SRH vs LSG Match Highlights IPL 2025 | 300 కొట్టేస్తాం అనుకుంటే..మడతపెట్టి కొట్టిన LSG | ABP Desam
కాటేరమ్మ కొడుకులంతా బ్రూటల్ ఫామ్ లో ఉన్నారు..ఇటు LSG బౌలింగ్ పిచ్చ వీక్ గా ఉంది. ఈ గురువారం ఉప్పల్ లో లక్నో బౌలర్లకు చుక్కలు చూపిస్తారు అనుకుంటే...రివర్స్ అటాక్ అయ్యింది. 300 సంగతి దేవుడెరుగు 200 కొట్టడమై గగనమైపోయిన మ్యాచ్ లో సన్ రైజర్స్ అంచనాలను అందుకోలేకపోతే...ఢిల్లీ చేతిలో అనూహ్యంగా ఓడిపోయిన కసినంతా హైదరాబాద్ మీద తీర్చుకుంది లక్నో సూపర్ జెయింట్స్. సన్ రైజర్స్ పై 5వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించిన ఈ మ్యాచ్ లో టాప్ 5 హైలెట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం.
1. లార్డ్ శార్దూల్ ఠాకూర్
చెన్నైసూపర్ కింగ్స్ కి ఆడినప్పుడు శార్దూల్ ఆ టీమ్ కి పెట్టిన ముద్దు పేరు లార్డ్ అని. అంటే దేవుడిలా అవసరమైన సందర్భాల్లో ఆదుకుంటాడు అని. అలాంటి శార్దూల్ ఈ రోజు సన్ రైజర్స్ మీద మ్యాచ్ లో తన బౌలింగ్ తో చెలరేగిపోయాడు. స్ట్రాంగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ లో కాటేరమ్మ కొడుకుల్లాంటి ప్లేయర్లను కసితీరా కాటేశాడు. ఒకే ఓవర్లో అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లను పెలివియన్ కు పంపి లక్నోకు ఊహించిన దానికంటే పెద్ద ఆరంభమే ఇచ్చిన శార్దూల్...చివర్లో అభినవ్ మనోహర్, షమీ వికెట్లు కూడా తీసుకుని నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకోవటంతో పాటు పర్పుల్ క్యాప్ ను కూడా సొంతం చేసుకున్నాడు. శార్దూల్ బౌలింగే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ను నిస్సందేహంగా కట్టడి చేసిందని చెప్పొచ్చు.
2. సూపర్ స్టార్ ప్రిన్స్ యాదవ్
నాలుగు ఓవర్లలో 29 పరుగులే ఇచ్చి 1 వికెట్ తీసినట్లు కనిపిస్తున్న ఈ 23ఏళ్ల కుర్ర బౌలర్ అతి ప్రమాదకర ఆటగాడైన ట్రావియెస్ హెడ్ ను క్లీన్ బౌల్డ్ చేసిన విధానం నభూతో నభవిష్యతి. అక్కడితో ఆగాడా తన బౌలింగ్ లోని నితీశ్ కొట్టిన బలమైన షాట్ గా అడ్డంగా చేయి పెట్టాడు. అంతే అది ప్రిన్స్ చేతికి తగిలి నాన్ స్ట్రైక్ ఎండింగ్ స్టంప్స్ ను గిరాటేసింది. అప్పటికే క్రీజ్ వదిలిన కాటేరమ్మ కొడుకు క్లాసెన్ అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. ఆ బాల్ ఆపటం కష్టమని తెలిసినా ప్రిన్స్ చూపించిన టాలెంట్ ధైర్యమే ఈ మ్యాచ్ లో హెడ్, క్లాసెన్ లను అవుట్ చేసేలా మ్యాచ్ ను పూర్తిగా లక్నో కంట్రోల్ లో కి తెచ్చింది.
3. ఎమర్జింగ్ సెన్సేషన్ అనికేత్ వర్మ
హెడ్ 47పరుగులు, నితీశ్ 32, క్లాసెన్ 26 పరుగులకే అవుట్ అయినా సన్ రైజర్స్ 190 పరుగుల భారీ స్కోరునే కొట్టిందంటే కారణం ఈ చిన్న కుర్రాడు అనికేత్ వర్మ. ఈ ఏడాది ఐపీఎల్ లో అరంగ్రేట్రం చేసిన ఈ 23ఏళ్ల కుర్రాడు 13 బంతుల్లో 5 భారీ స్కోర్లతో చేసిన 36 పరుగులు గొప్ప ఎమర్జింగ్ సెన్సేషన్ ను తలపించాయి. ఇంకా చాలా పెద్ద టోర్నమెంట్ కాబట్టి చూడాలి ఈ కుర్రాడు ఎంత దూరం వెళ్తాడో..చివర్లో కెప్టెన్ కమిన్స్ కొట్టిన 3 సిక్సర్లు స్కోరు బోర్డు పై సన్ రైజర్స్ 190 పరుగులకు తీసుకెళ్లి లక్నోకు 191 పరుగుల టార్గెట్ ఇవ్వగలిగాయి.
4. మైటీ మిచ్ మార్ష్
సన్ రైజర్స్ బ్యాటింగ్ లో ఎంత డెప్త్ ఉందో బౌలింగ్ లో నూ అంతే నాణ్యత ఉంది. కమిన్స్, జంపా, షమి, హర్షల్ పటేల్ లాంటి ఎక్స్ పీరియన్స్డ్ బౌలర్స్ ఎదుర్కోవాలంటే అంతకు మించిన సత్తా చూపించాలి. సరిగ్గా మిచ్ మార్ష్ అదే చేశాడు. మార్ క్రమ్ ఔటైనా ఓ ఎండ్ లో నికోలస్ పూరన్ విరుచుకుపడుతున్నా మిచ్ మార్ష్ సంయమనంతో ఆడి హాఫ్ సెంచరీ కొట్టాడు. 31 బాల్స్ లోనే 7 ఫోర్లు 2 సిక్సర్లతో 51పరుగులు చేసి విన్నింగ్ లో భాగస్వామయ్యాడు.
5. పూనకాల పూరన్
పూరన్ టచ్ లో ఉంటే ఇంకెవ్వరూ నాలా ఆడలేరు అన్నట్లు ఆడతాడు అని చెప్పటానికి ఇవాళ్టి మ్యాచే ఉదాహరణ. కేవలం 26 బంతుల్లో అంటే మహాఅయితే నాలుగు ఓవర్లు అంతే ఆడి...6ఫోర్లు, 6 సిక్సర్లు బాది ఏకంగా 70 పరుగులు చేశాడు. పూనకాలు కాకపోతే ఏంటిది..అస్సలు తగ్గలేదు ఎక్కడా...వరుసగా పూరన్, మిచ్ మార్ష్ అవుటైనా పంత్ మళ్లీ ఫెయిలైనా డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్ కలిసి మిగిలిన పనిని పూర్తి చేసి ఇంకా నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే ప్రమాదకర సన్ రైజర్స్ పై లక్నోకు 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు.





















