Indi Alliance Candidate B Sudershan Reddy | ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి | ABP Desam
ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ఎన్నిక దాదాపు ఏకగ్రీవం అనుకుంటున్న వేళ ప్రతిపక్ష ఇండీ కూటమి షాక్ ఇచ్చింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలుగు వ్యక్తి అయిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నికకు నిలబెడుతున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఈమేరకు ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఉమ్మడి ప్రకటన చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం తాలుకూ ఆకులమైలారం కు చెందిన జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో లా చదువుకున్నారు. 1990 వరకూ ఏపీ హైకోర్టులో న్యాయవాదిగా పని చేసిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి..1995లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై..2005లో గౌహతి హైకోర్టుగా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2007లో సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. గోవాకు తొలి లోకాయుక్తగా పనిచేసిన బీ సుదర్శన్ రెడ్డి 2011లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీవిరమణ చేశారు. ఎన్డీయే కూటమితో సైద్ధాంతిక యుద్ధంగా ఉపరాష్ట్రపతి ఎన్నికను భావిస్తున్నందునే జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి నిలబెడుతున్నట్లు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.





















