Free Bus For Women: ఏపీలో మహిళలకు అలర్ట్.. ఉచిత బస్సు ప్రయాణానికి ఆ కార్డు చెల్లదు
AP Free Bus | ఏపీ ప్రభుత్వం ఆగస్టు 15న స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అందిస్తోంది. అయితే ఉచిత బస్సు ప్రయాణానికి కొన్ని కార్డులును అనుమతించరు.

Cards not Valid for Free Bus in Andhra Pradesh | అమరావతి: ఏపీ ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించింది. పథకం అమలు చేసిన నాలుగు రోజుల్లో 47 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సర్వీసును సద్వినియోగం చేసుకున్నారు. మహిళలకు దాదాపు రూ.19 కోట్ల మేర ఆదా అయిందని ఏపీ ప్రభుత్వం తెలిపింది. సోమవారం ఒక్క రోజులోనే 18 లక్షల మందికి పైగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో జీరో ఫేర్ టికెట్ తో ఉచితంగా ప్రయాణించగా, వారికి రూ.7 కోట్లకు పైగా ఆదా అయింది. ఘాట్ రూట్‌లలోని ఆర్టీసీ సర్వీసుల్లోనూ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించే స్త్రీ శక్తి పథకం అమలుకు సీఎం చంద్రబాబు అంగీకారాన్ని తెలిపారు.
స్త్రీ శక్తి పథకం ఏంటీ?
రాష్ట్ర మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం అమలు చేస్తోంది. దీని ద్వారా మహిళలు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సులు, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చు.
ఆ కార్డు ఎందుకు పనికిరాదు?
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలనుకునే వారు గుర్తింపు కార్డులను చూపించి జీరో టికెట్ తీసుకోవాలి. అయితే కొందరు పాన్ కార్డులను చూపించడంతో కండక్టర్లు వారికి జీరో టికెట్ ఇవ్వడం లేదు. పాన్ కార్డు ఉచిత బస్సు ప్రయాణం చేయడానికి పనికిరాదు. ఎందుకంటే పాన్ కార్డు మీద అడ్రస్ ఉండదు. స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. కనుక అర్హులైనప్పటికీ పాన్ కార్డు ద్వారా వారికి ఉచిత ప్రయాణం సాధ్యం కాదని ఆర్టీసీ అధికారులు తెలిపారు. సరైన ఐడి కార్డులు వెంట తీసుకెళ్లడం ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందుతారు. తెలంగాణలో అయినా సరే పాన్ కార్డులను ఉచిత బస్సుకు అనుమతించరు. వారు ఏ ప్రాంతానికి చెందిన వారని గుర్తించే వీలుండదు.
ఉచిత బస్సుకు ఏ కార్డులు చెల్లుబాటు అవుతాయి?
స్త్రీ శక్తి పథకం కింద ఏపీ వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం కోసం ఈ గుర్తింపు కార్డులు చూపిస్తే కండక్టర్ మీకు జీరో టికెట్ ఇస్తారు.
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- ఓటర్ ఐడి
- డ్రైవింగ్ లైసెన్స్
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన అడ్రస్ ఉన్న ఐడెంటిటీ కార్డులు
- దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల కార్పొరేషన్ జారీ చేసిన సర్టిఫికెట్
స్త్రీ శక్తి పథకం వల్ల లాభాలు
విద్యార్థినులకు నెలవారీ బస్ పాస్ ఖర్చు భారం తగ్గుతుంది. ఉద్యోగినులు, వ్యాపారవేత్తలు, కూలీ పనులకు వెళ్లే మహిళలు, దివ్యాంగులు తమ రోజువారీ ప్రయాణ ఖర్చు తగ్గించుకోవచ్చు. ఉచిత ప్రయాణంతో మిగులు మొత్తంలో తమకు కావాల్సిన ఇంటి సరుకులు కొనుగోలు చేసుకుంటున్నారు. కొందరు ఈ మిగులును చిన్న మొత్తాల పొదుపు, సుకన్య సమృద్ధి యోజన లాంటి స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలని అధికారులు, ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
సింహాచలం అప్పన్న ఆలయానికి వెళ్లే మహిళా భక్తుల కోసం ఏపీ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది.






















