అన్వేషించండి
Advertisement
Indian women in Olympics : ఒలింపిక్ తోటలో పూసిన, భారత మహిళా "మణులు"
Olympic News 2024: భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన భారత మహిళా అథ్లెట్లు ఎందరో ఉన్నారు. ఇప్పటివరకూ జరిగిన 24 ఒలింపిక్స్ క్రీడల్లో 7 మహిళా అథ్లెట్లు 8 పతకాలు సాధించి వహ్వా అనిపించారు.
Sports News in Telugu: ఒలింపిక్స్‌లో భారత మహిళా అథ్లెట్లది ఓ ప్రత్యేక ప్రస్థానం. 2000 సంవత్సరంలో తెలుగు తేజం కరణం మల్లేశ్వరి( Karnam Malleswari )తో మొదలైన ఈ ప్రస్థానం.. ఆ తర్వాత నిరాంటకంగా కొనసాగుతోంది. ఒకప్పుడు ఒలింపిక్స్‌లో మహిళలు ఒక పతకమైనా సాధిస్తారా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన క్రీడాభిమానులకు... ఆ తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో మూడు పతకాలు కానుకగా ఇచ్చి అబ్బురపరిచారు. దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన భారత మహిళా అథ్లెట్లు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఇప్పటివరకూ జరిగిన 24 ఒలింపిక్స్ క్రీడల్లో ఏడుగురు మహిళా అథ్లెట్లు ఎనిమిది పతకాలు సాధించి ఔరా అనిపించారు. ఈ ఒలింపిక్ పతకాల్లో తెలుగు తేజాలే మూడు పతకాలు సాధించి సత్తా చాటారు. ఒలింపిక్స్‌లో పూసిన భారత మహిళా మణుల చరిత్రను ఓసారి పరిశీలిద్దాం...
కరణం మల్లీశ్వరీ
2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో తెలుగు తేజం కరణం మల్లేశ్వరి... ఒలింపిక్స్ చరిత్రలో పతకం సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్‌గా సత్తా చాటింది. ఈ పతకం తర్వాత ఒలింపిక్స్‌లోనూ పతకం గెలవవచ్చనే నమ్మకం చాలామంది మహిళా అథ్లెట్లకు దక్కింది. వెయిట్‌లిఫ్టింగ్ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా కరణం మల్లీశ్వరి నిలిచింది. మహిళల 54 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో కరణం మల్లీశ్వరీ ఈ పతకం సాధించింది. స్నాచ్‌లో 110కిలోలు, క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో 130కిలోలు మొత్తం 240కిలోలు ఎత్తి మల్లీశ్వరీ కాంస్య పతకాన్ని ముద్దాడింది. ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ వెయిట్ లిఫ్టర్‌గా మల్లీశ్వరి నిలిచింది.
సైనా నెహ్వాల్
2012 లండన్ ఒలింపిక్స్‌లో సైనా నెహ్వాల్(Saina Nehwal) బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో కాంస్య పతకంతో భారత బ్యాడ్మింటన్ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పింది. చైనాకు చెందిన వాంగ్ జిన్ గాయం కారణంగా పోటీ నుంచి తప్పుకోవడంతో సైనా నెహ్వాల్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. సైనా నెహ్వాల్ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి.
మేరీ కోమ్
2012 లండన్ ఒలింపిక్స్‌లో మహిళల ఫ్లై వెయిట్ బాక్సింగ్‌లో స్టార్ బాక్సర్ మేరీకోమ్(MC Mary Kom) కాంస్య పతకాన్ని కైవసం చేసుకుని చరిత్ర పుటల్లో తన పేరును నిక్షిప్తం చేసుకుంది. బాక్సింగ్‌లో మొదటి ఒలింపిక్ పతకం సాధించిన భారతీయ మహిళ మేరికోమ్ సత్తా చాటింది.
పీవీ సింధు
2016 రియో ఒలింపిక్స్‌లో మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో రజత పతకం సాధించి విశ్వ క్రీడల్లో హైలెట్‌గా నిలిచింది. 2016 రియో గేమ్స్‌లో మహిళల సింగిల్స్ ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా భారత బ్యాడ్మింటన్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. సింధు ఫైనల్‌లో స్పెయిన్‌కు చెందిన కరోలినా మారిన్ చేతిలో ఓడిపోయి రజత పతకాన్ని గెలుచుకుంది. కానీ అద్భుత పోరాటంతో అందరినీ ఆకట్టుకుంది. సింధు(PV Sindhu) భారతదేశపు అతి పిన్న వయస్కురాలైన ఒలింపిక్ పతక విజేతగా చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా కూడా నిలిచింది.
సాక్షి మాలిక్
2016 రియో ఒలింపిక్స్‌లో మహిళల 58 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మాలిక్(Sakshi Malik) కాంస్య పతకాన్ని సాధించి ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా అవతరించింది. రిపెచేజ్ రౌండ్‌లోకి ప్రవేశించి కిర్గిజ్‌స్థాన్‌కు చెందిన ఐసులుయు టైనిబెకోవాపై 8–5తో విజయం సాధించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఒక దశలో 5-0తో వెనుకబడినప్పటికీ గెలిచిన సాక్షి విశ్వ క్రీడల్లో పతకంతో తన జీవిత కలను సాకారం చేసుకుంది
మీరాబాయి చాను
2020 టోక్యో ఒలింపిక్స్ మహిళల 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను(Mirabai Chanu) 202 కేజీల బరువు ఎత్తి రజత పతకాన్ని గెలుచుకుంది. ఈ ఘనతతో మణిపూర్‌కు చెందిన మీరాబాయి చాను రజతం సాధించిన తొలి భారతీయ వెయిట్‌లిఫ్టర్‌గా అవతరించింది. కరణం మల్లీశ్వరి తర్వాత పతకం సాధించిన రెండో భారతీయ వెయిట్‌లిఫ్టర్‌గా మీరాబాయి చాను చరిత్ర సృష్టించింది.
లోవ్లినా బోర్గోహైన్
2020 టోక్యో ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌లో బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్(Lovlina Borgohain) కాంస్య పతకాన్ని సాధించింది. బోర్గోహైన్ 16వ రౌండ్‌లో జర్మనీకి చెందిన నాడిన్ అపెట్జ్‌ను ఓడించిన లోవ్లినా కాంస్యాన్ని ముద్దాడింది.
పీవీ సింధు
2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించడం ద్వారా పీవీ సింధు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన అథ్లెట్‌గా సింధు చరిత్ర సృష్టించింది. సింధు సెమీ-ఫైనల్స్‌లో చైనీస్ తైపీకి చెందిన రెండవ సీడ్ తాయ్ ట్జు-యింగ్‌తో 18–21, 12–21తో ఓడిపోయింది. ప్లేఆఫ్‌లో చైనాకు చెందిన ఎనిమిదో సీడ్ హి బింగ్జియావోను ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత రెండు వ్యక్తిగత ఒలింపిక్ పతకాలను గెలుచుకున్న రెండో అథ్లెట్‌గా సింధు నిలిచింది. మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్‌లో వరుసగా రెండు ఒలింపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళగా... ఓవరాల్‌గా నాలుగో క్రీడాకారిణిగా సింధు నిలిచింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement