First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
Guillain Barre syndrome | ఇటీవల తెలంగాణలో గులియన్ బారీ సిండ్రోమ్ తో తొలి మరణం సంభవించడం తెలిసిందే. తాజాగా ఏపీలోనూ జీబీఎస్ బారిన పడిన ఓ మహిళ మృతిచెందారు.

Guillain Barre syndrome death in Guntur GGH | గుంటూరు: గులియన్ బారీ సిండ్రోమ్ (GBS) వ్యాధితో ఏపీలో తొలి మరణం సంభవించింది. జీబీఎస్ వ్యాధి బారిన పడి గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న 45 సంవత్సరాల మహిళ మృతిచెందింది. ప్రకాశం జిల్లా, అలసందపల్లి గ్రామానికి చెందిన కమలమ్మ అనే మహిళ మృతిచెందినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.ఎస్. వి రమణ నిర్ధారించారు. గత కొన్ని రోజుల నుంచి వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా గుంటూరు జీజీహెచ్ డాక్టర్ రమణ మీడియాతో మాట్లాడుతూ... జీబీఎస్ మహిళ మరణానికి సంబంధించిన విషయాలు వెల్లడించారు. ఫిబ్రవరి 3వ తేదీన జీబీఎస్ సిండ్రోమ్ వ్యాధి బారిన పడిన ఓ మహిళ గుంటూరు జీజీహెచ్‌లో చేరారు. ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ జ్వరం, కాళ్లు చచ్చుపడిపోవడంతో వెంటిలేటర్ పై ఉంచి మెరుగైన చికిత్స అందించాం. ఆమె ప్రాణాలు కాపాడేందుకు ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ (NTR Aarogyasri) ద్వారా ఖరీదైన వైద్య సేవలు అందించినా దురదృష్టవశాత్తూ జీబీఎస్ పేషెంట్ చనిపోయారు.
కమలమ్మ మరణం గుంటూరు జిజిహెచ్ హాస్పిటల్ లో జీబీఎస్ సిండ్రోమ్ వ్యాధితో చనిపోయిన తొలి కేసు. ఓవరాల్‌గా రాష్ట్రంలోనూ ఇది తొలి జీబీఎస్ మరణం. కానీ ఆమె మరణం మమ్మల్ని బాధించింది. మా ప్రయత్నాలు ఫలించలేదు. గుంటూరు జీజీహెచ్ కు ఫిబ్రవరి 11న ఒకేరోజు ఏడు మంది పేషెంట్లు వచ్చారు. ప్రకాశం, పల్నాడు, ఏలూరు జిల్లాల నుంచి నలుగురు బాధితులు, గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి మరో ముగ్గురు జీబీఎస్ పేషెంట్లు గుంటూరు జీజీహెచ్‌లో చేరారు. వీరిలో ఇంకా ఇద్దరు వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు. కాకినాడలోనూ జీబీఎస్ బారిన పడి ఇద్దరు చికిత్స పొందుతున్నారు. ఏపీలో పలు జిల్లాల్లో గులియన్-బారీ సిండ్రోమ్ (Guillain Barre syndrome) కేసులు నమోదవుతున్నాయి.
జీబీఎస్ లక్షణాలు ఎలా ఉంటాయి..
ఇది ప్రాణాంతకం కాదని, అయితే సకాలంలో గుర్తించి చికిత్స పొందితే ఏ సమస్యా ఉండదని డాక్టర్ తెలిపారు. జీబీఎస్ అనేది అంటు వ్యాధి కాదు. కలుషిత నీటి ద్వారా, కలుషిత ఆహారం తీసుకున్నా జీబీఎస్ బారిన పడే అవకాశం ఉంది. నోరు వంకరపోవడం, నమలడం, మింగడం, మాట్లాడడంలో ఇబ్బంది కలగడం దీని లక్షణాలు. కాళ్ల నొప్పులు, చేతుల్లో తిమ్మిర్లు రావడం, మడమలు, మణికట్టు వంటి చోట్ల సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. వాంతులు, వికారం, తీవ్రమైన కడుపునొప్పి, ఒక్కసారిగా నీరసంగా అనిపించడం, ముఖ కండరాల్లో కదలిక లేకపోవడం, కంటి చూపు అకస్మాత్తుగా తగ్గడం, కొందరిలో శ్వాస తీసుకోవడంలోనూ సమస్య తలెత్తుతుంది. గుండె వేగం పెరగడం, అకస్మాతతుగా బీపీ పెరగడం లాంటి లక్షణాలు సైతం కనిపిస్తాయి.
జాగ్రత్తలు ఇవీ..
బాగా ఉడికించిన ఆహార పదార్థాలనే తినాలి. పరిశుభ్రమైన నీరు తాగాలి. కాచి చల్లార్చిన, గోరు వెచ్చని నీటిని తాగాలి. పచ్చిగుడ్లు తినకూడదు. కూరగాయలు, పండ్లు శుభ్రంగా కడిగి తినాలి. భోజనం చేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మాంసం ఉన్నచోట పరిశుభ్రత పెంచాలి. మురికి చేతులతో ఆహార పదార్థాలను తాకకూడదు. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనా, పైన పేర్కొన్న లక్షణాలు కనిపించినా వెంటనే డాక్టర్ ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

