్యులర్ సర్వీస్ లతో పాటు స్పెషల్ బస్సులను కూడా ప్రవేశ పెట్టడంతో ప్రజలు ఈ బస్సు సర్వీస్ లను ఉపయోగించుకున్నారు. దానివల్ల RTC కి మంచి ఆదాయం వచ్చింది.
స్పెషల్ బస్సులను కూడా రెగ్యులర్ చార్జీలతోనే నడిపాం: RTC ఎండీ ద్వారకా తిరుమల రావు
పండుగ రద్దీ దృష్టిలో పెట్టుకుని ఏపీలో ప్రత్యేక బస్సులను నడిపినా వాటి ఛార్జీలను మాత్రం పెంచలేదనీ రెగ్యులర్ బస్సు టికెట్ రెట్లకే వాటినీ నడిపామని అన్నారు APSRTC ఎండీ ద్వారకా తిరుమల రావు. అందుకే పండుగ నుంచి తిరిగి వెళ్లే సమయంలో కూడా ప్రజల్లో చాలామంది RTC బస్సుల్లోనే ప్రయాణించారనీ దీనివల్ల ప్రయాణికులపై అదనపు ఖర్చు భారం పడకపోవడమే కాకుండా ఎక్కువమంది తమ బస్సులో వెళ్లడం వల్ల ఒక్క రోజునే (జనవరి 19) ఏకంగా 27.68 కోట్ల ఆదాయం లభించినట్టు ఆయన అన్నారు. ఈ రికార్డ్ స్థాపించడానికి తమ డ్రైవర్ల సామర్థ్యం సిబ్బంది నిబద్ధత కారణం అంటూనే తమపై నమ్మకం ఉంచి సహకారం అందించిన ప్రయాణికులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ద్వారకా తిరుమల రావు. సోమవారం ఒక్క రోజు మాత్రమే కాకుండా మొత్తం సంక్రాంతి పండుగ రోజుల్లో APSRTC ఆదాయం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది





















