Kadiri: కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో రాజకీయాలు - బీజేపీ నేతలకు అవమానం - ఎమ్మెల్యే పనే ?
TDP Vs BJP: కదిరిలో టీడీపీ ఎమ్మెల్యే బీజేపీ నేతల్ని అవమానిస్తున్నారు. అథ్యాత్మిక కార్యక్రమాల్లోనూ బీజేపీ నేతలకు ప్రాధాన్యం దక్కుండా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.

Temple politics in Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల వేళ రాజకీయ సెగలు రాజుకున్నాయి. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ, స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ , బీజేపీ రాష్ట్ర నేత విష్ణువర్ధన్ రెడ్డిని ఉత్సవాల్లో పాల్గొనకుండా చేయాలని అనుకోవడం వివాదాస్పదం అవుతోంది.
విష్ణువర్ధన్ రెడ్డికి అందని ఉత్సవాల ఆహ్వానం
కదిరి నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ తరుణంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు అయిన విష్ణువర్ధన్ రెడ్డిని ఆలయ కమిటీ కార్యక్రమాలకు , అధికారిక ప్రోటోకాల్‌కు దూరం పెట్టాలని ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ..ఆలయ అధికారులను ఆదేశించారు. సాధారణంగా ఇలాంటి పెద్ద ఉత్సవాల్లో స్థానిక ప్రముఖులను, రాజకీయ నేతలను ఆహ్వానించడం ఆనవాయితీ. అయితే, విష్ణువర్ధన్ రెడ్డికి ఎటువంటి ఆహ్వానం అందకుండా చూడటమే కాకుండా, ఆయన ఆలయ ప్రాంగణంలోకి వస్తే ఎటువంటి అధికారిక మర్యాదలు జరగకూడదని ఎమ్మెల్యే గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. ఇది కూటమిలోని రెండు పార్టీల మధ్య ఉన్న అంతర్గత పోరును బహిర్గతం చేస్తోంది.
ఎమ్మెల్యే ఆదేశాల వెనుక అసలు కారణం ?
కందికుంట వెంకట ప్రసాద్ ఈ స్థాయిలో కఠినంగా వ్యవహరించడానికి ప్రధాన కారణం నియోజకవర్గ ఆధిపత్యంగా భావిస్తున్నారు. కదిరిలో విష్ణువర్ధన్ రెడ్డికి కూడా మంచి పట్టు ఉండటం, ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ సొంత క్యాడర్‌ను నిర్మించుకోవడం ఎమ్మెల్యేకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి అయినప్పటికీ, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, భవిష్యత్తు రాజకీయాల్లో విష్ణువర్ధన్ రెడ్డి తనకు పోటీ అవుతారనే ఆందోళన ఎమ్మెల్యేలో ఉందని భావిస్తున్నారు. అందుకే, నా ఇలాకాలో నేనే సుప్రీం అనే సంకేతాన్ని పంపడానికే ఆయన ఇలాంటి ఆంక్షలు విధిస్తున్నట్లు సమాచారం.
పాత గొడవలే మళ్ళీ మొదలయ్యాయా?
విష్ణువర్ధన్ రెడ్డి తో ఎమ్మెల్యే ఆధిపత్యపోరాటానికి తరచూ దిగుతూనే ఉన్నరాు. గతంలో రోడ్ల విస్తరణ సమయంలో ఆలయ బలిపీఠం తొలగింపు విషయంలో కూడా ఎమ్మెల్యే అనుచితంగా ప్రవర్తించారు. ఇప్పుడు మళ్ళీ అదే పాత గొడవలు బ్రహ్మోత్సవాల రూపంలో తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా ఆలయ అభివృద్ధి పనుల క్రెడిట్ ఎవరికి దక్కాలనే విషయంలో కూడా వీరిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగా ఆలయ అధికారులు కూడా విష్ణువర్ధన్ రెడ్డిని పట్టించుకోవడం లేదని బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి.
రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ , బీజేపీ పెద్దలు కలిసి పనిచేస్తుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం టీడీపీ నేతల తీరు ఇలా ఉండటం కూటమికి చేటు తెస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. దైవ కార్యాల్లో కూడా రాజకీయ కక్షలు ప్రదర్శించడం వల్ల సామాన్య భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దేవుడి సన్నిధిలో అందరూ సమానమే అని చెప్పాల్సిన నేతలు, అడ్డుకోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర స్థాయి బీజేపీ నేతలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటే, ఇది కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే అవకాశం ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు



















