Kavitha: రెండు మూడేళ్లలో అధికారంలోకి బీఆర్ఎస్ - కవిత కీలక వ్యాఖ్యలు
BRS: రెండు మూడేళ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కవిత తెలిపారు. అప్పుడు దళితులకు మంచి రోజులు వస్తాయన్నారు.

Kalvakuntla Kavitha: ఎస్సీ వర్గీకరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఏమీ లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. వర్గీకరణ విషయంలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని, సుప్రీం కోర్టు తీర్పు వల్ల వర్గీకరణకు బాటలు పడ్డాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కేసీఆర్ అసెంబ్లీలో వర్గీకరణపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తు చేశారు. దళితుల మధ్య పంచాయతీ పెట్టవద్దని, ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు.
దళిద బంధు సాధన సమితి సమావేశంలో కవిత వ్యాఖ్యలు
గురువారం నాడు తన నివాసంలో జరిగిన దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడు మహేష్ కోగిల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. షమీమ్ అఖ్తర్ కమిషన్ నివేదికను బయటపెట్టి, వెంటనే వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ పేరు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి మరో మోసం చేశారని, వర్గీకరణకు, ఉద్యోగాల కల్పనకు ముఖ్యమంత్రి లింక్ పెడుతున్నారని అన్నారు. వర్గీకరణ వంకతో జాబు క్యాలెండర్ అమలును నిలిపివేయవద్దని సూచించారు. కోర్టు తీర్పు వచ్చి 6 నెలలు గడిచినా ఆలూలేదు చూలు లేదన్నట్లుగా ఉందని విమర్శించారు.
దళిత బంధు రూ.12 లక్షలు ఇస్తామని మాయ మాటలు
రేవంత్ రెడ్డి మాటలు చెబితే నమ్మరని ఢిల్లీ నుంచి ప్రియాంకా గాంధీని తీసుకొచ్చి హామీ ఇప్పించారని, దళిత కుటుంబాలకు రూ 10 లక్షలకు బదులు రూ 12 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రికి ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేశారని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి కుదేలు చేశారని తెలిపారు. ఇప్పటికే కేసీఆర్ మంజూరు చేసిన దళిత బంధు నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మిగిలిన 18 వేల దళిత కుటుంబాలకు దళిత బంధు డబ్బులను విడుదల చేయాలని సవాలు చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే ఈ డబ్బులు విడుదల చేయాలని అన్నారు. ఎస్సీలకు బడ్జెట్ లో రూ. 33 వేల కోట్లు కేటాయించి... కేవలం రూ 9800 కోట్లే ఖర్చు చేశారని ఎండగట్టారు.
అంబేద్కర్ విగ్రహానికి పూల దండ వేయడం లేదు !
అంబేద్కర్ జయంతిలోపు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు మంత్రివర్గం మొత్తం వెళ్లి పూలదండలు వేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వం మూసివేసిన గేట్లను బద్దలుకొట్టి తాము అంబేద్కర్ ను గౌరవించుకుంటామని తేల్చిచెప్పారు. అంబేద్కర్ ని గౌరవించని ముఖ్యమంత్రి... మన ఆకలిని అర్థం చేసుకుంటారా ? అని ప్రశ్నించారు. అట్టడుగు వర్గాల వారిని వేలు పట్టుకొని ముందుకు నడిపించాలన్నది కేసీఆర్ ఆలోచన అని, పేదలు, అణగారిన వర్గాల కోసం పనిచేయాలని కేసీఆర్ ఎప్పుడూ అంటుంటారని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు ఆత్మబంధువు అంబేద్కర్ అని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమైందని, అంబేద్కర్ పై ప్రేమను ప్రదర్శించడానికి 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారని వివరించారు.
రెండు మూడేళ్ల తర్వాత అధికారంలోకి బీఆర్ఎస్
రెండు మూడేళ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వస్తుందని, దళితులకు మంచి రోజులు వస్తాయని స్పష్టం చేశారు. దళితులను ధనవంతులను చేయాలన్న ఉద్ధేశంతో కేసీఆర్ దళిత బంధును ప్రవేశపెట్టారని, ఎన్నికల కోసం కాకుండా... రానున్న తరాల కోసం కేసీఆర్ ఆలోచిస్తారని తెలిపారు. దళితుల కోసం రూ 57 వేల కోట్లు ఖర్చు చేయాలని కేసీఆర్ భావించారని, కేసీఆర్ ఆలోచన అమలైతే దళిత కుటుంబాల్లో దరిద్రం ఉంటుందా ? అని అడిగారు. దళిత బంధును అమలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ దళితులను మోసం చేస్తూనే ఉందని విమర్శించారు. దళిత బంధు సాధన సమితి ఉద్యమానికి అండగా ఉన్నందుకు ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

