Sanna Biyyam Scheme: సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, వచ్చే నెల నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ
Telangana News | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్‌లో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. ఉగాది రోజు ప్రారంభించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.

Revanth Reddy launches Sanna Biyyam scheme తెలంగాణ ప్రభుత్వం సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించింది. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఏర్పాటుచేసిన సభలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి తో కలిసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. కేవలం దసరా, దీపావళి, సంక్రాంతి పండుగ నాడే సన్న బియ్యం తినడం కాదు పేదవాళ్లు ప్రతిరోజు సన్న బియ్యం తినే రోజులు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉగాది పండుగ రోజున ఈ సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి 10 మంది లబ్ధి దారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు.
కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఆలోచన అది..
హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఒక రూపాయి 90 పైసలకే పేదలకు కిలో బియ్యం ఇయ్యాలని నిర్ణయించారు. కానీ ఎన్నికల్లో టిడిపి విజయం సాధించడంతో ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. పేదలకు బియ్యం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలు 1957 లోనే రేషన్ దుకాణాలు ప్రారంభించాయి. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ దాదాపు 70 ఏళ్ల కిందటే పిడిఎఫ్ బియ్యాన్ని ఇవ్వడం ప్రారంభించారు.
మిర్యాలగూడ హుజూర్నగర్ దేశంలోనే అత్యధికంగా బియ్యాన్ని ఉత్పత్తి చేశాయి. నల్గొండ జిల్లాలో 12 లక్షల ఎకరాలలో వరి పండించారు. దేశంలోనే అధికంగా వడ్లు పండించే రైతులు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నారు. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఉచితంగా ఇస్తున్నారు. కానీ ప్రజలు ఆ బియ్యాన్ని బయట మార్కెట్లో కిలో పది రూపాయల చొప్పున అమ్ముకుంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. మిల్లర్లు ఆ బియ్యాన్ని కొని రీసైకిలింగ్ చేసి కేజీ 50 రూపాయలు చొప్పున అమ్ముకొని లాభాలు అర్జిస్తున్నారు. రేషన్ బియ్యం పై కోట్ల రూపాయల దందా జరుగుతోంది. ప్రతి ఏడాది పదివేల కోట్ల రూపాయల మేర రేషన్ బియ్యం దందా జరుగుతోంది. దాంతో దొడ్డు బియ్యానికి బదులు పేదలకు సన్నబియ్యం అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పండుగనాడే కాదు ప్రతిరోజు పేదవాడు సన్నబియ్యమే తినేలా ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున సన్న బియ్యం ఉగాది పండుగనాడు శ్రీకారం చుట్టాలని భావించామని’ అన్నారు రేవంత్ రెడ్డి.
మల్లు స్వరాజ్యం భూమి కోసం, భుక్తి కోసం విముక్తి కోసం పోరాటాలు నిర్వహించిన గడ్డ నల్గొండ. క్రిష్ణపట్టి ప్రాంతం చైతన్యానికి మారు పేరు. హుజూర్ నగర్, కోదాడ కాంగ్రెస్ కు కంచుకోట అని కార్యకర్తలు నిరూపించారు. రావి నారాయణరెడ్డి ని దేశంలోనే అత్యంత మెజార్టీతో గెలిపించిన గడ్డ నల్గొండ. దక్షణ భారతదేశంలోనే నల్గొండ కాంగ్రెస్ ఎంపికి అత్యధిక మెజార్టీ ఇచ్చింది. దళితులు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు ఏం కోరుకుంటున్నారో అది ఇందిరా గాంధీ ఇచ్చారు. తెలంగాణ ప్రాంతంలో 25 లక్షల ఎకరాల భూములు ఇందిరాగాంధీ పేదలకు పంచి ఇచ్చారు. అందుకే రాష్ట్రంలో దేవుడి ఫోటో పక్కన ఇందిరమ్మ ఫోటో పెట్టుకునే సంస్కృతి తండాల్లో ఉంది. పేదల గురించి ఆలోచించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే ప్రతి పేదవాడు ప్రతిరోజూ సన్న బియ్యాం తినాలని ఈ పథకం ప్రారంభించుకున్నామని’ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

