SLBC Tunnel Rescue Updates: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీత, నాగర్‌కర్నూల్ ఆస్పత్రికి తరలింపు
SLBC Tunnel Rescue Operation: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ నుంచి మరో మృతదేహం వెలికితీసి నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

SLBC Tunnel News Updates | నాగర్‌కర్నూల్: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం (SLBC Tunnel) నుంచి మరో మృతదేహాన్ని వెలికితీశారు. సహాయక చర్యల్లో భాగంగా మంగళవారం ఉదయం మృతదేహం ఆనవాళ్లను రెస్క్యూ టీమ్ గుర్తించింది. మధ్యాహ్నానికి మట్టిని తొలగించి మృతదేహాన్ని టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం అధికారుల అనుమతితో నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని అంబులెన్సులో తరలించారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో మొత్తం 8 మంది చిక్కుకోగా, మూడు వారాల కిందట టన్నెల్ బోరింగ్ మేషిన్ ఆపరేటర్ మృతదేహాన్ని వెలికితీశారు. అప్పటినుంచి సహాయక చర్యలు కొనసాగించగా.. నేడు రెండో మృతదేహం ఆనవాళ్లు గుర్తించి రెస్క్యూ టీమ్ తీవ్రంగా శ్రమించి మరో మృతదేహాన్ని వెలికితీసి జిల్లా ప్రభుత్వ ఆసుసత్రికి తరలించారు. మరో ఆరుగురి మృతదేహాలు వెలికి తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో మృతదేహం లభ్యమైంది. మినీ హిటాచి తో మట్టి తవ్వుతుండగా మృతదేహం ఆనవాళ్లు కనిపించగా కొన్ని గంటలపాటు శ్రమించి టీమ్ వెలికితీసింది.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ఉద్దేశం ఏంటీ..
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 3 లక్షల 20 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం ప్రాజెక్టును 2005లో ప్రారంభించారు. అప్పటినుంచి ప్రభుత్వాలు మారుతున్నా, పనులలో పురోగతి లభించింది. శ్రీశైలం, దేవరకొండల నుంచి రెండువైపులా టన్నెల్ బోరింగ్ మేషిన్లతో 44 కిలోమీటర్ల పొడవున్న టన్నెల్ మార్గాన్ని తవ్వుకుంటూ వస్తున్నారు. కానీ సున్నితమైన ప్రాంతం, నీళ్లు రావడం, బురద ఏర్పుడుతండటంతో తవ్వకాలకు పలుమార్లు ఆటంకాలు తలెత్తడంతో రెండు దశాబ్దాలు కావొస్తున్నా టన్నెల్ పనులు పూర్తి కాలేదు. ఇప్పటివరకు దేవరకొండ వైపు నుంచి 23.51 కిలోమీటర్లు పూర్తికాగా, అటు శ్రీశైలం జలాశయం నుంచి 13.95 కిలోమీటర్లు టన్నెల్ పనులు పూర్తయ్యాయి. మిగిలిన 9.5 కిలోమీటర్ల దూరం సొరంగాన్ని పూర్తి చేసి సాగునీరు, తాగునీరు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
అసలేం జరిగిందంటే..
ఫిబ్రవరి 18న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులు మళ్లీ చేపట్టగా, శ్రీశైలం వైపు నుంచి 14వ కిలోమీటరు వద్ద సొరంగం లోపల పైకప్పు కూలడంతో ఈ మార్గం మూసుకుపోయి లోపల 8 మంది చిక్కుకుపోయారు. ఫిబ్రవరి 22న ఈ ఘటన జరిగింది. వాస్తవానికి ఆ సమయలో టన్నెల్ లో 50 మంది వరకు ఉండగా, టీబీఎంకు వేరే వైపున ఉన్నవారు రెండు కిలోమీటర్ల దూరం పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. అక్కడి నుంచి లోక్ ట్రైన్‌లో ప్రయాణించి సొరంగం నుంచి బయటకు వచ్చేశారు. సొరంగంలో జరిగిన ప్రమాదంపై అధికారులకు సమాచారం అందించారు. ఆరోజు నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. నెల రోజులు దాటినా కేవలం ఇద్దరి మృతదేహాలు వెలికితీయగా, మరో ఆరుగురి ఆచూకీ మార్చి 25 మధ్యాహ్నం నాటికి లభ్యం కాలేదు.
ఈ మార్గంలో టన్నెల్ బోర్ మేషిన్ బిగించడం, తవ్వకాలు చేపట్టడం సాధ్యం కాదని నిపుణులు ఇదివరకే తేల్చేశారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా బైపాస్ సొరంగం నిర్మాణంపై ఫోకస్ చేసింది. భూగర్భ పొరల్లో ఉన్న పరిస్థితితో అక్కడి నుంచి ముందుకు వెళ్లడం సాధ్యం కాదని.. తవ్వకం నిలిచిన ప్రాంతాన్ని మూసివేయనున్నారు. దానికి సమీపంలో వెనకకు వచ్చి బైపాస్ మార్గాన్ని తవ్వాలని భావిస్తున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

