DC vs MI Preview: 'జీరో' జట్ల సమరం! ముంబయి, దిల్లీలో ఎవరికో 2 పాయింట్ల వరం!!
DC vs MI Preview: ఇండియన్ ప్రీమియర్ లీగులో మంగళవారం 16వ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటి వరకు తొలి గెలుపునకు నోచుకోని దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి.
DC vs MI Preview:
ఇండియన్ ప్రీమియర్ లీగులో మంగళవారం 16వ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటి వరకు తొలి గెలుపునకు నోచుకోని దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి. అరుణ్ జైట్లీ మైదానం ఇందుకు వేదిక. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. మరి వీరిలో మొదటి విజయం ఎవరికి దక్కుతుందో!
ఏమైంది.. ముంబయి!
ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్‌ఫుట్ టీమ్ ముంబయి ఇండియన్స్! ఆటగాళ్ల ఎంపిక నుంచి వ్యూహాల అమలు వరకు అన్నీ పక్కాగా చేస్తుంది. అలాంటి జట్టు మూడేళ్ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కీలక ఆటగాళ్లు గాయపడటం, ఫామ్ కోల్పోవడం వారికి శాపంగా మారింది. పాండ్య బ్రదర్స్ లేని లోటును ఎవ్వరూ పూడ్చలేకపోతున్నారు. ఈ సీజన్లో తమ చిరకాల ప్రత్యర్థులు ఆర్సీబీ, సీఎస్‌కే చేతిలో వరుసగా ఓడింది. మూడో మ్యాచ్ నుంచైనా గెలుపు బాట పట్టాలని ఉవ్విళ్లూరుతోంది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ తప్ప ఎవ్వరూ స్థాయికి తగ్గట్టు ఆడటం లేదు. రోహిత్, ఇషాన్ మెరుపు స్టార్ట్ ఇవ్వడం లేదు. మిస్టర్ 360 సూర్యకుమార్ ఆట మరీ ఘోరం. జస్ప్రీత్ బుమ్రా లేని బౌలింగ్ అటాక్ దారి తప్పింది. చెప్పుకోదగ్గ బౌలర్లే కనిపించడం లేదు. కోట్లు పెట్టి కొనుకున్న ఆర్చర్ బౌలింగ్‌లో పసలేదు. కుమార్ కార్తికేయను పక్కన పెడితే స్పిన్‌లో వైవిధ్యమే లేదు.
మూమెంటమ్ అందుకుంటే!
రిషభ్ పంత్ లేని దిల్లీ క్యాపిటల్స్‌కు బ్యాలెన్స్ కుదరడం లేదు. మిడిలార్డర్లో ఒక్కరూ నిలబడటం లేదు. మనీవ్ పాండే వచ్చిన అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మిచెల్ మార్ష్ ఫామ్‌లో లేడు. అక్షర్ పటేల్, సర్ఫరాజ్ ఖాన్ పోరాడుతున్నారు. రిలీ రొసొ, రొమన్ పావెల్ నిలబడటం లేదు. ఓపెనింగ్‌లో డేవిడ్ వార్నర్ ఒక్కడే శ్రమిస్తున్నాడు. దూకుడుగా ఆడే పృథ్వీ షాను ప్రత్యర్థులు షార్ట్ పిచ్ బంతుల వ్యూహంతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. అభిషేక్ పోరెల్, అమన్ ఖాన్ ఇంకా కుర్రాళ్లే! బౌలింగ్ వరకు దిల్లీ ఫర్వాలేదు. ఖలీల్ అహ్మద్ వైవిధ్యం ప్రదర్శిస్తున్నాడు. ఆన్రిచ్ నోకియా వచ్చాక బౌలింగ్ అటాక్ మెరుగైంది. కుల్‌దీప్ స్పిన్ ఫర్లేదు. ముకేశ్ కీలక సమయాల్లో వికెట్లు తీస్తున్నాడు. మూమెంటమ్ అందుకుంటే వార్నర్ సేనకు తిరుగుండదు. ఏదేమైనా ఈ మ్యాచుతో రెండు జట్లలో ఎవరో ఒకరు గెలుపు రుచి చూడబోతున్నారు.
దిల్లీ క్యాపిటల్స్ జట్టు: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, రిపుల్ పటేల్, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, ఎన్రిచ్ నోర్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, ఎంగిడి, ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఇషాంత్ శర్మ, ఫిల్ సాల్ట్, ముఖేష్ కుమార్.
ముంబయి ఇండియన్స్ జట్టు: కామెరాన్ గ్రీన్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, జస్ప్రీత్ బుమ్రా, జోఫ్రా ఆర్చర్, డెవల్డ్ బ్రేవో, టిమ్ డేవిడ్, ట్రిస్టన్ స్టబ్స్, తిలక్ వర్మ, జే రిచర్డ్సన్, సూర్యకుమార్ యాదవ్, జేసన్ బెహ్రెండార్ఫ్, పీయూష్ చావ్లా, అర్జున్ టెండూల్కర్, షామ్స్ ములానీ, నేహాల్ వధేరా, కుమార్ కార్తికేయ, హృతిక్ షౌకీన్, ఆకాష్ మాధవల్, అర్షద్ ఖాన్, రాఘవ్ గోయెల్, డువాన్ జాన్సెన్, విష్ణు వినోద్.