Iran War Update: ఎనిమిదేళ్ల యుద్ధానికైనా సిద్ధం - అమెరికా, ఇజ్రాయెల్‌కు లొంగే ప్రసక్తే లేదన్న ఇరాన్
War Updates: అమెరికా, ఇజ్రాయెల్‌లకు లొంగిపోయే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. మరో ఎనిమిదేళ్ల పాటు యుద్ధానికి సిద్ధమని స్పష్టం చేసింది.

Iran is ready to fight for eight years: పశ్చిమ ఆసియాలో ఇరాన్ - అమెరికా - ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ అంశంపై భారత్‌లోని ఇరాన్ అత్యున్నత నాయకుడి ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి ఢిల్లీలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
అణ్వాయుధాలు తయారు చేయడం లేదన్న ఇరాన్
పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ తన సార్వభౌమాధికారాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఆ దేశ సుప్రీం లీడర్ ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహి స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అంఁశంపై ఢిల్లీలో ఆయన మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇరాన్ ఎన్నడూ లొంగిపోలేదని, అవసరమైతే మరో ఎనిమిదేళ్ల సుదీర్ఘ యుద్ధం చేయడానికి కూడా తమ దేశం సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఇరాన్ అణుబాంబు తయారు చేస్తోందన్న ప్రచారాన్ని ఆయన ఖండిస్తూ, అణు ఆయుధాల తయారీ ఇస్లాం ధర్మానికి విరుద్ధమని , తమ నాయకత్వం కూడా దీనిని ఇప్పటికే స్పష్టం చేసిందని గుర్తుచేశారు.
బంకర్లలోకి వెళ్లేందుకు నిరాకరించిన సుప్రీం లీడర్
సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా, ఆయన సామాన్య ప్రజలను విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు నిరాకరించారని ఇలాహి వెల్లడించారు. 9 కోట్ల మంది ఇరానియన్లను బంకర్లలో ఉంచగలిగితేనే నేను అక్కడికి వస్తానని ఆయన భద్రతా సిబ్బందితో చెప్పారు అని వివరించారు. ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇరాన్‌కు కొత్త నాయకుడిని ఎన్నుకునే అధికారం అమెరికాకు లేదని, అలాంటి మాటలు వింటే ఇరాన్ చిన్న పిల్లలు కూడా నవ్వుకుంటారని ఎద్దేవా చేశారు. ట్రంప్ తన దృష్టిని అమెరికాలోని నగరాల మేయర్ల ఎంపికపై పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు.
పొరుగు దేశాలకు హెచ్చరిక
హెజ్బుల్లా, హమాస్, హౌతీల వంటి సంస్థలను ఆయన సమర్థించారు. ఇజ్రాయెల్ అణచివేతకు వ్యతిరేకంగానే వారు పోరాడుతున్నారని, మానవత్వం లేని పరిస్థితుల్లో బతుకుతున్న వారు తిరగబడటంలో తప్పులేదని అన్నారు. అలాగే పొరుగు దేశాలైన యూఏఈ, కువైట్, బహ్రెయిన్ వంటి వాటిపై దాడుల గురించి స్పందిస్తూ.. మా భూభాగంపై దాడి చేయడానికి అమెరికాకు మీ నేలని ఇవ్వకండి. ఒకవేళ అమెరికా దాడులకు మీరు సహకరిస్తే, మమ్మల్ని మేము కాపాడుకునే హక్కు మాకు ఉంటుంది అని కీలక హెచ్చరిక చేశారు. భారత్‌కు కూడా ఈ యుద్ధ సెగ తగులుతుందని, చమురు ధరల పెరుగుదల వల్ల నష్టపోయే భారత్ కూడా ట్రంప్‌పై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
హోర్ముజ్ జలసంధి మూసివేతపై సంకేతాలు
ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హోర్ముజ్ జలసంధిని మూసివేయడంపై కూడా ఆయన స్పందించారు. ఇప్పటి వరకు ఇరాన్ దానిని మూసివేయలేదని, కానీ ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మాత్రం అది అందరికీ మూసుకుపోతుందని హెచ్చరించారు. మరోవైపు యుద్ధంలో రష్యా, చైనా మద్దతుపై వస్తున్న వార్తలను ఆయన కేవలం మీడియా ఊహాగానాలుగా కొట్టిపారేశారు. శాంతి స్థాపన జరగాలంటే ప్రపంచ దేశాలు ట్రంప్, నెతన్యాహు దగ్గరకు వెళ్లి యుద్ధం ఆపమని చెప్పాలని, బాధితులైన ఇరాన్‌ను నియంత్రించమనడం సబబు కాదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.
ట్రెండింగ్ వార్తలు























