గ్రీన్‌లాండ్ వ్యూహాత్మక సైనిక స్థావరం, ఖనిజ సంపద, కొత్త షిప్పింగ్ మార్గాలు, చైనా-రష్యాతో పోటీ వంటి అంశాల కారణంగా ట్రంప్ దాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
Donald Trump Greenland: ట్రంప్ గ్రీన్ లాండ్ కోసం ఎందుకు పట్టుబుతున్నాడు.. ? మంచుగడ్డ కింద మహా రహస్యం..!
Donald Trump Power game: డోనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్ కావాలని పట్టబట్టడం కేవలం పొలిటికల్ హెడ్‌లైన్ గేమ్ కాదు. పైకి రియల్ ఎస్టేట్ డీల్‌లా కనిపిస్తోంది కానీ ఆ మంచుగడ్డ కింద మహా రహస్యమే దాగుంది.

Trump's Greenland Powergame: ప్రపంచ పటంలో గ్రీన్‌లాండ్ చూస్తే. అది మంచుతో నిండిన ఒక పెద్ద దీవిలా అనిపిస్తుంది. జనాభా తక్కువ, ఆర్థిక కార్యకలాపాలు అంతగా లేవు. రాజకీయంగానూ ఎవరినో ఇబ్బంది పట్టే పరిస్థితులు అక్కడ లేవు. వాస్తవానికి అంత చిన్న దీవిని ఎవరూ అంతగా పట్టించుకోవలసిన అవసరం లేదు. కానీ మంచు కింద దాగిన దాని విలువను గ్లోబల్ శక్తులు చాలా స్పష్టంగా గుర్తించాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్..! అసలు ఒక మంచు దీవి కోసం ఇంత పట్టుదల ఎందుకు అనిపిస్తుంది కానీ దాని స్ట్రాటజిక్‌గా దాని విలువను చూస్తే దిమ్మ తిరుగుతుంది.
గ్రీన్‌లాండ్‌పై కన్నేసిన ట్రంప్..
డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను కావాలని మళ్లీ గట్టిగా ప్రయత్నించడం కేవలం రాజకీయ హెడ్లైన్ గేమ్ కాదు. హై సెక్యూరిటీ, ఎకనామిక్ గ్రోత్, భవిష్యత్ విజన్, తన పేరు చరిత్రలో నిలిచిపోవాలనే తపన ఇలా చాలా అంశాలు ఆయన అజెండాను నడిపిస్తున్నాయి. బయటకు చూస్తే ఇది ఒక “రియల్ ఎస్టేట్ డీల్”లా కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం మిలిటరీ రీచ్, రేర్ ఎర్త్ ఖనిజాలు, కొత్త షిప్పింగ్ రూట్లు, చైనా – రష్యాలతో పోటీ వంటి సీరియస్ వ్యూహాత్మక లెక్కలే పనిచేస్తున్నాయి. అందుకే మొదట్లో "గ్రీన్‌లాండ్ కొంటాం" అని చెప్పిన ట్రంప్..ఇప్పుడు "తీసేసుకుంటాం" అని పబ్లిక్‌గానే చెబుతున్నాడు. అంతే కాదు నిన్న ఓ అడుగు ముందుకేసి గ్రీన్‌లాండ్‌ను అమెరికా మ్యాప్‌లో చూపించేశాడు కూడా..!
ట్రంప్ తొలిసారి 2019లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేయాలన్న ఆలోచనను బయటపెట్టాడు. అప్పట్లో దీన్ని చాలా దేశాలు ఒక విచిత్రమైన ప్రకటనగా చూశాయి. డెన్మార్క్, గ్రీన్‌లాండ్ నేతలు తక్షణమే “గ్రీన్‌లాండ్ అమ్మకానికి కాదు” అని స్పష్టం చేశారు. అయితే తాజాగా ట్రంప్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ అంశాన్ని మరింత బలంగా తీసుకొస్తున్నారు. ఈసారి ఆయన మాటల్లో ఇది ఒక డీల్ కాదు, “అమెరికా జాతీయ భద్రతకు అత్యవసరం” అనే స్థాయికి తీసుకెళ్లారు. 'ఇస్తే ఓకే.. లేకపోతే మేమే తీసుకుంటాం 'అని చెబుతూ మిలటరీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందన్న సంకేతాలు వాషింగ్టన్ ఇస్తోంది.

అసలు ఆ దీవి ఎందుకు..? ఇప్పుడే ఎందుకు?
వ్యూహాత్మక మిలటరీ బేస్
భౌగోళికంగా గ్రీన్‌లాండ్ అమెరికా, యూరప్, ఆర్కటిక్ సముద్రాల మధ్య కీలక గేట్‌వే. అట్లాంటిక్ నుంచి ఆర్కటిక్‌లోకి వెళ్లే మార్గంలో ఉండే GIUK Gap (Greenland–Iceland–UK) ప్రపంచ మిలిటరీ మ్యాప్‌లో కీలక చోక్ పాయింట్. గ్రీన్‌లాండ్ మీద పట్టు సాధిస్తే రష్యా సబ్‌మేరిన్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఆర్కటిక్ నుంచి ఉత్తర అట్లాంటిక్ వైపు జరిపే ప్రతీ కదలికను గుర్తించే వీలుంటుంది. గ్రీన్‌లాండ్ తన చేతికి వస్తే.. అమెరికాకు ఉత్తర అట్లాంటిక్‌లో రాడార్, మిసైల్ డిఫెన్స్, సర్వైలెన్స్ కవరేజ్ మరింత లోతుగా విస్తరించే అవకాశం ఉంటుంది. మిలటరీ బేస్‌లు, యుద్ధనౌకల నిలయమైన ఆర్కిటిక్‌పై కూడా పట్టు చిక్కుతుంది.
ఇప్పటికే రెండో ప్రపంచ యుద్ధం నుంచే గ్రీన్‌లాండ్‌లో అమెరికా మిలిటరీ ఉనికి ఉంది. అక్కడ ఉన్న థూల్ (Thule)ఎయిర్ బేస్ (ఇప్పుడు Pituffik Space Base- పిటుఫిక్ స్పేస్ బేస్) అమెరికా స్పేస్ ఫోర్స్‌లో కీలక కేంద్రం. రష్యా వైపు నుంచి వచ్చే మిసైల్‌లను ముందుగా గుర్తించే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, స్పేస్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అంతా అక్కడే ఉంది. గ్రీన్‌లాండ్ చేతికి వస్తే.. డెన్మార్క్ ఎలాగూ మిత్రదేశమే కాబట్టి పొలిటికల్ పరిమితులు లేకుండా ఈ బేస్‌ను మరింత విస్తరించవచ్చన్నది ట్రంప్ ఆలోచన..!
చైనా- రష్యాల ఉనికి- అమెరికా ఆందోళన
అమెరికా అసలు ఆందోళన చైనా.. ! రష్యా ఎప్పటి నుంచో ఆర్కిటిక్‌లో బేస్‌లు కట్టుకుంది. అది కొత్త విషయం కాదు. కానీ ఇప్పుడు చైనా.. తనను తాను “నియర్ ఆర్కటిక్ స్టేట్”గా ప్రకటించుకొని గ్రీన్‌లాండ్‌లో మైనింగ్, ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో అడుగుపెట్టేందుకు ప్రయత్నించింది. ముఖ్యంగా రేర్ ఎర్త్ ఖనిజాలపై చైనా కన్నేసింది. మరోవైపు రష్యా తన ఆర్కటిక్ మిలిటరీ బేస్‌లను మళ్లీ యాక్టివ్ చేస్తూ ఐస్‌బ్రేకర్లు, ఎయిర్ డిఫెన్స్, సబ్‌మేరిన్ ఫ్లీట్‌ను విస్తరిస్తోంది. ఈ పరిణామాల మధ్య అమెరికా వ్యూహం స్పష్టం .. గ్రీన్‌లాండ్‌లో చైనా ప్రభావం ఉండకూడదు.. రష్యా ఆధిపత్యం పెరగకూడదు. అందుకే ట్రంప్ కూడా బహిరంగంగానే “గ్రీన్‌లాండ్ చుట్టూ రష్యా, చైనా షిప్స్ తిరుగుతున్నాయి… ఇది అమెరికా నేషనల్ సెక్యూరిటీకి కీలకం” అని గగ్గోలు పెడుతున్నాడు. ట్రంప్ భయమల్లా ఒకటే.. అమెరికా ముందుగా గ్రీన్‌లాండ్‌పై పట్టు సాధించకపోతే, ప్రత్యర్థులు ఆర్కటిక్‌లో ఆధిపత్యం సంపాదిస్తారు.

గ్రీన్‌లాండ్ బంగారు గని..
ఆర్థిక కోణంలో గ్రీన్‌లాండ్ అసలు బంగారు గని. మంచు కింద భారీగా రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, యురేనియం, ఇనుము, ఇతర కీలక ఖనిజాల నిల్వలు ఉన్నట్లు అంచనా. స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ కార్లు, విండ్ టర్బైన్లు, మిలిటరీ ఎలక్ట్రానిక్స్ ఇలా ఈ ఆధునిక ప్రపంచం మొత్తం రేర్ ఎర్త్‌లపై ఆధారపడింది. ఈ సప్లై చైన్‌లో ప్రస్తుతం చైనా ఆధిపత్యం ఉంది. గ్రీన్‌లాండ్‌లోని ఖనిజాలు అభివృద్ధి చెందితే, చైనా ఆధిపత్యానికి చెక్ పెట్టే శక్తి అమెరికాకు వస్తుంది. అందుకే ట్రంప్ తన ఎకనామిక్ సెక్యూరిటీ నేరేటివ్‌లో గ్రీన్‌లాండ్‌ను కీలకంగా చూపిస్తున్నాడు.
ఇది అసలైన గేమ్ చేంజర్:
ఇక్కడ మరో ఆసక్తికర అంశం — వాతావరణ మార్పు. ఆర్కటిక్ మంచు కరుగుతున్న కొద్దీ కొత్త సముద్ర మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఆసియా – యూరప్ – నార్త్ అమెరికా మధ్య రవాణా సమయం తగ్గే కొత్త షిప్పింగ్ లేన్లు భవిష్యత్తులో యాక్టివ్ కానున్నాయి. ఈ ట్రేడ్ రూట్స్ గ్రీన్‌లాండ్ చుట్టూ వెళ్తాయి. ఎవరి ఆధిపత్యం ఆ మార్గాలపై ఉంటే, రేపటి గ్లోబల్ ట్రేడ్‌ను వాళ్లే రూల్ చేస్తారు. ఈ భవిష్యత్ గేమ్‌ను ముందుగానే ఊహిస్తున్న ట్రంప్ — గ్రీన్‌లాండ్‌ను అమెరికా ప్రభావంలో ఉంచాలని భావిస్తున్నాడు. ఈ మొత్తం పవర్ గేమ్ మధ్యలో గ్రీన్‌లాండ్ ప్రజలు ఉన్నారు. కేవలం 56 వేలమంది మాత్రమే ఉన్న ఈ దీవిలో ప్రధానంగా ఇన్యుట్ కమ్యూనిటీలు నివసిస్తాయి. వారి జీవనం ప్రకృతి, పర్యావరణంతో ముడిపడి ఉంటుంది. మైనింగ్, మిలిటరీ విస్తరణ, విదేశీ శక్తుల ప్రవేశం..ఇవి వారి సంస్కృతి, పర్యావరణంపై ప్రభావం చూపిస్తాయి.
ట్రంప్ లెగసీ
ఇందులో ట్రంప్ వ్యక్తిగత శైలి కూడా పాత్ర పోషిస్తోంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఆయనకు, ప్రపంచంలోనే అతిపెద్ద దీవిని అమెరికా మ్యాప్‌లో చేర్చడం ఒక హిస్టారిక్ 'మెగా డీల్' గా కనిపిస్తోంది. ఇది అతని “అమెరికా ఫస్ట్” బ్రాండ్‌కు పర్ఫెక్ట్ సింబల్. విమర్శకులు దీన్ని అతి ఆలోచనగా కొట్టిపారేస్తున్నా, ట్రంప్‌కు మాత్రం ఇది తన పేరు చరిత్రలో నిలిపే లెగసీ ప్రాజెక్ట్‌గా మారుతోంది.
మొత్తానికి ట్రంప్ గ్రీన్‌లాండ్‌పై చూపిస్తున్న అసాధారణ ఆసక్తి వెనుక ఒకే మాటలో చెప్పాలంటే — 21వ శతాబ్దపు ఆర్కటిక్ పవర్ గేమ్. మిలిటరీ ఆధిక్యం, టెక్నాలజీ వనరులు, భవిష్యత్ ట్రేడ్ రూట్స్, చైనా–రష్యా ను నిలువరించడం...అన్నీ ఈ ఒక్క దీవిలో కేంద్రీకృతమయ్యాయి.
Frequently Asked Questions
గ్రీన్‌లాండ్‌ను అమెరికా సొంతం చేసుకోవాలని ట్రంప్ ఎందుకు ప్రయత్నిస్తున్నారు?
గ్రీన్‌లాండ్‌ను పొందడం వల్ల అమెరికాకు ఎలాంటి సైనిక ప్రయోజనాలు కలుగుతాయి?
గ్రీన్‌లాండ్‌పై పట్టు సాధిస్తే రష్యా కదలికలను గుర్తించడం, ఉత్తర అట్లాంటిక్‌లో నిఘా సామర్థ్యాన్ని పెంచుకోవడం, ఆర్కిటిక్‌పై పట్టు సాధించడం వంటి ప్రయోజనాలు లభిస్తాయి.
గ్రీన్‌లాండ్‌లో అమెరికాకు ఇప్పటికే ఏమైనా సైనిక స్థావరాలు ఉన్నాయా?
అవును, రెండవ ప్రపంచ యుద్ధం నుంచే గ్రీన్‌లాండ్‌లో అమెరికా సైనిక ఉనికి ఉంది. థూల్ ఎయిర్ బేస్ (ఇప్పుడు Pituffik Space Base) అమెరికాకు కీలక కేంద్రం.
గ్రీన్‌లాండ్‌లోని ఖనిజ సంపద అమెరికాకు ఎలా ఉపయోగపడుతుంది?
గ్రీన్‌లాండ్‌లో రేర్ ఎర్త్ ఖనిజాలు, యురేనియం వంటివి భారీగా ఉన్నాయి. వీటిని అభివృద్ధి చేయడం ద్వారా చైనా ఖనిజ సరఫరాపై ఆధిపత్యానికి అమెరికా అడ్డుకట్ట వేయగలదు.
వాతావరణ మార్పు గ్రీన్‌లాండ్ ప్రాముఖ్యతను ఎలా పెంచుతుంది?
ఆర్కిటిక్ మంచు కరగడం వల్ల కొత్త సముద్ర మార్గాలు తెరుచుకుంటున్నాయి. ఈ కొత్త వాణిజ్య మార్గాలు గ్రీన్‌లాండ్ చుట్టూ వెళ్తాయి, భవిష్యత్ గ్లోబల్ ట్రేడ్‌ను ప్రభావితం చేస్తాయి.





















