Viveka case Supreme Court: వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు - నిందితులందరికీ మళ్లీ జైలు తప్పదా?
Supreme Court : వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది . సీబీఐ అధికారితో పాటు వివేకా కుమార్తె, అల్లుడిపై పెట్టిన కేసులను క్వాష్ చేసింది.

YS Viveka murder case in Supreme Court: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుల బెయిళ్లు రద్దు చేయాలని వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారణ చేశారు. విచారణలో సీబీఐ అధికారి రాంసింగ్ తో పాటు వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై అప్పట్లో పులివెందుల పోలీసులు పెట్టిన కేసును క్వాష్ చేసింది. దర్యాప్తును ప్రభావితం చేసేందుకు అధికార దుర్వినియోగం చేసి కేసు పెట్టినట్లుగా ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది.
జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్ , జస్టిస్ ఎన్.కె. సింగ్‌ల ధర్మాసనం ఈ కేసు విచారణను నిర్వహించింది. వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, అప్పటి సీబీఐ విచారణాధికారి రామ్ సింగ్‌పై నమోదైన కేసులను సుప్రీంకోర్టు క్వాష్ చేసింది. ఈ కేసులు కుట్రపూరితంగా నమోదు చేశారని కోర్టు గుర్తించింది. జస్టిస్ సుందరేశ్ ఈ కేసులు చట్టాన్ని దుర్వినియోగం చేసి, వేధించడానికి పెట్టారని ఇది ఒక రకమైన బెదిరింపుగా ఉందని అభిప్రాయపడ్డారు.
సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ప్రధాన నిందితులైన అవినాష్ రెడ్డి, ఇతరుల బెయిల్‌ను రద్దు చేయాలని కోరారు. సీబీఐ కేవలం సుప్రీంకోర్టు గడువు కారణంగానే దర్యాప్తు ముగిసినట్లు పేర్కొందని, కానీ ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరమని లూథ్రా వాదించారు. అసలు సూత్రధారులు , హత్యలో పాత్రధారులు ఎవరనేది ఇంకా బయటపడాల్సి ఉందని, సాక్షులను బెదిరించడం, యు సాక్ష్యాధారాలను నాశనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన కోర్టుకు తెలిపారు.
అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు సీబీఐ తరపున వాదనలు వినిపించారు. హత్య క్క తీవ్రతను బట్టి చూస్తే, నిందితులు కేవలం 2 లేదా 5 సంవత్సరాలు జైలులో ఉండటం తగిన శిక్ష కాదని అన్నారు. తొలుత గుండెపోటుగా, ఆ తర్వాత రక్త వాంతులుగా చిత్రీకరించడానికి ప్రయత్నాలు జరిగాయని, సాక్ష్యాధారాలను చెరిపేసేందుకు , హత్య విషయం బయటపడకుండా చేయడానికి అన్ని విధాలుగా కుట్రలు జరిగాయని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో సాక్ష్యాలు చెరిపేయడం , సాక్ష్యాధారాలు లేకుండా చేయడం నిరూపితమైందని, దర్యాప్తులో అన్ని వివరాలు బయటపడ్డాయని ఎస్వీ రాజు కోర్టుకు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మదీ వాదనలు వినిపించారు. నిందితుడు డి. శివశంకర్ రెడ్డి కుమారుడు దేవిరెడ్డి చైతన్య రెడ్డి, మెడికల్ క్యాంప్ పేరుతో కడప జైలుకు వెళ్లి, కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిని బెదిరించినట్లు సాక్ష్యాలు ఉన్నాయని తెలిపారు. ఈ బెదిరింపులకు సంబంధించిన ఫోటోలతో సహా ఆధారాలు ఉన్నాయని కోర్టుకు వివరించారు.
సీబీఐ తరపు న్యాయవాది ఈ కేసులో హత్య యొక్క తీవ్రతను బట్టి, నిందితులకు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందని సుప్రీంకోర్టుకు తెలిపారు. సీబీఐ ఆగస్టు 5, 2025న సుప్రీంకోర్టుకు తెలియజేసిన విధంగా, ఈ కేసులో దర్యాప్తు పూర్తయినట్లు పేర్కొంది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ కొనసాగిస్తామని సీబీఐ తెలిపింది. సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, దర్యాప్తు ఇంకా లోతుగా జరగాలని, అసలు సూత్రధారులను గుర్తించాల్సిన అవసరం ఉందని వాదించారు. తుదపరి దర్యాప్తు అవసరమా, నిందితుల కస్టోడియల్ విచారణ అవసరమా , ఎంత మంది బెయిళ్లురద్దు చేయాలన్న అంశాలపై వివరాలు దాఖలు చేయాలని ఆదేశించిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ వచ్చే నెల9వ తేదీకి వాయిదా వేసింది.





















