Virat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలు
ఒకరేమో దారుణశస్త్రం...మరొకరు మరణశాస్త్రం. విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ లాంటి ఆటగాళ్లను చూసినప్పుడు ఇలాంటి విశేషణాలే గుర్తొస్తాయి. భారత్ క్రికెట్ కు ఈ ఇద్దరూ కలిసి అందించిన సేవలు..ఆడిన ఆట..వాహ్ ఆ సొగసు చూడతరమా. ఒకడేమో చొక్కా తడిస్తే మనిషే కాదు..ఆ పుల్ షాట్లతో ప్రపంచాన్ని మరిపించేస్తాడు. మరొకడు మచ్చలపులిలా ప్రత్యర్థుల మీద మరణమృందగం మోగిస్తాడు. అలాంటి ఇద్దరూ కలిసి తమ చిరకాల కల తీర్చుకున్నారు. ఒక్కటి ఒక్క ప్రపంచకప్ ను తామే స్వయంగా అందించి తమ దేశానికి అందించి వైదొలగాలనుకున్నారు. అనుకున్నది సాధించారు. ఈ క్రమంలో ఒకరికి ఒకరు అండగా నిలబడిన విధానం...మద్దతు చెప్పుకున్న తీరు ప్రపంచక్రికెట్ లో ఏదేశానికైనా ఓ మంచి ఎగ్జాంపుల్. విరాట్ కొహ్లీ కెప్టెన్సీ వదిలేస్తే రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాడు. కానీ ఎక్కడా ఇద్దరి మధ్యా ఆ ఆధిపత్య ధోరణి కనిపించదు. ఒకరు నాయకత్వంలో మరొకరు ఫెయిల్ అయినప్పుడు అండగా నిలబడ్డారు. రోహిత్ శర్మను తీసేయొచ్చుగా ఓసారి కొహ్లీని మీడియా అడిగితే ఏంటీ జోక్ చేస్తున్నారా...సీరియస్ గా ఈ క్వశ్చన్ నన్ను అడుగుతున్నారా అన్నారు. ఈ వరల్డ్ కప్ లో విరాట్ కొహ్లీ ఫెయిలైతే వాడు ఫైనల్లో మోతమోగిస్తాడు నీకేమన్నా ప్రాబ్లమా అని రోహిత్ శర్మ ఎదురు ప్రశ్న వేశాడు. ఇద్దరి మధ్య వైరుధ్యం ఉంది...జట్టును రెండుగా చీల్చేసేలా ఉన్నారంటూ వార్తలు వస్తే కలిసి నవ్వుకున్నారు. ఇలా ఆ సమఉజ్జీలు తమకు తాము మద్దతుగా నిలబడిన విధానమే ఈ రోజు ఇద్దరినీ విశ్వవిజేతలుగా నిలిపింది. ప్రపంచకప్ ను ముద్దాడి భవిష్యత్తు తరాల కోసం తమ స్థానాలను ఖాళీ చేసేలా ఓ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది. మ్యాచ్ ముగియగానే కొహ్లీ టీ20 ల నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటిస్తే..రోహిత్ శర్మ పోస్ట్ మ్యాచ్ ప్రెస్మీట్ లో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు. కానీ ఈ ఇద్దరూ కలిసి కప్పు అందుకున్న విధానం..దిగిన ఫోటోలు...భావోద్వేగాల కౌగిలింతలు..ఇది కదా రోహిరాత్ అంటే అంటూ ఇప్పుడు ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతాయి.