Future city Master Plan: 765 చ.కి.మీ విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ, మాస్టర్ ప్లాన్‌పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష, ప్రత్యేకతలు ఇవే
Telangana CM Revanth Reddy | ఫ్యూచర్ సిటీ కోసం భవిష్యత్ నగర అభివృద్ధి సంస్థను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ రెడీ అయింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు.

Future city Master plan | హైదరాబాద్: భారతదేశానికే నమూనాగా, అంతర్జాతీయ నగరాలతో పోటీ పడే స్థాయిలో "ఫ్యూచర్ సిటీ"ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ నగరం హైదరాబాద్ దక్షిణ భాగంలో 765 చ.కీ.మీ. విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా భవిష్య నగర అభివృద్ధి సంస్థ (FCDA)ను ఏర్పాటు చేసింది, ఇది తెలంగాణ అర్బన్ ఏరియాస్ (డెవలప్‌మెంట్) యాక్ట్ - 1975 ప్రకారం పనిచేస్తుంది.
ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ రెడీ
ప్రస్తుత జీహెచ్ఎంసీ (GHMC) పరిధికి అవతల ఏర్పడనున్న ఈ జోన్‌ను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వ ఆలోచన. ఈ నగరంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. నివాస సముదాయాల నుంచి నడిచే దూరంలోనే విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగం, వినోద సేవలు లభించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో "ఫ్యూచర్ సిటీ" ప్రాథమిక మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగిన సమీక్షా సమావేశంలో దీనిపై చర్చలు జరగగా, ఆయన సూచనల మేరకు మార్పులు చేసి తుది ప్రణాళిక త్వరలోనే ప్రకటించనున్నారు.
హైదరాబాద్‌పై బారాన్ని తగ్గించేలా ఫ్యూచర్ సిటీ ప్లాన్
ఫ్యూచర్ సిటీకి ఔటర్ రింగ్ రోడ్ (Hyderabad Outer Ring Road), శ్రీశైలం హైవే, నాగార్జున సాగర్ హైవేలు సరిహద్దులుగా ఉండనున్నాయి. ఇది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad Airport)కి సమీపంలో ఉన్న ప్రాంతం. ఇప్పటికే ఉన్న పారిశ్రామిక సంస్థల సమీపంలో విశాల భూమి లభ్యతతో, ఫ్యూచర్ సిటీ తెలంగాణ భవిష్యత్ ఆర్థిక శక్తికి కేంద్రంగా మారనుందని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ నగరంపై పడుతున్న ఒత్తిడిని తగ్గిస్తూ, స్మార్ట్ మౌలిక సదుపాయాలు కలిగిన, వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధించే ప్రత్యామ్నాయంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తారు. అభివృద్ధి బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ (TGIIC) చేపట్టింది. మాస్టర్ ప్లానింగ్ కోసం అంతర్జాతీయ స్థాయి సంప్రదింపు సంస్థల సహకారం తీసుకుంటున్నారు.
పర్యావరణ పరిరక్షణ.. జీవవైవిధ్య సంరక్షణ
ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌లో పర్యావరణ అనుకూలతలపై ప్రధాన దృష్టి సారించారు. వర్షపు నీటి నిర్వహణ కోసం పారిశ్రామిక, నివాస ప్రాంతాల్లో స్పాంజ్ పార్కులు ఏర్పాటు చేస్తారు. ఇవి నీటిని గ్రహించి వరదలను నివారించగలవు. నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు పునర్వినియోగ నీటి వ్యవస్థలు, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ విధానాన్ని అమలు చేస్తారు. అధిక సామర్థ్యం గల విద్యుత్ సబ్ స్టేషన్లు, గ్రీన్ కారిడార్‌లు, పాకెట్ పార్కుల నెట్‌వర్క్‌తో నగరం హరిత వాతావరణాన్ని బలోపేతం చేస్తుంది. "వాక్ టు వర్క్" కాన్సెప్ట్‌కు అనుగుణంగా నివాస సముదాయాలను క్లస్టర్ పద్ధతిలో రూపొందిస్తారు.
రిజర్వ్ అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేయడంతో పాటు, ప్రస్తుతం ఉన్న జల వనరులు, జంతు ప్రదర్శనశాలలు, ఎకో టూరిజం జోన్‌లను సంరక్షిస్తారు. పర్యాటక, వ్యాపార సందర్శనల అభివృద్ధి కోసం హోటళ్లు, రిసార్టులు అభివృద్ధి చేస్తారు. మునిసిపల్ వ్యర్థాల నిర్వహణకు సాలిడ్ వెస్ట్ మేనేజ్‌మెంట్, ఈ-వేస్ట్ డిస్పోజల్, కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల ఏర్పాటుతో నగర శుభ్రత, ఆరోగ్యం మెరుగవుతుంది.
ఫ్యూచర్ సిటీకి సంబంధించి ముఖ్యమైన జోన్‌లు:
ఈ నగరంలో పలు రంగాలపై ప్రత్యేకమైన జోన్‌లు ఉంటాయి: అవి, కృత్రిమ మేధస్సు, జీవశాస్త్రాలు, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి. ఎలక్ట్రిక్ వాహనాలు, పవర్ స్టోరేజ్. పర్యాటకం, వినోదం, సినిమా నిర్మాణం. ఆరోగ్యం, విజ్ఞాన మౌలిక సదుపాయాలు
ఫ్యూచర్ సిటీ ప్రత్యేకతలు
భారతదేశంలోనే మొట్టమొదటి నెట్-జీరో స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ, ఇది విద్యుత్, నీటి పునర్వినియోగం, హరిత వనాల కలయికతో అభివృద్ధి అవుతుంది. ‘లివ్, లెర్న్, వర్క్, ప్లే’ ఫ్రేమ్‌వర్క్‌తో నగరం రూపుదిద్దుకుంటుంది. నివాస ప్రాంతాలు, ఉద్యోగ కేంద్రాలు, విద్యాసంస్థలు, వినోద కేంద్రాలు నడిచే దూరంలో అందుబాటులో ఉంటాయి. జాతీయ ప్రదర్శన ప్రాజెక్ట్‌గా దీనిని అభివృద్ధి చేస్తారు. ఇది భారత భవిష్యత్ నగరాల నమూనాగా మారనుంది.
క్లస్టర్ ఆధారిత అభివృద్ధికు అనుగుణంగా పారిశ్రామిక, విద్యా, ఆరోగ్య, పర్యాటక జోన్‌లను ట్రాన్సిట్-ఓరియెంటెడ్ కారిడార్‌లు, లాజిస్టిక్స్ హబ్‌లు కలుపుతాయి. డిజిటల్ ఫస్ట్ ప్లానింగ్తో జీఐఎస్, రియల్‌టైమ్ డ్యాష్‌బోర్డులు, బిల్డ్ నౌ వంటి వ్యవస్థల ద్వారా పారదర్శక సేవలు అందిస్తారు.గ్లోబల్ ఎలైన్‌మెంట్కు అనుగుణంగా జికా, వరల్డ్ బ్యాంక్, AIIB వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రణాళికలు ఉన్నాయి.
రహదారి అభివృద్ధి ప్లాన్
ఫ్యూచర్ సిటీకి మరింత అనుసంధానాన్ని కల్పించేందుకు కొత్త రహదారి ప్రణాళిక రూపొందించబడింది. మొత్తం పొడవు: 41.5 కి.మీ. కాగా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్ (నంబర్ 1) – ఇది ఔటర్ రింగ్ రోడ్ వద్ద రావిర్యాల ఇంటర్‌చేంజ్ (టాటా ఇంటర్‌చేంజ్) నుంచి, రీజనల్ రింగ్ రోడ్ వద్ద ఆమనగల్లు వరకు విస్తరించనుంది. ఫేజ్ 1లో రావిర్యాల నుంచి మీర్‌ఖాన్‌పేట్ వరకు 19.2 కి.మీ., ఫేజ్ 2లో భాగంగా మీర్‌ఖాన్‌పేట్ నుంచి ఆమనగల్లు వరకు 22.3 కి.మీ. వరకు గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్లు వేస్తారు. ఇది ఫ్యూచర్ సిటీ పరిధిలోని పారిశ్రామిక కారిడార్‌లను కలుపుతుంది.
ఈ రోడ్ ద్వారా SH-19, NH-765పై ట్రాఫిక్ తగ్గించడంతో పాటు, ఫ్యూచర్ సిటీకి ఆ రోడ్లతో వేగంగా చేరుకోవచ్చు.






















