ASHA Workers Good News: ఏపీలో ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త, త్వరలోనే ఉత్తర్వులు జారీ
ASHA workers in Andhra Pradesh | ఏపీలోని ఆశా వర్కర్లకు సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. వారి గరిష్ట వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచడంతో పాటు గ్రాట్యుటీకి నిర్ణయం తీసుకున్నారు.

Upper age limit for ASHA workers in Andhra Pradesh | అమరావతి: ఏపీ బడ్జెట్‌లో అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీపై శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో తీపి కబురు అందించింది. ఆశా కార్యకర్తల గరిష్ట వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు మొదటి రెండు ప్రసవాలకు ఇక నుంచి 180 రోజులు (6 నెలలు) వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. గ్రాట్యుటీ చెల్లించి, వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంతో ఉత్వర్వులు జారీ కానున్నాయి.
ఏపీ వ్యాప్తంగా దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిలో పట్టణాల్లో 5,735 మంది, గ్రామాల్లో 37,017 మంది ఆశా కార్యకర్తలు ఉన్నారు. ఆశా కార్యకర్తలు నెలకు రూ.10వేల వేతనం అందుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు సర్వీస్ ముగింపులో వారికి గ్రాట్యుటీ కింద రూ.1.5 లక్షల వరకు అందే అవకాశం ఉందని తెలుస్తోంది.
అత్యధిక జీతం ఇస్తున్న ఏకైక రాష్ట్రం
2019కి ముందు కూడా ఆశా వర్కర్‌లను చంద్రబాబు ప్రభుత్వం ఆదుకుంది. 2018లో పని కోసం వారికి అవసరమైన స్మార్ట్ ఫోన్లు అందించడం, ఏఎన్‌మ్ (ANM)ల నియామకంలో అర్హత ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చారు. వారికి రేషన్ కార్డుల జారీతో పాటు ఎన్టీఆర్ వైద్యసేవ, ఉద్యోగ విరమణ వయసు పరిమితిని 60 ఏళ్లకు పెంచుతూ ప్రయోజనాలు కల్పించారు. వారికి వృద్ధాప్య పెన్షన్‌కు కూడా అర్హత కల్పించారు. ఈ సేవలు అందిస్తున్న వారికి తెలంగాణలో రూ.7,500, సిక్కింలో రూ.6,000, కేరళలో రూ.5,000, హర్యానా, కర్ణాటకలో రూ.4,000, ఢిల్లీలో రూ.3,000, రాజస్థాన్‌లోరూ.2,700, హిమాచల్‌ప్రదేశ్‌లో రూ.2,000, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్‌లో రూ.750, చొప్పున నెలవారీ వేతనం అందిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ఆశాలకు నెలకు రూ.10,000 చొప్పున జీతం చెల్లిస్తోంది. దేశంలో అత్యధికంగా వేతనాలు ఇస్తున్నది ఏపీ ప్రభుత్వం అని అన్నారు.
అంగన్వాడీలకు గ్రాట్యుటీ.. బడ్జెట్‌లో పయ్యావుల ప్రకటన
అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ ఇస్తామని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. వృద్ధుల సంరక్షణ కోసం 12 ఆశ్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళలు, వృద్ధుల సంక్షేమానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని బడ్జెట్‌లో మంత్రి పయ్యావుల ప్రకటించారు.
వంటగదికే పరిమితమైన మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా సాధికారత సాధిస్తున్నారు. ఏపీలో పనిచేస్తున్న 10 లక్షలకుపైగా స్వయం సహాయక సంఘాలు రాష్ట్ర ఆర్థిక కార్యకలాపాలలో కీలకపాత్ర పోషిస్తున్నాని మంత్రి ప్రశంసించారు. రాష్ట్ర రాజకీయాలను, సంక్షేమ విధానాలను ప్రభావితం చేసే శక్తిగా డ్వాక్రా వ్యవస్థ రూపొందింది అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం స్త్రీ నిధికి కేటాయించిన నిధుల్లో రూ. 750 కోట్లు పక్కదారి పట్టించిందని ఆరోపించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల ఆర్థిక సాధికారతకు వైసీపీ హయాంలో విఘాతం కలిగిందని విమర్శించారు.
నమగ్ర శిశు అభివృద్ధి పథకం (ICDS), మిషన్-శక్తి వంటి పథకాలతో మహిళలు, పిల్లలు, కౌమారదశలో తగిన పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆర్థిక సంవత్సరం 2025-26కి గానూ మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి రూ. 4,332 కోట్లు కేటాయించామన్నారు మంత్రి పయ్యావుల. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీలకు గ్రాట్యుటీ మంజూరు చేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

