Anganwadi notification: మహిళలకు ప్రభుత్వం గుడ్ న్యూస్, 14 వేల ఖాళీల భర్తీకి 'ఉమెన్స్ డే' రోజు నోటిఫికేషన్
Jobs: తెలంగాణలో 14 వేల అంగన్ వాడీ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ వెల్లడించనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఈ కానుకను ప్రభుత్వం ప్రకటించింది.

Anganwadi Notification Soon: తెలంగాణలోని మహిళలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు(Womens Day) నేపథ్యంలో 14 వేల అంగన్ వాడీ టీచర్లు, హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్త్రీశిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో లక్ష మందితో సభ నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అదేరోజు ఖాళీల భర్తీకి సంబంధించి నియామక ప్రకటనను విడుదల చేస్తామని స్పష్టంచేశారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణపై శనివారం (మార్చి 1) ఆమె సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆ రోజు పరేడ్ మైదానంలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా వెల్లడించారు. దేశంలోనే అత్యుత్తమ మహిళా సాధికారత విధానాన్ని రూపొందిస్తామని, పలు రాష్ట్రాల్లో చేపట్టిన మహిళా సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్ కుమార్‌తోపాటు రాష్ట్ర మహిళా కమిషన్, మహిళా సహకార అభివృద్ధి సంస్థ, తెలంగాణ సాంస్కృతిక సారథి, సంగీత నాటక అకాడమీల ఛైర్‌పర్సన్లు, స్త్రీశిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, సంచాలకురాలు సృజన, సెర్ప్ సీఈఓ దివ్య, స్పెషల్ కమిషనర్ షఫీయుల్లాలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇఫ్పటికే రాష్ట్రంలో 4 వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చిన సంగతి తెలిసిందే.
మహిళా దినోత్సవాన నిర్వహించే కార్యక్రమాలు..
➥ మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు.. ప్రమాద బీమా చెక్కుల పంపిణీ.
➥ మహిళా ప్రాంగణాల్లో డ్రైవింగ్ శిక్షణ పొందిన మహిళలకు సబ్సిడీ ఆటోల పంపిణీ.
➥ 31 జిల్లాల్లో మహిళా సంఘాలతో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్ కంపెనీలతో ఒప్పందాలు.
➥ మహిళా సంఘాల ఆధ్వర్యంలో మొదటివిడతలో కొనుగోలు చేసిన 50 ఆర్టీసీ అద్దె బస్సుల ప్రారంభం.
➥ పేదరిక నిర్మూలన కోసం పురపాలికలు, గ్రామీణ ప్రాంతాల్లో వేర్వేరుగా పనిచేస్తున్న మెప్మా, సెర్ప్‌ల విలీన నిర్ణయ ప్రకటన.
➥ 32 జిల్లాల్లో..64 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్లకు వర్చువల్‌గా శంకుస్థాపన.





















