India vs New Zealand T20 Preview | నేడు భారత్ - న్యూజిలాండ్ మొదటి టీ20
భారత్, న్యూజిలాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమ్ ఇండియా ఆడుతున్న మ్యాచులు ఇవే. ఈ సిరీస్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ( Suryakumar Yadav ) సత్తా చాటాల్సి ఉంటుంది. కెప్టెన్‌గానే కాకుండా బ్యాట్స్మన్ గా నిరూపించుకోవాలి.
2025లో సూర్యకుమార్ భారత్ తరఫున ఆడిన 19 టీ20 మ్యాచ్‌ల్లో కేవలం 218 పరుగులే చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. వరల్డ్ కప్ కు ముందు జరిగే సిరీస్ కాబట్టి అందరి చూపు సూర్య పైనే ఉంది. అయితే ఈ సిరీస్ కోసం సెలెక్ట్ చేసిన టీమ్ లో కొన్ని మార్పులు జరిగాయి. గాయం కారణంగా యంగ్ బ్యాట్సమన్ తిలక్ వర్మ ( Tilak Verma ) మొదటి మూడు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దాంతో శ్రేయస్ అయ్యర్‌ను ( Shreyas Iyer ) బీసీసీఐ జట్టులోకి తీసుకచ్చింది. టెస్ట్, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ( Shubman Gill ) ఈ సిరీస్ లో అసలు సెలెక్ట్ చేయలేదు.
అక్షర్ పటేల్ ( Axar Patel ) వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటిన ఇషాన్ కిషన్ ( Ishan Kishan ), రింకూ సింగ్ తిరిగి టీమ్ లోకి వచ్చారు. వాషింగ్టన్ సుందర్ ( Washington Sundar ) గాయం కారణంగా తప్పుకోగా, రవి బిష్ణోయ్ అతని స్థానంలో వచ్చాడు. భారత గడ్డపై తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్ గెలిచిన న్యూజిలాండ్, అదే ఊపును టీ20ల్లోనూ కొనసాగించాలని చూస్తోంది.





















