Vamana Jayanti 2024: మూడు అడుగులతో ముల్లోకాలను చుట్టేసిన త్రివిక్రముడి జయంతి!
Vamana Jayanti 2024 Date: ఏటా భాద్రపదమాసంలో పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశిని పరివర్తన ఏకాదశి అంటారు.. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశి వామన జయంతి...దశావతారాల్లో విష్ణువు ఓ అవతారం ఇది...
Vamana Jayanti 2024 : దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలో భాగంగా శ్రీ మహావిష్ణువు దశావతారాలు ఎత్తాడు. వాటిలో ఐదోది వామన అవతారం. ఇదే మొదటి మానవ అవతారం కూడా. ఎందుకంటే అప్పటివరకూ మత్య, కూర్మ, వరాహ, నారసింహ అవతారాలెత్తాడు...ఆ తర్వాత వచ్చిన అవతారం వామనుడు. భాద్రపదమాసం శుక్ల ద్వాదశి రోజు అదితి గర్భాన జన్మించాడు వామనుడు.
హరణ్య కశిపుడి కుమారుడు విష్ణుభక్తుడైన భక్త ప్రహ్లాదుడి మనవుడు బలి చక్రవర్తి. తండ్రి పేరు వైరోచనుడు. అత్యంత శక్తిని ప్రసాదించే విశ్వజిత్ యాగం చేసిన బలిచక్రవర్తి..ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు. స్వర్గం మీదకు దండయాత్ర చేసిన బలి చక్రవర్తిని నిలువరించడం ఎవరి తరమూ కాలేదు. దీంతే దేవతలంతా చెల్లాచెదురైపోయారు. రక్షణ కోసం శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు. అప్పుడు తానే మరో అవతారంలో వచ్చి బలిని అణిచివేస్తానని మాటిచ్చాడు విష్ణువు. అలా భాద్రపద శుద్ధ ద్వాదశి రోజు అదితి గర్భాన చిన్నారి వామనుడు ఉదయించాడు.
ఓసారి అశ్వమేథయాగాన్ని తలపెట్టిన బలి చక్రవర్తి..దాన ధర్మాలు చేస్తున్నాడు. ఇదే మంచి సమయంగా భావించిన వామనుడు ... బ్రాహ్మణ బాలుడి రూపంలో యాగశాల వద్దకు వెళతాడు. చిన్నారికి ఘన స్వాగతం పలికిన బలి చక్రవర్తి సకల మర్యాదలు పూర్తిచేసి ఏం కావాలో కోరుకోమని చెప్పాడు. అప్పుడు ఆ బాలుడు..తనకు యాగం చేసుకునేందుకు మూడు అడుగులు కావాలని కోరుతాడు. అంతే కదా.. తీసుకో అన్నాడు బలి. బాలుడి రూపంలో వచ్చింది శ్రీహరి అనే విషయాన్ని గ్రహించలేకపోయాడు బలి చక్రవర్తి. ఈ విషయాన్ని గ్రహించిన శుక్రాచార్యుడు బలిని పిలిచి చెప్పినా కానీ..మాటిచ్చాను తప్పేది లేదన్నాడు. ఆగ్రహించిన శుక్రాచార్యుడు.. చెప్పినా వినని నీవు రాజ్య భ్రష్టుడవు అవుతాని శపించి వెళ్లిపోయాడు.
బలి చక్రవర్తి వామునుడి పాదాలు కడిగి ఆ నీటిని తలపై చల్లుకుంటాడు..ఆ తర్వాత తాను ఇస్తానన్న మూడు అడుగులు తీసుకోమంటూ తన చేతిలో ఉన్న కలశంలో నీటిని ధారపోస్తాడు. ఆ సమయంలో కూడా శుక్రాచార్యుడు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించి సూక్ష్మరూపంలో ఆ కలశంలోకి చేరి రంధ్రానికి అడ్డుపడతాడు. అప్పుడు అక్కడే ఉన్న దర్భ పుల్లతో వామనుడు ఆ రంధ్రాన్ని గుచ్చడంతో శుక్రాచార్యుడి కన్ను పోయిందని చెబుతారు.
Also Read: దసరా నవరాత్రుల్లో పూజించాల్సిన నవ దుర్గలు - దేవీ కవచంలో ఉన్న అలంకారాలివి!
వామనుడు బ్రహ్మాండ రూపం పొందిన వర్ణన ఇది...
ఇంతింతై వటు దింతయై మరియు తానింతై
నభో వీధిపై నంతై తోయదమండలాగ్రమున కల్లంతై
ప్రభారాశిపై నంతై చంద్రుని కంతయై
ధ్రువునిపై నంతై మహార్వాటిపై నంతై
సత్యపదోన్నతుం డగుచు
బ్రహ్మాండాంత సంవర్ధియై
బలి నుంచి దానం తీసుకున్న వామనుడు అలా పెరుగుతూ బ్రహ్మండాన్ని ఆక్రమించేస్తాడు. ఓ అడుగు భూమిపై, మరో అడుగు ఆకాశంపై వేసి..మూడో అడుగు ఎక్కడ వేయాలని అడుగుతాడు...అప్పుడు బలి తలవంచి నిల్చుంటాడు... అలా మూడో అడుగు బలి తలపై వేసిన వామనుడు పాతాళానికి తొక్కేస్తాడు.
బలి దాన గుణానికి ప్రతిఫలంగా ఏడాదికి ఓసారి భూమిపైకి వచ్చి నీ రాజ్యాన్ని చూసుకో అనే వరమిస్తాడు...కేరళలో జరిగే ఓనం పండుగ వెనుకున్న ఆంతర్యం ఇదే. బలిరాకను స్వాగతిస్తూ అత్యంత వైభవంగా ఓనం జరుపుకుంటారు.
కేవలం మూడు అడుగులతో లోకాలను జయించాడు కాబట్టే వామనుడిని త్రివిక్రముడు అని పిలుస్తారు. కంచిలో ‘ఉళగలంద పెరుమాళ్’ ఆలయం, ఖజరుహోలో ఉన్న ‘వామన’ ఆలయం సహా ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ తదితర చోట్ల కూడా త్రివిక్రముడికి చాలా ఆలయాలున్నాయి.
ఆ మూడు అడుగులు ఏంటో తెలుసా...
చిన్నారి బాలుడి రూపంలో వామనుడు బలి చక్రవర్తిని అడిగిన మూడు అడుగులు...సత్వ రజో తమోగుణాలని...ఇవి సృష్టి స్థితి లయలను సూచిస్తాయని చెబుతారు.
బలి తల మీద పాదం మోపడం అంటే..
అహంకారాన్ని అధఃపాతాళానికి అణిచివేయడమే...
వామనజయంతి సందర్భంగా శ్రీ మహావిష్ణువును పూజించి అహంకారన్ని జయించాలని..బాధల నుంచి విముక్తి కలగాలని ప్రార్థిస్తారు..
Also Read: శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలు.. దసరా ఏ రోజు వచ్చింది - ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకారాలివే!