Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారా? - NRIలకు కష్టాలు తప్పవా!
Birth Citizenship: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త నిర్ణయాలతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే 'బర్త్ సిటిజన్ షిప్' తీసుకున్న నిర్ణయం అక్కడ ఎన్నారైల్లో సంచలనం సృష్టిస్తోంది.

Donald Trump On Citizenship: అమెరికాకు ట్రంప్ (Donald Trump) రెండోసారి అధ్యక్షుడు అవడం ఏమో కానీ వరుసపెట్టి విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆ క్రమంలో ముందు వెనుక చూడకుండా అవాస్తవాలు చెప్తున్నారన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే పాత ప్రెసిడెంట్ బైడన్ తీసుకున్న 70కి పైగా నిర్ణయాలను వెనక్కు తీసుకున్న ట్రంప్ ప్రపంచం నివ్వెర పోయే కొత్త నిర్ణయాలతో దూకుడుగా వెళ్తున్నారు. వాటిలో అతి ముఖ్యమైనది అమెరికాలో పుట్టినంత మాత్రాన అమెరికన్లు అవ్వరంటూ "బర్త్ సిటిజన్ షిప్ "పై తీసుకున్న నిర్ణయం అక్కడ ఉండే ఎన్నారైల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది.
అసలేంటి "బర్త్ సిటిజెన్ షిప్"?
అమెరికన్ లా ప్రకారం వేరే దేశపు తల్లిదండ్రులకు అమెరికాలో పిల్లలు పుడితే ఆ పిల్లలు ఆటోమేటిక్‌గా అమెరికన్ పౌరులుగానే గుర్తించబడతారు. భారతదేశానికి సంబంధించిన చాలామంది తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు అలానే అమెరికన్ పౌరులుగా జీవిస్తున్నారు. ఆ పిల్లలు పెద్దైన తర్వాత వారి అనుమతితో తల్లిదండ్రులు కూడా సిటిజన్షిప్ తీసుకుంటారు. అయితే మొదటి నుంచి 'అమెరికా ఫస్ట్' నినాదంతో జాతీయ భావాల ఆధారంగా రాజకీయాలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ పద్ధతికి చెక్ పెట్టేస్తున్నారు. అమెరికాలో పుట్టినంత మాత్రాన వేరే దేశపు తల్లిదండ్రుల పిల్లలు అమెరికన్లు అయిపోరు అంటూ సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికన్ సొసైటీలో మమేకమై ఆ దేశ ఆర్థిక స్థితికి ఎంతో దోహదం చేసిన ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల నుంచి వెళ్లి అమెరికన్ పౌరులుగా వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వాళ్లు వాళ్ల పిల్లలు అమెరికన్లు కాకుండా ఎలా అయిపోతారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దానితో కాస్త మెత్తబడిన ట్రంప్ ఇది అందరికీ కాదని అక్రమంగా అమెరికాలో జీవిస్తున్న ఇతర దేశాల వాళ్లకు మాత్రమేనని యూటర్న్ తీసుకున్నారు. H1B వీసాలు, గ్రీన్ కార్డు ఉన్నవారికి ఈ రూలు వర్తించదని వారి పిల్లలు అమెరికన్ పౌరులుగానే గుర్తించబడతారని వివరణ ఇచ్చారు.
'ఈ విధానం ఎక్కడా లేదు'
ఇలా తమ దేశంలో స్థిరపడిన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు తమ దేశ పౌరులు అయిపోయే విధానం ప్రపంచంలో ఇంకెక్కడా లేదనీ అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ చెప్పుకొస్తున్నారు. కానీ అది పచ్చి అబద్ధమని ప్రపంచ రాజకీయాలు పరిశీలిస్తున్న వారు చెబుతున్నారు. కెనడా, పాకిస్తాన్, నేపాల్ సహా ప్రపంచంలో 35కు పైగా దేశాల్లో ఈ విధానం అమల్లో ఉందని, మాట్లాడేటప్పుడు ట్రంప్ కాస్త ఫ్యాక్ట్స్ సరిచూసుకోవాలని వారు చెబుతున్నారు.
పనామా కాలువపై..
పనామా కాలువను అమెరికాకు అప్పచెప్పేయాలంటూ డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్య డిమాండ్ చేస్తున్నారు. పనామా కాలువ అతి పెద్ద మానవ నిర్మిత కెనాల్స్‌లో ఒకటి. ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాలను ఇది విడదీస్తుంది. అంతకు ముందు అమెరికాలోని న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్లాలంటే నౌకలు 22,500 కిమీ చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చేది. ఈ కాలువ వల్ల ఆ దూరం 9,500 కి.మీకు తగ్గిపోయింది. పనామా దేశంలోని ఈ కాలువను తవ్వే ప్రాజెక్టులో 38 వేల మంది అమెరికన్లు చనిపోయారని కానీ పనామా దేశం ఆ విషయాన్ని పట్టించుకోకుండా చైనాకు ఆ కాలువ నిర్వహణ అప్పజెప్పేస్తుందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. కానీ నిజం కాదని పనామా చెబుతోంది. తమ దేశానికి చెందిన "పనామా కెనాల్ మేనేజింగ్ అథారిటీ" చేతుల్లోనే ఆ కాలువ నిర్వహణ ఉందని అంటుంది. అలాగే ఆ కాలువ కోసం జరిగిన కృషిలో 6,000 మంది వరకు అమెరికన్లు ప్రాణ త్యాగం చేశారని కానీ ఆ సంఖ్య ట్రంప్ చెబుతున్నట్టు 38 వేలు కాదని అంటుంది. కానీ ట్రంప్ ఇవేవీ ఒప్పుకునే స్థితిలో కనిపించడం లేదు. తాను అనుకున్నది చేయడం కోసం ఎలాంటి అవాస్తవాలు అయినా చెప్పుకుంటూ వెళ్లిపోతున్నారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మరి రానున్న రోజుల్లో ట్రంప్ ఇంకెన్ని సంచలనాలకు కేంద్రం అవుతారో చూడాలి.





















